West Bengal: కొనసాగుతోన్న భవానీపూర్‌ ఉపఎన్నిక.. టీఎంసీ, భాజపా మాటల యుద్ధం

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్న భవానీపూర్‌ నియోజకవర్గ ఉప ఎన్నికకు గురువారం పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు

Updated : 30 Sep 2021 10:32 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్న భవానీపూర్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. గురువారం ఉదయం 7 గంటలకు ఓటింగ్‌ ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. భవానీపూర్‌తో పాటు బెంగాల్‌లోని జాంగీపూర్‌, సంషేర్‌గంజ్‌, ఒడిశాలోని పిప్లీ నియోజకవర్గాలకు కూడా నేడు పోలింగ్‌ జరుగుతోంది.  ఉదయం 9 గంటల సమయానికి భవానీపూర్‌లో 7.57శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. కాగా.. గత అసెంబ్లీ ఎన్నికల వేళ బెంగాల్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను దృష్టిలో ఉంచుకుని నేటి పోలింగ్‌ను భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పారామిలిటరీ బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. 

టీఎంసీపై భాజపా ఫైర్‌..

ఇదిలా ఉండగా.. భవానీపూర్‌లో టీఎంసీ అక్రమాలకు పాల్పడుతోందని భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్‌ ఆరోపించారు. టీఎంసీ ఎమ్మెల్యే మదన్‌మిత్రా పోలింగ్‌ కేంద్రాన్ని తన అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. అయితే ఆమె ఆరోపణలను బెంగాల్‌ మంత్రి ఫిర్హాద్‌ హకీమ్‌ కొట్టిపారేశారు. పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలిపారు. సాయంత్రం 6.30 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని