Biden : ట్రింగ్‌.. ట్రింగ్‌.. హలో నేను బైడెన్‌..!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు నేడు ఫోన్‌ చేశారు. ఆయన ఆఫీస్‌లో అడుగుపెట్టిన తర్వాత

Updated : 11 Sep 2021 13:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు నేడు ఫోన్‌ చేశారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిన్‌పింగ్‌కు ఫోన్‌చేసి మాట్లాడం ఇది రెండోసారి. ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. అమెరికా-చైనా మధ్య పోటీ వివాదంగా మారకుండా తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడుకొన్నట్లు సమాచారం. ఇప్పటికే వాణిజ్యం, గూఢచర్యం, కరోనా విషయాల్లో చైనా-అమెరికా మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే.

‘‘ఇరువురు నాయకులు విస్తృతమైన, వ్యూహాత్మక అంశాలపై చర్చించుకొన్నారు. ఇరు దేశాల అవసరాలు, విలువలు, విధానాలు ప్రస్తావనకు వచ్చాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న పోటీ విషయంలో అమెరికా తీసుకొంటున్న చర్యలను అధ్యక్షుడు బైడెన్‌ స్పష్టంగా వెల్లడించారు’’ అని శ్వేత సౌధం ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ ఫోన్‌కాల్‌పై చైనా బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థ సీసీటీవీ స్పందించింది. ఇరు పక్షాలు వ్యూహాత్మక అంశాలపై లోతుగా చర్చించుకొన్నట్లు పేర్కొంది. చైనా-అమెరికాల మధ్య సంబంధాలను సరైన మార్గంలో నడిపిస్తే అది ప్రపంచానికి చాలా ప్రయోజనకరమని షీజిన్‌పింగ్‌ అభిప్రాయడ్డారని సీసీటీవీ వెల్లడించింది.

చైనాలోని కింది స్థాయి అధికారులు అమెరికాతో చర్చలకు సానుకూలంగా స్పందించకపోవడంపై బైడెన్‌ అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నేడు ఆయనే చొరవ తీసుకుని చైనా అధినేతకు ఫోన్‌ చేసి మాట్లాడారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని