ZyCoV-D: చిన్నారుల టీకా.. జైడస్‌ క్యాడిలా ధర ఎంతంటే?

జైడస్‌ క్యాడిలా రూపొందించిన కొవిడ్‌ టీకా జైకోవ్‌-డీ (Zycov-D) ధరను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు కనిపిస్తోంది. ఒక డోసు ధర రూ.265కు ఇచ్చేందుకు జైడిస్‌ క్యాడిలా అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

Published : 31 Oct 2021 22:45 IST

ఫలించిన కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు..!

దిల్లీ: జైడస్‌ క్యాడిలా రూపొందించిన కొవిడ్‌ టీకా జైకోవ్‌-డీ (Zycov-D) ధరను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు కనిపిస్తోంది. ఒక డోసు ధర రూ.265కు ఇచ్చేందుకు జైడిస్‌ క్యాడిలా అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, వీటిపై ఇరు వర్గాలు ఓ తుది నిర్ణయం మాత్రం ఇంకా తీసుకోలేదని తెలిపాయి. సూది అవసరం లేకుండానే పంపిణీ చేసే ఈ టీకా కోసం ప్రత్యేకంగా ఓ పరికరాన్ని వాడనున్నారు. దీని ధర కలుపుకొని మొత్తంగా జైకోవ్‌-డీ ఒక డోసు ధర రూ.358 కానున్నట్లు సమాచారం.

దేశంలో 12 ఏళ్ల వయసు పైబడిన పిల్లల కోసం అనుమతి పొందిన తొలి టీకాగా జైకోవ్‌-డీ నిలిచింది. అయితే, మూడు డోసుల్లో తీసుకోవాల్సిన ఈ టీకాను తొలుత రూ.1900కు అందజేస్తామని జైడస్‌ క్యాడిలా ప్రతిపాదించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న టీకాలతో పోలిస్తే జైడస్‌ ధర ఎక్కువగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థతో సంప్రదింపులు జరిపింది. దీంతో చివరకు ఒక డోసును రూ.265కు ఇచ్చేందుకు జైడస్‌ అంగీకరించినట్లు సమాచారం. అయితే, సూది లేకుండా వాడిపారేసే జెట్‌ అప్లికేటర్‌ను వినియోగించనున్నందున అందుకు కావాల్సిన ధర రూ.93 కలుపుకొని.. ఒక డోసు మొత్తానికి రూ.358 అవనున్నట్లు తెలుస్తోంది. వీటిపై తుది ప్రకటన మాత్రం ఈ వారంలోనే వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

మూడు డోసుల్లో తీసుకోవాల్సిన జైడస్‌ క్యాడిలా టీకాను 28రోజుల వ్యవధి చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది. గుజరాత్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా రూపొందించిన ఈ టీకా.. ప్రపంచంలోనే అనుమతి పొందిన డీఎన్‌ఏ ఆధారిత తొలి కరోనా టీకాగా నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని