6 గంటలు నిలబడి ఓటేస్తే అరెస్టు చేశారు!

ఎన్నికల్లో భాగంగా నిర్వహించే పోలింగ్‌లో పాల్గొని ఓటు వేయడానికి చాలా మంది బద్దకిస్తుంటారు. ఎన్ని వసతులు కల్పించినా.. గంటలకొద్ది క్యూలో నిలబడి ఓటు వేయాలా? అంత ఓపిక నాకు లేదు.. నేను ఒక్కడిని ఓటు వేయకపోతే ఏం కాదులే అని రాజ్యాంగం కల్పించిన ఓటు

Published : 14 Jul 2021 01:19 IST

వాషింగ్టన్‌: ఎన్నికల్లో భాగంగా నిర్వహించే పోలింగ్‌లో పాల్గొని ఓటు వేయడానికి చాలా మంది బద్దకిస్తుంటారు. ఎన్ని ఏర్పాట్లు,, వసతులు కల్పించినా.. గంటలకొద్ది క్యూలో నిలబడి ఓటు వేయాలా? అంత ఓపిక నాకు లేదు.. నేను ఒక్కడిని ఓటు వేయకపోతే ఏం కాదులే అని రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పట్టించుకోరు. కానీ, టెక్సాస్‌కు చెందిన హెర్విస్‌ రోగర్స్‌ అనే వ్యక్తి గతంలో జరిగిన రెండు ఎన్నికల్లో తన వంతు బాధ్యతగా చక్కగా ఓటు హక్కు వినియోగించుకున్నాడు. పౌరుడిగా అది తన కర్తవ్యమని భావించాడు.. కానీ, అతడు వేసిన ఓట్లు చట్టవిరుద్ధమని ఇటీవల తేలింది. దీంతో 62 ఏళ్ల ఆ వ్యక్తికి 40 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముందని న్యాయనిపుణులు చెబుతున్నారు.

అమెరికాలో గతేడాదంతా దేశాధ్యక్ష ఎన్నికల కోలాహలం నెలకొన్న విషయం తెలిసిందే. సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియలో యూఎస్‌లోని వివిధ రాష్ట్రాల్లో ప్రజలు విడతల వారీగా ఓట్లు వేశారు. ఆ ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ పార్టీ గెలుపొందింది. అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో భాగంగా గతేడాది మార్చిలో హెర్విస్‌ రోగర్స్‌ ఆరు గంటలు క్యూలో నిల్చుని మరి ఓటు వేశాడు. దీంతో అతడి అంకితభావానికి అందరూ మెచ్చుకున్నారు. మీడియా అతడి గురించి కథనాలు రాయడంతో స్థానికంగా పాపులరయ్యాడు. అయితే, ఇటీవల అతడు వేసిన ఓటు చట్టవిరుద్ధమని పోలీసులు గుర్తించారు. స్థానిక చట్టాల ప్రకారం నేరాలకు పాల్పడి జైలు శిక్షపడ్డ వ్యక్తులు ఓటు వేయడానికి అనర్హులు. కాగా.. 20 ఏళ్ల కిందట హెర్విస్‌ రెండు నేరాలు చేసి జైలుకెళ్లాడు. ప్రస్తుతం పెరోల్‌పై బయట ఉంటున్నాడు. నేరస్థులు ఓటు వేయడానికి అనర్హులనే విషయం తెలియక హెర్విస్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడట. 2018లో జరిగిన మద్యంతర ఎన్నికలోనూ హెర్విస్‌ ఓటు వేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రెండుసార్లు చట్టవిరుద్ధంగా ఓటు వేసిన హెర్విస్‌కు నేరానికి 20ఏళ్ల చొప్పున మొత్తం రెండు నేరాలకు కలిపి 40ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందట.

ప్రస్తుతం ఈ కేసుపై కోర్టు విచారణ జరుపుతోంది. హెర్విస్‌కు తను ఓటు వేయడానికి అనర్హుడనే విషయం తెలియక ఓటు వేశాడని అతడి తరఫు న్యాయవాది టెక్సాస్‌ అటార్నీ అండ్రీ సెగురా వెల్లడించారు. చిన్న చిన్న తప్పులకు పెద్ద శిక్షలు వేయడం తగదన్నారు. హెర్విస్‌ను కాపాడేందుకు కృషి చేస్తానని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని