Corona Virus: అక్కడ కరోనా కల్లోలంపై WHO ఆందోళన

యూరప్‌ దేశాల్లో కరోనా కల్లోలంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఒక్క యూరప్‌ ప్రాంతంలో.....

Published : 25 Nov 2021 02:03 IST

జెనీవా: యూరప్‌ దేశాల్లో కరోనా కల్లోలంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఒక్క యూరప్‌ ప్రాంతంలో మాత్రం గత వారంలో 11శాతం కేసులు పెరిగినట్టు వెల్లడించింది. అక్టోబర్‌ మధ్య కాలం నుంచి ఈ పెరుగుదల కొనసాగుతోందని పేర్కొంది. కరోనా మహమ్మారిపై తాజాగా విడుదల చేసిన సమీక్షలో ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ కేసులు, మరణాలు 6శాతానికి పైగా పెరిగినట్టు పేర్కొంది. గత వారంలో 3.6 మిలియన్ల పాజిటివ్‌ కేసులు రాగా.. 5,100 మంది మృతిచెందినట్టు పేర్కొంది.

తక్షణ చర్యలు తీసుకోకపోతే మరో 7లక్షల దాకా మరణాలు సంభవించే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో యూరప్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హాన్స్‌ లుగే హెచ్చరించారు. యూరప్‌ ప్రాంతం ఇంకా కొవిడ్‌ కబంధహస్తాల్లోనే ఉందని, దేశాలన్నీ వ్యాక్సినేషన్‌ వేగాన్ని పెంచడంతో పాటు కొవిడ్‌ నియంత్రణ నిబంధనలు పాటించాలని సూచించారు. కఠిన లాక్‌డౌన్‌లను విధించే పరిస్థితి తెచ్చుకోకుండా మాస్క్‌లు పెట్టుకోవడం, భౌతికదూరం పాటించడం వంటి పద్ధతులు అనుసరించాలన్నారు. మొత్తం యూరోపియన్‌ ప్రాంతంలో 1బిలియన్‌ కు పైగా టీకా డోసులు పంపిణీ చేసినట్టు వెల్లడించారు.

గత వారంలో ఆస్ట్రియా, నెదర్లాండ్స్‌, బెల్జియం దేశాలు కొవిడ్‌ నియంత్రణకు పాక్షిక లాక్‌డౌన్‌ సహా పలు కఠిన చర్యలు తీసుకున్నట్టు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. జర్మనీలో మరణాలు లక్ష మార్కును దాటినట్టు పేర్కొంది. అదే సమయంలో ఆగ్నేయాసియాలో 11శాతం,  మధ్య తూర్పు దేశాల్లో 9శాతం తగ్గుదల నమోదైనట్టు వెల్లడించింది. ఆఫ్రికాలో భారీ స్థాయిలో కొవిడ్‌ మరణాలు తగ్గాయని తెలిపింది. అమెరికాలో కేసులు స్థిరంగా ఉన్నప్పటికీ మరణాల సంఖ్య మాత్రం 19శాతానికి పైగా పెరిగినట్టు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని