CoronaVaccine: అమెరికాలో అతి త్వరలోనే పిల్లలకు టీకా

అమెరికాలో అతి త్వరలోనే 5-11 ఏళ్ల పిల్లలకు కరోనా టీకాలు వేసేందుకు అక్కడి ప్రభుత్వం పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది. పిల్లల టీకాకు సంబంధించి ఫైజర్‌ సంస్థకు అనుమతులు రావడం

Published : 21 Oct 2021 07:49 IST

రెండు వారాల్లో అనుమతులు!

పంపిణీకి యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు

వాషింగ్టన్‌: అమెరికాలో అతి త్వరలోనే 5-11 ఏళ్ల పిల్లలకు కరోనా టీకాలు వేసేందుకు అక్కడి ప్రభుత్వం పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది. పిల్లల టీకాకు సంబంధించి ఫైజర్‌ సంస్థకు అనుమతులు రావడం ఆలస్యం చిన్న పిల్లల ఆసుపత్రులు, ఔషధ దుకాణాలు, పాఠశాలల్లోనూ టీకా పంపిణీ కార్యక్రమాలను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈమేరకు శ్వేతసౌధం టీకా పంపిణీ ప్రణాళికను బుధవారం వెల్లడించింది. నవంబరు 2-3 తేదీల్లో వ్యాధి నియంత్రణ, నివారణ సలహా మండలి నిపుణులు సమావేశమై పిల్లలకు టీకా వినియోగ అనుమతులపై తుది చర్చలు జరపనున్నారు. ఇప్పటికే పలు అధ్యయనాలు పిల్లల్లో టీకా వినియోగం సురక్షితమని తేల్చిన నేపథ్యంలో నిపుణుల బృందం కూడా అనుమతులు మంజూరు చేయడం లాంఛనమే అని ప్రభుత్వం విశ్వాసంతో ఉంది. ఆ భేటీ ముగిసిన గంటల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా పిల్లల టీకాలను, వాటికి అవసరమైన చిన్నసూదులను యుద్ధప్రాతిపదికన తరలించనుంది. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే పిల్లలకు వాటిని అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రభుత్వం ఇప్పటికే 2.8 కోట్ల పిల్లలకు అవసరమైన ఫైజర్‌ టీకాలను సమీకరించినట్లు అధికారులు తెలిపారు. వీటిని పంపిణీ చేసేందుకు ఇప్పటికే వ్యాక్సినేషన్‌ నిర్వహిస్తున్న వేల సంఖ్యలో ఔషధ దుకాణాలకు అదనంగా 25 వేలకు పైగా చిన్న పిల్లల వైద్యులు, ప్రాథమిక సంరక్షణ కేంద్రాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. పిల్లల టీకా కార్యక్రమాన్ని ఆగమేఘాల మీద చేపట్టడానికి వందల కొద్దీ పాఠశాలలు, కమ్యూనిటీ కేంద్రాల్లో శిబిరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని