83Movie : ‘83’కి అందుకే వసూళ్లు రాలేదు

భారీ అంచనాలతో ప్రేక్షకుల మందుకు వచ్చిన పాన్‌ ఇండియా, క్రీడా నేపథ్య చిత్రం ‘83’. భారత క్రికెట్‌ జట్టు తొలిసారి ప్రపంచ కప్‌ను గెలుచుకున్న క్షణాలను మళ్లీ వెండితెరపై ఆవిష్కరించారు దర్శకుడు కబీర్‌ ఖాన్‌. 1983 భారత జట్టు కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌గా రణ్‌వీర్‌ సింగ్‌ నటించారు. 2021 డిసెంబర్‌ 24న థియేటర్లో విడుదలైన ఈచిత్రం..

Published : 10 Jan 2022 15:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారీ అంచనాలతో ప్రేక్షకుల మందుకు వచ్చిన పాన్‌ ఇండియా, క్రీడా నేపథ్య చిత్రం ‘83’. భారత క్రికెట్‌ జట్టు తొలిసారి ప్రపంచ కప్‌ను గెలుచుకున్న క్షణాలను మళ్లీ వెండితెరపై ఆవిష్కరించారు దర్శకుడు కబీర్‌ ఖాన్‌. 1983 భారత జట్టు కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌గా రణ్‌వీర్‌ సింగ్‌ నటించారు. 2021 డిసెంబర్‌ 24న థియేటర్లో విడుదలైన ఈచిత్రం.. ప్రేక్షకుల, విమర్శకుల మెప్పు పొందినప్పటికీ.. బాక్సాఫీస్‌ వద్ద మాత్రం అనుకున్నంత కాసుల వర్షం కురిపించలేకపోయింది. భారతదేశం మొత్తం అన్ని భాషల్లో కలిపి సుమారు.100 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.180 కోట్లతోనే సరిపెట్టుకుంది. ఆశించినంత ఫలితం రాకపోవడంతో దర్శకుడు కబీర్‌ ఖాన్‌ స్పందించారు.

‘‘వాస్తవానికి మా చిత్రం 18నెలల ముందే విడుదలకు సిద్ధమైనా.. ప్రేక్షకులు థియేటర్‌లలో వీక్షించాలనే ఉద్దేశంతో కరోనా ఉద్ధృతి తగ్గాకే విడుదల చేశాం. ఈలోపు మళ్లీ కేసులు పెరగడంతో దిల్లీ, హరియాణాలో థియేటర్లు పూర్తిగా మూతబడ్డాయి. గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లో విడుదలైన మరుసటి రోజు రాత్రి కర్ఫ్యూ విధించారు. దీంతో నైట్‌ షో మీద ప్రభావం చూపాయి. ‘83’ విడుదలైన నాలుగురోజుల్లో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ థియేటర్లు మూసివేయాలని ఆదేశించారు. ప్రధాన రాష్ట్రాలైన కేరళ, పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌ల్లో 50శాతం ఆక్యుపెన్సీ ఇచ్చారు. ఇవే తక్కువ కలెక్షన్లు రావడానికి కారణమయ్యాయి. మహమ్మారి విసిరిన సవాలుకి మనం ఎలాంటి పోరాటం చేయలేం. ఇది కేవలం థియేటర్లు మూతపడటం, కలెక్షన్ల సమస్య మాత్రమే కాదు.. అసలు బయట అడుగు పెట్టాలన్నా వెళ్లాలా? వద్దా? అని ఆలోచించేలా చేసింది. మన మైండ్‌ సెట్‌ని రాత్రికి రాత్రే మార్చేసింది.

ఆనందంగా ఉన్నా.. కానీ, నిరుత్సాహంగానూ ఉన్నా!

‘‘ఈ చిత్రంపై ప్రేక్షకులు చూపించిన ప్రేమని చూసి ఎంత సంతోషించినా.. పరిస్థితుల దృష్ట్యా థియేటర్లకు రాకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యా. రెండేళ్ల నిరీక్షణే ‘83’. సరైన సమయంలో ప్రేక్షకులు బిగ్‌ స్క్రీన్‌పై చూడాలని ఎదురుచూశాం. సరైన ప్రణాళిక ప్రకారం విడుదల చేసినా.. మహమ్మారి మా అంచనాలను తలకిందులు చేసేసింది. డిసెంబర్‌ 24న విడుదలైనప్పుడు దేశంలో 6వేల కేసులే ఉండగా.. 10రోజుల్లో అవి కాస్త లక్షలకు చేరువవ్వడం బాధాకరం. హిందీ ‘పుష్ప’, హాలీవుడ్‌ ‘స్పైడర్‌మ్యాన్‌ - నో వే హోమ్‌’తో పోలిస్తే ‘83’కి తక్కువ వచ్చాయంటున్నారు. ఆ రెండు మా సినిమా కన్నా వారం ముందు విడుదలైయ్యాయి. అప్పటికీ థియేటర్లపై ఆంక్షలు లేవు. కాబట్టి ఆ చిత్రాలతో ‘83’ని పోల్చడం సరికాదు’’ అని వివరణ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని