US blacklist: చైనా, పాక్‌కు షాకిచ్చిన అమెరికా..!

అమెరికాలోని బైడెన్‌ సర్కారు చైనాకు షాక్‌ ఇచ్చింది. తాజాగా మరికొన్ని చైనా కంపెనీలను ట్రేడ్‌ బ్లాక్‌ లిస్ట్‌ (ఎన్టిటీ లిస్ట్‌)లో చేర్చింది. సదరు కంపెనీలు అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా మారడం, విదేశాంగ విధానాల్లో ఇబ్బందికర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొంది. వీటిల్లో కొన్ని కంపెనీలు చైనా సైన్యం క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సాంకేతికతను

Published : 26 Nov 2021 01:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలోని బైడెన్‌ సర్కారు చైనాకు షాక్‌ ఇచ్చింది. తాజాగా మరికొన్ని చైనా కంపెనీలను ట్రేడ్‌ బ్లాక్‌ లిస్ట్‌ (ఎన్టిటీ లిస్ట్‌)లో చేర్చింది. సదరు కంపెనీలు అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా మారడం, విదేశాంగ విధానాల్లో ఇబ్బందికర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొంది. వీటిల్లో కొన్ని కంపెనీలు చైనా సైన్యం క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు సాయం చేస్తున్నాయని పేర్కొన్నారు. బైడెన్‌-జిన్‌పింగ్‌ మధ్య సమావేశం జరిగిన కొన్ని రోజుల్లో అమెరికా ఈ కంపెనీలపై కొరడా ఝుళిపించింది. మరోపక్క తైవాన్‌పై ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడటం విశేషం. 

పాకిస్థాన్‌ సంస్థలు కూడా..

ఈ జాబితాలో ఎనిమిది చైనా టెక్‌ కంపెనీలను అమెరికా చేర్చింది. ఈ కంపెనీలు అమెరికా తయారు చేసిన పరికరాలను కొనుగోలు చేసి చైనా సైన్యం క్వాంటం కంప్యూటింగ్‌ బలోపేతానికి సాయం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ట్రంప్‌  పాలనాకాలం నుంచి ఈ ఎన్టిటీ జాబితాను జాతీయ భద్రతా కారణాలకు కూడా వినియోగించడం అధికం చేశారు. దీంతోపాటు పాకిస్థాన్‌ అణు, క్షిపణి కార్యక్రమానికి సహకరిస్తున్నాయనే ఆరోపణలపై పాక్‌, చైనాకు చెందిన మొత్తం 16 మంది వ్యక్తులు, సంస్థలను కూడా ఈ జాబితాలో చేర్చారు. చైనా, జపాన్‌, పాకిస్థాన్‌, సింగపూర్‌లకు చెందిన మొత్తం 27 కొత్త సంస్థలు ఈ జాబితాలో చేరాయి. దీంతోపాటు రష్యాకు చెందిన ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ ఫిజిక్స్‌’ అండ్‌ టెక్నాలజీ పేరును ఎండ్‌ యూజర్‌ జాబితాలో పెట్టారు. ఈ సంస్థ ఎటువంటి సైనిక పరికరాలను తయారు చేస్తోందో మాత్రం వెల్లడించలేదు. 

‘‘ఈ జాబితా ఫలితంగా చైనా, రష్యాలకు అమెరికా నుంచి టెక్నాలజీ అందకుండా చేసే అవకాశం ఉంది. అంతే కాదు, పాక్‌ వంటి దేశాలు అసురక్షిత విధానాల్లో అణు కార్యకలాపాలు, క్షిపణి కార్యకలాపాలను నిర్వహించకుండా అడ్డుకోవచ్చు’’ అని అమెరికా కామర్స్‌ సెక్రటరీ గినా రైమోండో పేర్కొన్నారు. ఈ జాబితాలో ఉన్న కంపెనీలకు అమెరికా పరికరాలు సరఫరా చేయాలంటే ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని