Published : 04/07/2021 19:04 IST

Aamirkhan: రీనా దత్తా, కిరణ్‌రావు @ 15 ఏళ్లు

ప్రేమ వివాహమే.. ప్రేమగానే విడిపోయారు

ముంబయి: వృత్తిపరమైన జీవితంలో మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ వ్యక్తిగత జీవితంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా పలువురు నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రేమించి.. పెళ్లాడి.. చివరికి ప్రేమగానే విడిపోతున్నాం అని తాజాగా ప్రకటించిన ఆమిర్‌ఖాన్‌.. కిరణ్‌రావుతో 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. మరోవైపు, ఆమిర్.. తన మొదటి భార్య రీనాదత్తా నుంచి కూడా వివాహమైన 15 ఏళ్లకే విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో ఆమిర్‌-రీనా, ఆమిర్‌-కిరణ్‌రావుల ప్రేమ కథల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

ఆమె ఒప్పుకోలేదు.. ఈయన వెంటపడ్డాడు..!

ఆమిర్‌ఖాన్‌, రీనాదత్త ప్రేమకథ వింటే ఓ సినిమా కథలా ఉంటుంది ఎందుకంటే వీళ్లిద్దరి ప్రేమకథ మొదలైంది ఇంటి వద్దే. ఆమిర్-రీనా పక్క పక్క ఇళ్లల్లో ఉండేవాళ్లు. ఓరోజు అనుకోకుండా పక్కింటి కిటికీవైపు చూసిన ఆమిర్‌కు రీనాదత్తా కనిపించిందట. తొలిచూపులోనే ఆమె అందానికి ముగ్ధుడైన ఆమిర్‌ ఆమెను చూడడం కోసం రోజూ కిటికీ ఎదురుగానే కూర్చునేవారట. ఓరోజు ధైర్యం చేసి రీనాదత్తాని కలిసి తన మనసులోని మాట చెప్పారట మన హీరోగారు. కానీ, రీనా మాత్రం ఎన్నో సార్లు ఆయన ప్రేమను నిరాకరించిందట. దాంతో ప్రేమపై నమ్మకాన్ని వదిలేసుకోవాలని అనుకుంటున్న సమయంలో రీనానే వచ్చి పెళ్లి చేసుకుందామని అడిగారట. దాంతో ఆనందించిన ఆమిర్‌, ఆమెతో కొన్నిరోజులుపాటు ప్రేమ ప్రయాణం చేశారు. ప్రేమలో ఉన్న సమయంలో ఆమె కోసం రక్తంతో ప్రేమలేఖ రాసి ఇచ్చారట ఆమిర్‌. అలా, తమ ప్రేమను 1986లో పెళ్లి పీటలెక్కించారు. ఈ దంపతులకు ఐరా ఖాన్‌ అనే కుమార్తె, జునైద్‌ ఖాన్‌ (JUNAID KHAN) అనే కుమారుడు ఉన్నారు. ఎంతో సరదాగా సాగుతున్న జీవితాల్లో ఏమైందో ఏమో తెలీదు సరిగ్గా వివాహమైన 16 ఏళ్ల తర్వాత అంటే 2002లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే విడాకులు తీసుకున్నప్పటికీ తామిద్దరం స్నేహితులుగా ఉంటున్నామని ఎన్నో సందర్భాల్లో ఆమిర్‌ వెల్లడించారు.


అసిస్టెంట్‌ డైరెక్టర్‌ టు హౌస్‌ వైఫ్‌

ఆమిర్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘లగాన్‌’కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు కిరణ్‌రావు. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో ఆమిర్‌తో ఆమెకు సాధారణ స్నేహం ఏర్పడింది. ఆ సినిమా విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ఆమిర్‌ 2002లో రీనా దత్తా నుంచి విడాకులు తీసుకున్నాక.. ఓసారి కిరణ్‌రావుని కలిశారట. విడాకుల అనంతరం ఒంటరిగా ఫీలైన ఆమిర్‌కు కిరణ్‌రావుతో మంచి స్నేహం ఏర్పడింది. దాంతో వీళ్లిద్దరూ కొన్నిరోజులపాటు డేటింగ్‌లో ఉన్నారు. ఆ తర్వాత సహజీవనం.. అనంతరం 2005లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. సరోగసి పద్ధతిలో ఆజాద్‌ అనే బాబుకి ఈ దంపతులు జన్మనిచ్చారు. అలా, తమ 15 ఏళ్ల వైవాహిక బంధానికి విడాకులతో స్వస్తి చెబుతున్నట్లు తాజాగా ప్రకటించారు.


తెరపైకి ఆమె పేరు ఎందుకంటే?

ఆమిర్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘దంగల్‌’లో ఆయన పెద్ద కుమార్తెగా నటించి అందర్నీ ఆకర్షించింది నటి ఫాతిమా సనా షేక్‌. ఆ సినిమా షూట్‌ సమయంలో ఏ ఫంక్షన్‌లో చూసినా ఆమిర్‌-ఫాతిమా జంటగా కనిపించేవాళ్లు. దాంతో వీళ్లిద్దరి గురించి ఎన్నో వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. ‘దంగల్‌’ తర్వాత ఆమిర్‌.. తాను నటించిన ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’లో ఫాతిమాకి హీరోయిన్‌గా ఛాన్స్‌ ఇవ్వడంతో ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది. అంతేకాకుండా ఆ సినిమా విడుదలయ్యాక కూడా ఫాతిమా చాలా సందర్భాల్లో ఆమిర్‌ ఇంటి వద్ద కనిపించడంతో బీటౌన్‌లో వీళ్లిద్దరే హాట్‌ టాపిక్‌ అయ్యారు. శనివారం ఆమిర్‌-కిరణ్‌రావు విడిపోతున్నట్లు ప్రకటించగానే నెటిజన్లు మరోసారి ఫాతిమా సనా షేక్‌ గురించే నెట్టింట్లో పోస్టులు పెడుతున్నారు. ఆమిర్‌ త్వరలోనే ఫాతిమాతో రిలేషన్‌షిప్‌ని అధికారికంగా ప్రకటించనున్నారంటూ వాళ్లు మాట్లాడుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్