Petrol Tax: ఆ ₹4 లక్షల కోట్లను రాష్ట్రాలకు పంచండి.. కేంద్రానికి మమతా బెనర్జీ డిమాండ్‌

ఇప్పటివరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో సేకరించిన రూ.4లక్షల కోట్లను అన్ని రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేయాలని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Published : 09 Nov 2021 20:28 IST

కోల్‌కతా: దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించడంతో ఇంధన ధరలు కాస్త తగ్గాయి. పలు రాష్ట్రాలు కూడా వ్యాట్‌ తగ్గించాయి. కానీ, ఎన్డీయేతర రాష్ట్రాలు మాత్రం అందుకు ససేమిరా అంటున్నాయి. అంతేకాకుండా కేంద్రంపైనే పలు రాష్ట్రాలు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరికొత్త డిమాండ్‌తో ముందుకొచ్చారు. ఇప్పటివరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో సేకరించిన రూ.4 లక్షల కోట్లను అన్ని రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేయాలన్నారు. కేవలం కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించారని దుయ్యబట్టారు.

రాష్ట్రాలకు డబ్బులు ఎక్కడ నుంచి..?

‘గతకొన్ని నెలలుగా వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను విపరీతంగా పెంచడంతో కేంద్ర ప్రభుత్వానికి రూ.4 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. ఇప్పుడు మాత్రం రాష్ట్రాలను వ్యాట్‌ తగ్గించాలని వారు (BJP) కోరుతున్నారు. అలాచేస్తే ఇక రాష్ట్రాలకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది..? అందుకే ఆ నాలుగు లక్షల కోట్ల రూపాయలను అన్ని రాష్ట్రాలకు సమానంగా పంచాలి’ అని బెంగాల్‌ అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలకు పలు సబ్సిడీలను అందిస్తున్నామని అన్నారు.

పలు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్నందునే కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించే ప్రయత్నం చేస్తోందని మమత విమర్శించారు. ‘ఎప్పుడైతే ఎన్నికలు సమీపిస్తాయో.. వాళ్లు (కేంద్రం) ధరలను తగ్గిస్తారు. అవి ముగిసిన వెంటనే మళ్లీ పెంచుతూ పోతారు. ఇంధన ధరలపై మాకు పాఠాలు చెబుతున్న వారు.. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బు ఎక్కడ నుంచి వస్తుందో సమాధానం చెప్పాలి. ముందుగా రాష్ట్రాలకు రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి’ అని మమతా బెనర్జీ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చమురుపై వ్యాట్‌ తగ్గించకుంటే ఉద్యమం చేపడతామని చెబుతున్న రాష్ట్ర భాజపా తీరుపై ఆమె విరుచుకుపడ్డారు. ఇక పశ్చిమ బెంగాల్‌కు వ్యాక్సిన్‌లను తక్కువగా అందజేయడంపైనా కేంద్రం తీరును ఎండగట్టారు. ఉత్తర్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాలతో పోలిస్తే తమకు వ్యాక్సిన్‌లను తక్కువగా కేటాయిస్తున్నారని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని