Biden: తప్పుడు సమాచారం ప్రజల్ని చంపేస్తోంది..!

కరోనావైరస్, టీకాల గురించిన తప్పుడు సమాచార వ్యాప్తిపై సామాజిక మాధ్యమాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 17 Jul 2021 15:37 IST

సామాజిక మాధ్యమ సంస్థలపై బైడెన్ ఆగ్రహం

వాషింగ్టన్‌: సామాజిక మాధ్యమాల్లో  కరోనావైరస్, టీకాల గురించిన తప్పుడు సమాచార వ్యాప్తిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారంతో ప్రజల్ని చంపేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ తప్పుడు సమాచారం ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించిందంటూ యూఎస్‌ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి ఆందోళన వ్యక్తం చేసిన మరుసటి రోజే బైడెన్ నోట ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. కాగా, తప్పుదోవపట్టించే సమాచారాన్ని తొలగించడంలో, ఫ్లాగ్ చేయడంలో దూకుడుగా వ్యవహరించాలని వైట్‌హౌస్ సామాజిక మాధ్యమ సంస్థలకు సూచించింది.

తప్పుడు సమాచార వ్యాప్తిపై మీడియా అడిగిన ప్రశ్నకు బైడెన్ స్పందిస్తూ..‘మనకున్న మహమ్మారి టీకా తీసుకోని వారి మధ్యే ఉంది. సామాజిక మాధ్యమ సంస్థలు తప్పుడు సమాచారంతో ప్రజల్ని చంపేస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు. కరోనా.. టీకా తీసుకోని వారి మహమ్మారిగా మారుతోందంటూ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌ అండ్ ప్రివెన్షన్( సీడీసీ) కూడా ఇదే తరహాలో స్పందించింది. అలాగే ‘ప్రజారోగ్యానికి, ప్రజల జీవితానికి తప్పుడు సమాచారం ముప్పుగా మారింది. మనమంతా కలిసి దాన్ని ఎదుర్కోవాలి’ అంటూ వివేక్ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా అమెరికా, భారత్‌లో తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యుల్ని కోల్పోయానని ఈ సందర్భంగా వెల్లడించారు. టీకా తీసుకోవాల్సిన ఆవశ్యకతను వెల్లడిస్తూ ఈ విషయాన్ని చెప్పారు.

డెల్టా ముప్పు.. టీకా తీసుకోని వారిలో మరణాలు..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా రకం డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది. అలాగే అమెరికాలో టీకాలు తీసుకోని ప్రజల్లో మరణాల పెరుగుదలకు ఈ వేరియంట్‌ కారణం అవుతోందని అమెరిన్ సీడీసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ దేశంలో ముందు వారంతో పోలిస్తే కేసులు 70 శాతం పెరగ్గా.. మరణాలు 26 శాతం ఎక్కువయ్యాయి. టీకా కవరేజ్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు సీడీసీ వెల్లడించింది. కరోనా కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో 97 శాతం మంది టీకా తీసుకోనివారేనని నిగ్గుతేల్చింది. ‘టీకా కవరేజ్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి కనిపిస్తోంది. టీకా వేయించుకోని ప్రజలు ప్రమాదంలో ఉన్నారు’ అని పేర్కొంది. ఇదిలా ఉండగా.. మొదట భారత్‌లో గుర్తించిన డెల్టా వేరియంట్ ఇప్పటికే 100కు పైగా దేశాలకు విస్తరించింది. పలు దేశాల్లో పెరుగుతోన్న కేసులకు ఈ రకమే ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన సంగతి తెలిసిందే. సంస్థ దీన్ని భౌగోళిక ముప్పుగా అభివర్ణించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని