Delta Variant: యూరప్‌ దేశాలను వణికిస్తోన్న డెల్టా వేరియంట్‌!

యూరప్‌లోనూ డెల్టా వేరియంట్‌ ప్రాబల్యం అధికంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దీంతో వైరస్‌ వ్యాప్తి కట్టడి ముమ్మరంగా చేపట్టాలని WHOతోపాటు యూరోపియన్‌ సీడీసీ స్పష్టం చేశాయి.

Published : 26 Jul 2021 21:18 IST

19 దేశాల్లో ఈ రకానిదే ఆధిపత్యమన్న WHO, ఐరోపా సీడీసీ

లండన్‌: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ చాలా దేశాల్లో మరోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా కొత్తగా వెలుగు చూసిన డెల్టా వేరియంట్‌ ప్రభావం చాలా దేశాల్లో అధికంగా ఉన్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూరప్‌లోనూ డెల్టా వేరియంట్‌ ప్రాబల్యం అధికంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. దీంతో వైరస్‌ వ్యాప్తి కట్టడి ముమ్మరంగా చేపట్టాలని WHOతో పాటు యూరోపియన్‌ సీడీసీ స్పష్టం చేశాయి. ఇవే పరిస్థితులు కొనసాగితే మరికొన్ని రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్‌ బలంగా ప్రబలే ప్రమాదముందని అప్రమత్తం చేశాయి.

కరోనా వైరస్‌ ప్రాబల్యాన్ని అంచనా వేసేందుకు యూరప్‌ ఆరోగ్య విభాగాలు ఎప్పటికప్పుడు పాజిటివ్‌ కేసులకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపడుతున్నాయి. ఇందులో భాగంగా జూన్‌ 28నుంచి జులై 11 మధ్య కాలంలో యూరప్‌ దేశాల్లో నమోదైన కేసుల్లో డెల్టా వేరియంట్‌వే అధికంగా ఉన్నట్లు యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ (ECDE) వెల్లడించింది. ముఖ్యంగా యూరప్‌లోని 28 దేశాల్లో కనీసం 19 దేశాల్లో డెల్టా రకం ప్రభావమే ఎక్కువగా ఉందని సీడీసీ నిపుణులు కనుగొన్నారు. ఈ 19దేశాల పాజిటివ్‌ కేసుల్లో సరాసరిగా 68.3శాతం కేసులు డెల్టా వేరియంట్‌ కేసులే ఉన్నట్లు గుర్తించారు. అంతకుముందు వ్యాప్తి చెందిన ఆల్ఫా వేరియంట్‌ ప్రాబల్యం కేవలం 22.3శాతం మాత్రమే ఉందన్నారు. దీంతో డెల్టా వేరియంట్‌ విస్తృత స్థాయిలో వ్యాప్తి చెందుతుందనే నిర్ధారణకు వచ్చారు. దాదాపు అన్ని యూరప్‌ దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

అమెరికాలోనూ 83శాతం కేసుల్లో డెల్టా..

అమెరికాలోనూ డెల్టా వేరియంట్‌ ప్రభావం అధికంగా ఉన్నట్లు తాజా నివేదికల్లో వెల్లడైంది. ప్రస్తుతం బయటపడుతోన్న పాజిటివ్‌ కేసుల్లో దాదాపు 83శాతం ఇవే ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా వుహాన్‌ రకంతో పోలిస్తే.. డెల్టా వేరియంట్‌ సోకిన వ్యక్తి నుంచి వెయ్యి రెట్లు ఎక్కువగా వైరస్‌ వెలువడుతున్నట్లు ఒక అధ్యయనం తేల్చింది. డెల్టా వల్ల ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం, ఐసీయూలో చికిత్స తీసుకోవాల్సి రావడం, మరణం ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటాయని మరో పరిశోధన పేర్కొంది. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకర వేరియంట్‌గా డెల్టా రకం మారే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుచేత వైరస్‌ కట్టడి చర్యలు ముమ్మరంగా చేపట్టాలని సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని