World Bank: పాఠశాలలు పునఃప్రారంభం.. టీకాల కోసం వేచిచూడొద్దు!

విస్తృతంగా టీకా పంపిణీ చేసేవరకూ పాఠశాలలు తెరవకుండా విద్యా సంస్థలు వేచిచూడవద్దని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.

Published : 03 Oct 2021 23:37 IST

ప్రపంచ బ్యాంక్‌ నివేదిక

దిల్లీ: ప్రపంచదేశాలను కరోనా వైరస్‌ మహమ్మారి వణికిస్తున్నప్పటికీ..  చిన్నారులు ఈ వైరస్‌ బారినపడే అవకాశాలు తక్కువేనని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విస్తృతంగా టీకా పంపిణీ చేసేవరకూ పాఠశాలలు తెరవకుండా విద్యా సంస్థలు వేచిచూడవద్దని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. వ్యాక్సిన్‌ రూపొందించక ముందే పలు దేశాల్లో పాఠశాలలు తెరిచినప్పటికీ.. పరిస్థితులు సురక్షితమేనన్న విషయం రుజువయ్యిందని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. ఈ తరుణంలో భారీ స్థాయిలో టీకా పంపిణీ చేపట్టకపోయినా పాఠశాలలు తెరవడం వల్ల తీవ్ర ఇబ్బందులేమీ ఉండకపోవచ్చని సూచించింది.

కరోనా వైరస్‌ విజృంభణతో ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇదే సమయంలో పలు దేశాలు పాఠశాలలను తిరిగి ప్రారంభించాయి. ఇలా వైరస్‌ తీవ్రతను తగ్గించే వ్యూహాలను అమలు చేస్తూ పాఠశాలలు తిరిగి తెరవడం వల్ల పిల్లలు, సిబ్బంది మధ్య వైరస్‌ సంక్రమణ ప్రమాదం తక్కువేనని ప్రపంచ బ్యాంకు విద్యావిభాగ బృందం తాజా నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా ప్రీ-పైమరీ, ప్రైమరీ పాఠశాలల్లోనూ వైరస్‌ సంక్రమణ తక్కువగానే ఉన్న విషయం రుజువవుతోంది పేర్కొంది. కేవలం పాఠశాల సిబ్బందికి తోటి సిబ్బంది నుంచి మాత్రమే వైరస్‌ సోకే ప్రమాదం ఉంటుందని.. పిల్లల నుంచి కాదని ప్రపంచ బ్యాంకు నివేదిక స్పష్టం చేసింది.

పాఠశాలలు తిరిగి తెరవడం వల్ల వైరస్‌ సంక్రమణ పెరుగుతుందని ప్రభుత్వాలు, ఉపాధ్యాయులు లేదా తల్లిదండ్రులు భయపడుతున్న చోట మాత్రమే పాఠశాలలు ఇంకా తెరచుకోలేదు. అయితే, పాఠశాలలను మూత వేయడం వల్ల వైరస్‌ సంక్రమణ ముప్పును మాత్రమే తొలగిస్తుంది. కానీ, దీనివల్ల పిల్లల అభ్యసన, మానసిక ఆరోగ్యంతో పాటు వారి పూర్తి అభివృద్ధికి తీవ్ర ముప్పు కలిగిస్తుందని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. స్కూళ్లు తెరిస్తే వచ్చే ముప్పు కంటే అవి తెరవకపోవడం వల్ల కలిగే నష్టాలే అధిక రెట్లు ఎక్కువని స్పష్టం చేసింది. అందుచేత కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించే వ్యూహాలను అమలు చేస్తూ విద్యా సంస్థలు కొనసాగించాలని ప్రపంచ బ్యాంకు సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని