china:జాంగ్‌ గవోలీ అనే కొండను ఢీకొన్న పెంగ్‌ షువాయి..!

ఇటీవల చైనా టెన్నిస్‌ సూపర్‌ స్టార్‌ క్రీడాకారిణి పెంగ్‌ షువాయి అదృశ్యంతో మాజీ వైస్‌ ప్రీమియర్‌ జాంగ్‌ గవోలీ పేరు తెరపైకి వచ్చింది.

Updated : 26 Nov 2021 15:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల చైనా టెన్నిస్‌ స్టార్‌ క్రీడాకారిణి పెంగ్‌ షువాయి అదృశ్యంతో మాజీ వైస్‌ ప్రీమియర్‌ జాంగ్‌ గవోలీ పేరు తెరపైకి వచ్చింది. ఆయనపై ఆరోపణలు చేసిన తర్వాత ఇప్పటి వరకూ పెంగ్‌ ఆచూకీ లేదు. అప్పుడప్పుడు పెంగ్‌ ఫొటోలు, వీడియోలు చైనా సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి. మరో వైపు గవోలీ బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌, బీఆర్‌ఐ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో పనిచేశాడు. తనపై ఆరోపణలు చేయగానే ఏకంగా ప్రపంచ టెన్నిస్‌ సూపర్‌ స్టార్‌ క్రీడాకారిణినే కనుమరుగు చేసేంత శక్తిమంతుడా గవోలీ. జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు పెంగ్‌ షువాయి ఏకంగా కొండనే ఢీకొంది.

జిన్‌పింగ్‌ సన్నిహితుల్లో ఒకడిగా..?

మూడేళ్ల క్రితం జాంగ్‌ చైనా కమ్యూనిస్టు పార్టీ పదవి నుంచి రిటైర్‌ అయ్యారు. అప్పటి వరకు ఆయన దేశ వైస్‌ ప్రీమియర్‌గా వ్యవహరించారు. దీంతోపాటు చైనాలోనే అత్యంత బలమైన సీసీపీ పొలిట్‌బ్యూరో స్టాండింగ్‌ కమిటీలో సభ్యుడిగా చేశాడు. ఈ కమిటీలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సన్నిహితులకు తప్పితే మరొకరికి స్థానం దక్కదు. ఇక బీజింగ్‌ వింటర్‌  ఒలింపిక్స్‌ ప్రాజెక్టుకు ఆయన పనిచేశాడు. జాంగ్‌ కెరీర్‌లో ఒలింపిక్స్‌ ఒక చిన్న భాగం మాత్రమే.

జాంగ్‌ చైనా ఎకనామిక్‌ పాలసీకి ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. దీంతోపాటు జిన్‌పింగ్‌ మానసపుత్రికగా పేరున్న బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టుకు కూడా బాధ్యుడిగా పనిచేశారు. ప్రస్తుత ప్రీమియర్‌ లీ కిక్వియాంగ్‌, చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్‌ జెమిన్‌కు అత్యంత సన్నిహితుడు. చైనా కమ్యూనిస్టు పార్టీలో అత్యంత శక్తిమంతమైన షాంఘై ఫ్యాక్షన్‌ జియాంగ్‌ జెమిన్‌ కనుసన్నల్లోనే ఉంటుంది.

నిశ్శబ్దంగా సీసీపీలో ఎదిగి..

జాంగ్‌ చైనా కమ్యూనిస్టు పార్టీలో చాలా నిశ్శబ్దంగా ఎదిగారు. ఆయన 1946లో ఫుజియాన్‌ ప్రావిన్స్‌లో ఓ రైతు కుటుంబంలో పుట్టారు. 1970లో జియామెన్‌ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్రంలో పట్టా అందుకొన్నారు. గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోని మావోమింగ్‌ పెట్రోలియం కంపెనీలో చేరారు. ఆ తర్వాత మెల్లగా ఆ కంపెనీ అధిపతిగా.. 1988లో ఆ రాష్ట్ర డిప్యూటీ గవర్నర్‌గా ఎదిగారు. అదే సమయంలో విద్యుత్తు కొరత తీర్చేందుకు ధరల్లో సంస్కరణలు తీసుకొచ్చి విజయం సాధించారు. దీంతో సీసీపీ పెద్దల దృష్టి జాంగ్‌పై పడింది. షెన్‌జెన్‌ గవర్నర్‌గా ఆయనని నియమించారు. అక్కడే ఆధునిక చైనా ఆద్యుడు డెంగ్‌ షావోపింగ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆర్థిక మండలిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత షెన్‌జెన్‌ చైనాలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందింది. ఆ తర్వాత సాన్‌డాంగ్‌లో గవర్నర్‌గా పనిచేశారు. 2012లో  సీసీపీ పొలిట్‌ బ్యూరో స్టాండింగ్‌ కమిటీలో సభ్యత్వం పొందాడు. ప్రస్తుత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత నమ్మకస్తుల్లో జాంగ్‌ ఒకరు.

బీఆర్‌ఐ స్టీరింగ్‌ కమిటీ అధిపతిగా..

2014 తర్వాత ప్రపంచాన్ని గుప్పిట పెట్టుకొనేందుకు చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషేటీవ్‌ను ప్రారంభించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ దీనిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు. ఈ ప్రాజెక్టు స్టీరింగ్‌ కమిటీకి జాంగ్‌ గవోలీ అధ్యక్షత వహించాడు. ఆయన కింద సీసీపీలోని పలువురు సీనియర్‌ నాయకులు పనిచేశారు. ఈ కమిటీ నేరుగా స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ చైనాకు రిపోర్టు చేసేది. 

అందుకే జాంగ్‌పై ఆరోపణలు  బయటకు పొక్కగానే చైనా అధికారులు రంగంలోకి దిగారు. చైనా ఇంటర్నెట్‌లో ఎక్కడా పెంగ్‌ షువాయి చేసిన ఆరోపణలు కనిపించకుండా తొలగించేశారు. ఆ పోస్టు చేసినప్పటి నుంచి పెంగ్‌ ఆచూకీ దొరకడం లేదు. దీంతో పెంగ్‌ ఎక్కడ అంటూ సామాజిక మాధ్యమాల్లో ఉద్యమం మొదలైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని