Beijing Winter Olympics: జిన్‌పింగ్‌తో గేమ్‌ మొదలుపెట్టిన బైడెన్‌..!

చైనాకు దౌత్యపరంగా అతిపెద్ద దెబ్బతగిలింది. ఏదైతే జరుగుతుందని షీజిన్‌పింగ్‌ భయపడ్డారో అదే వాస్తవరూపం ధరించింది. 2022 బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.

Updated : 07 Dec 2021 14:52 IST

 2022 బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌పై అమెరికా దౌత్య బహిష్కరణ 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

చైనాకు దౌత్యపరంగా అతిపెద్ద దెబ్బ తగిలింది. ఏదైతే జరుగుతుందని షీజిన్‌పింగ్‌ భయపడ్డారో.. అదే వాస్తవ రూపం దాల్చింది. 2022 బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. శ్వేతసౌధం నుంచి ప్రతినిధులు ఎవరూ ఈ ఒలింపిక్స్‌లో పాల్గొనరని స్పష్టం చేసింది. చైనాలో మానవహక్కుల ఉల్లంఘనల కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు చెప్పింది. శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ జెన్‌సాకీ ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ధ్రువీకరించారు. వీటికి సంబంధించిన ఉత్సవాల్లో తమ సిబ్బంది పాల్గొనరని వెల్లడించారు. ‘‘జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘనల నేపథ్యంలో పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా దీనిని ప్రచారం కోసం వాడుకొంటోందని అమెరికా భావిస్తోంది. మేము ఆ పనిచేయలేం. కానీ, ఈ క్రీడల కోసం కఠినంగా సాధన చేసిన అథ్లెట్లను శిక్షించాలని అమెరికా అనుకోవడంలేదు. అందుకే మా అధికారిక దౌత్య బృందాన్ని మాత్రం 2022 క్రీడలకు పంపకపోవడం చైనాకు సరైనా సందేశాన్ని ఇస్తుంది’’ అని తెలిపారు. చైనా పరపతిని నేరుగా ఢీకొనే క్రమంలో అమెరికా తీసుకొన్న తొలి నిర్ణయం ఇది.

డిప్లొమేటిక్‌ బాయ్‌కాట్‌ అంటే..?

డిప్లొమేటిక్‌ బాయ్‌కాట్‌ అంటే క్రీడలను బాయ్‌కాట్‌ చేయడం కాదు. అథ్లెట్లు హాజరై క్రీడల్లో పాల్గొంటారు. కానీ, ఒలింపిక్స్‌లో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమం, ముగింపు కార్యక్రమం వంటి వాటికి దేశాధినేతలు, కీలక అధికారులు హాజరుకాకపోవడం. ఇలా చేయడం వల్ల ఆ ఒలింపిక్స్‌ ప్రాధాన్యం తగ్గిపోతుంది.  అదే సమయంలో చైనా వీఘర్ల పట్ల చేస్తున్న అత్యాచారాలు ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచి చర్చనీయాంశాలు అవుతాయి. ఆ రకంగా చైనాపై ఒత్తిడి పెరుగుతుంది.

పరువు కాపాడుకొనేందుకు చైనా అవస్థ..

వాస్తవానికి అమెరికా ఈ నిర్ణయం తీసుకొంటుందని చైనా కొన్ని నెలల ముందే అనుమానించింది. దీంతో పరువు  కాపాడుకొనేందుకు కొన్ని రోజులుగా కొత్త ప్రచారం మొదలుపెట్టింది. కొవిడ్‌ నిబంధనలు కారణంగా అతిథులను ఆహ్వానించడం లేదని చెబుతోంది. మరోవైపు అమెరికా నిర్ణయంపై వాషింగ్టన్‌లోని దౌత్యకార్యాలయం మండిపడింది. ‘‘ఒలింపిక్‌ చార్టర్‌ స్ఫూర్తిని అమెరికా వక్రీకరిస్తోంది. అసలు వీరు క్రీడా సంబరాలకు వస్తారా..? రారా..? అన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోరు. 2022 బీజింగ్‌  వింటర్‌ ఒలింపిక్స్ విజయవంతం అవుతాయా.. లేదా అన్న అంశంపై ఇది ఏమాత్రం ప్రభావం చూపదు. అసలు అమెరికా రాజకీయ ప్రతినిధులకు ఆహ్వానమే లేదు. అలాంటప్పుడు దౌత్య బహిష్కారానికి అవకాశం ఎక్కడుంది?’’ అని చైనా ప్రతినిధి  ల్యూపెంగై పేర్కొన్నారు.

ఇక చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ స్పందిస్తూ ‘‘అమెరికా ఒంటెత్తు పోకడలకు పోతే దానికి ప్రతిస్పందన ఉంటుంది. వింటర్‌ ఒలింపిక్స్‌ అనేవి రాజకీయాలకు, వక్రీకరణలకు వేదిక కావని నొక్కి చెబుతున్నాను’’ అని పేర్కొన్నారు.

బాయ్‌కాట్‌పై అప్పుడే ఆన్‌లైన్‌ సెన్సారింగ్‌..

చైనా అప్పుడే ఆన్‌లైన్‌ కత్తికి పదునుపెట్టడం మొదలుపెట్టింది. చైనా సోషల్‌ మీడియా వేదిక ‘విబో’లో వింటర్‌ ఒలింపిక్స్‌ బాయ్‌కాట్‌ అనే పదాన్ని సెన్సార్‌ చేశారు. మంగళవారం ఉదయం నాటికి పూర్తిగా తొలగించారు. ఇక గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక ప్రచురించిన వార్త కింద కామెంట్లలో చాలా వరకూ ఎడిట్‌ చేశారు.  మొత్తం 1500 వరకు కామెంట్లు వస్తే కేవలం చైనాకు అనుకూలంగా ఉన్న 8 మాత్రమే ఉంచారు.

అమెరికా నిర్ణయానికి కారణమేంటీ..?

వీఘర్‌ ముస్లింల విషయంలో చైనా అనుసరిస్తున్న వైఖరితో బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ -2022కు ఇబ్బందికరంగా మారింది. ఒలింపిక్స్‌ను ప్రపంచ దేశాలు బహిష్కరించడం గానీ, వేదికను మార్చడం గానీ చేయాలన్న డిమాండ్లు చాలా రోజులుగా ఉన్నాయి. ఈ ఏడాది మే నాటికే 180కిపైగా మానవ హక్కుల సంస్థలు ఈ ఒలింపిక్స్‌ను బహిష్కరించాలనే డిమాండ్లను ప్రభుత్వాల ముందు పెట్టాయని ‘ది గార్డియన్‌ ’ పత్రిక పేర్కొంది.

ఫలించిన పెలోసీ ప్రయత్నం..!

వీఘర్లపై అత్యాచారాలను నిరోధించేందుకు ఒలింపిక్స్‌ను ఆయుధంగా వాడాలని అమెరికాలో అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరైనా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ ప్రయత్నాలు మొదలుపెట్టారు.  కొన్ని నెలల క్రితం అమెరికా కాంగ్రెస్‌ విచారణలో మాట్లాడుతూ చైనా వీఘర్లపై చేస్తున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా బీజింగ్‌లో 2022లో జరిగే ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరించాలని(డిప్లొమేటిక్‌ బాయ్‌కాట్‌) పిలుపునిచ్చారు. తాజా నిర్ణయంపై పెలోసీ స్పందిస్తూ..‘‘అమెరికా అయినా.. ప్రపంచమైనా సరే  క్రీడాకారులకు కచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిందే. కానీ, ఒక నరమేధానికి , మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడే దేశం నిర్వహించే క్రీడలకు అసలేమీ జరగనట్లు అధికారికంగా మద్దతు ఇవ్వలేం’’ అని పేర్కొన్నారు.

అమెరికా రాజకీయాల్లో ప్రత్యర్థులకు మింగుడుపడని మహిళగా నాన్సీకి పేరుంది. ట్రంప్‌ను ముప్పుతిప్పలు పెట్టిన డెమొక్రాట్‌ కూడా ఈమే కావడం విశేషం. చైనా అరాచకాల విషయంలో నాన్సీ మొదటి నుంచి తీవ్రంగానే స్పందించేవారు. గతంలో టిబెట్‌ వాసులపై చైనా అరాచకాలపై గళం విప్పారు. జార్జి డబ్ల్యూ బుష్‌ అధికారంలో ఉండగా అప్పట్లో జరిగిన బీజింగ్‌ సమ్మర్‌ ఒలింపిక్స్‌ను బహిష్కరించాలని ఆయనకు సూచించారు. అప్పట్లో ఆమె యూఎస్‌ హౌస్‌ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బుష్‌ బీజింగ్‌ సందర్శించడాన్ని మరింత కఠినతరం చేసేలా ఆమె అప్పట్లో భారత్‌కు వచ్చి దలైలామాతో భేటీ కూడా అయ్యారు.  కానీ, నాటి అధ్యక్షుడు బుష్‌ ఆమె మాట వినలేదు. బీజింగ్‌ ఒలింపిక్స్‌కు హాజరయ్యారు.

భారత్‌ మద్దతిచ్చినా పుల్లలు పెట్టాలని చూసిన డ్రాగన్‌..!

భారత్‌, చైనా, రష్యాలు ఆర్‌ఐసీ గ్రూప్‌లో సభ్య దేశాలు. ఇటీవల జరిగిన ఈ గ్రూపు సమావేశ ప్రకటనలో చైనా ఓ అంశాన్ని చేర్చింది. దీని ప్రకారం ఆర్‌ఐసీ దేశాలు బీజింగ్‌లో జరిగే వింటర్‌ ఒలింపిక్స్‌, పారా ఒలింపిక్స్‌ మద్దతు తెలిపాయి. భారత్‌ ఈ ప్రకటన అంగీకరించడానికి రష్యా ప్రధానకారణం. కానీ, చైనా అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ మాత్రం దీనిని వక్రీకరించి ప్రచారం చేసింది. ‘భారత్‌ సొంతగా వ్యవహరిస్తుందే కానీ.. అమెరికాకు ఏ మాత్రం సహజ మిత్ర దేశం కాదు ’ అంటూ పుల్లలు పెట్టే ప్రయత్నం చేసింది. ఈ మేరకు ఒక కథనం ప్రచురించింది. అమెరికాతో బలమైన దౌత్య సంబందాలు కలిగి ఉన్నా.. స్థానిక, అంతర్జాతీయ వ్యవహారాల్లో అగ్రరాజ్యాన్ని అనుసరించకుండా స్వతంత్ర వైఖరితో ముందుకెళ్తోందంటూ రెచ్చగొట్టే యత్నం చేసింది.

Read latest National - International News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని