Alitho Saradaga: ‘మర్యాద రామన్న’ సినిమా నాకు మైనస్‌ అయింది: నాగినీడు

‘‘మర్యాద రామన్న’ చిత్రం నన్ను ఓ స్థాయిలో నిలబెట్టింది. కానీ, అదే నాకు మైనస్‌ అయింది’ అని నటుడు నాగినీడు అన్నారు. ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఆయన వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలు పంచుకున్నారు.

Published : 11 Nov 2021 01:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘మర్యాద రామన్న’ చిత్రం నన్ను ఓ స్థాయిలో నిలబెట్టింది. కానీ, అదే నాకు మైనస్‌ అయింది’ అని నటుడు నాగినీడు అన్నారు. ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఆయన వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలు పంచుకున్నారు. ఆలీ అడిగిన ప్రశ్నలకు కొంటె సమాధానాలు చెప్తూ అలరించారు. ‘నాగినీడు.. ముందు ఏంటి? వెనక ఏంటి?’ అని ఆలీ అడగ్గా ‘1760 అనుకుంటా. నేను మచిలీపట్నం నుంచి తిరిగొస్తుంటే కలవపాముల గ్రామంలో నన్ను ఆపి ఈ ఊరు శిథిలమైపోయిందని, బాగు చేయాలని నన్ను అడిగితే అక్కడ సెటిల్‌ అయిపోయా. కొంతకాలం తర్వాత వెళ్లిపోయా. మళ్లీ వచ్చా. మళ్లీ వెళ్లిపోయా, వచ్చా’ అంటూ ఆలీని కన్ఫ్యూజ్‌ చేశారు. ‘మీకు ఎంతమంది పిల్లలు’ అనే ప్రశ్నకు ‘నాకు రెండు మైనస్‌లు (కొడుకులు)’ అని చమత్కరించారు.

‘నా జీవితం ప్రసాద్‌ ల్యాబ్స్‌కి అంకితమైంది. నేను థియేటర్‌లో చూసిన తొలి చిత్రం ‘పూల రంగడు’ (అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెరకెక్కింది). చూసిన వెంటనే నటుడవ్వాలనే కోరిక కలిగింది. అదే సమయంలో రాజబాబుగారిని ఇమిటేట్‌ చేసేవాడ్ని. నేను నటించిన ‘మర్యాద రామన్న’ చిత్రం నన్ను ఓ స్థాయికి తీసుకెళ్లింది. కానీ, అదే మైనస్‌ అయింది. అవకాశం కోసం ఏ దర్శకుడినైనా సంప్రదిస్తే ‘నాగినీడుగారు.. మీరు మాత్రమే న్యాయం చేయగలరు అనే పాత్ర ఉంటే మీకు ఇస్తాం. మా సినిమాలో అలాంటి క్యారెక్టర్‌ లేదు. మిమ్మల్ని సాధారణ పాత్రల్లో ఊహించుకోలేం కదా’ అనేవారు. ఇవన్నీ ఎందుకు నాకు డబ్బొస్తే చాలు అని మనుసులో అనుకునేవాడ్ని’ అని తన సినీ కెరీర్‌ గురించి చెప్పారు. చివరిగా.. ఓ దర్శకుడు తనపై సీరియస్‌ అయిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. మరి ఆ దర్శకుడు ఎవరు? తెలియాలంటే నవంబరు 15 వరకు వేచి చూడాల్సిందే. ‘ఈటీవీ’ వేదికగా వచ్చే సోమవారం ఈ ఎపిసోడ్‌ ప్రసారంకానుంది.

‘చెన్నకేశవరెడ్డి’, ‘లక్ష్మి కల్యాణం’ తదితర చిత్రాల్లో చిన్న  పాత్రలు పోషించిన నాగినీడుకు ‘మర్యాద రామన్న’ చిత్రం మంచి గుర్తింపునిచ్చింది. రామినీడుగా కనిపించి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు. ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డు అందుకున్నారు. సునీల్‌ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రమిది. ఆ తర్వాత ‘పిల్ల జమీందార్‌’, ‘సీమ టపాకాయ్‌’, ‘ఇష్క్‌’, ‘బెంగాల్‌ టైగర్‌’, ‘స్పైడర్’, ‘రూలర్‌’, ‘వకీల్‌సాబ్‌’ తదితర చిత్రాలతో అలరించారు.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని