Tollywood: మిత్ర చిత్రం..స్నేహ ఛత్రం.. స్నేహం ప్రధానంగా తెరకెక్కుతోన్న చిత్రాలివే

నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు తనే రేపటి బాటని సృష్టిస్తాడు నిద్దుర మాటున దాక్కోనీడు మన కలలకి పగటిని చూపిస్తాడు’’ - అసలు ‘మన ఫ్రెండల్లే ఎవడుంటాడు?’ అంటూ ఓ మంచి స్నేహితుడి గురించి గొప్పగా వర్ణించింది సిరివెన్నెల సీతారామశాస్త్రి ....

Updated : 01 Aug 2021 10:19 IST

నేడు స్నేహితుల దినోత్సవం

‘‘నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు తనే రేపటి బాటని సృష్టిస్తాడు నిద్దుర మాటున దాక్కోనీడు మన కలలకి పగటిని చూపిస్తాడు’’ - అసలు ‘మన ఫ్రెండల్లే ఎవడుంటాడు?’ అంటూ ఓ మంచి స్నేహితుడి గురించి గొప్పగా వర్ణించింది సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం. ‘ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రంరా స్నేహం’ అంటూ భువనచంద్ర రాసిన స్నేహగీతాన్ని ఎప్పటికీ పాడుకుంటూనే ఉంటాం.
‘ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేన’ అంటూ వనమాలి, ‘ట్రెండ్‌ మారినా ఫ్రెండ్‌ మారడే’ అంటూ చంద్రబోస్‌. ‘స్నేహమంటే ఏమిటంటే..? పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట..
వద్దు అంటే వెళ్లదంట కన్నవాళ్లు ఇవ్వలేని ఆస్తేనంట’ అంటూ శ్రీమణి... ఇలా ఎంతోమంది కవులు స్నేహాన్ని, అందులోని గొప్పదనాన్ని తమ పాటల్లో ఆవిష్కరిస్తూనే ఉన్నారు.

రెండక్షరాల స్నేహం.. తన గురించి, తన లోతు గురించి చెప్పడానికి మరెన్నో పాటలు, మరెన్నో కథలు మిగిలే ఉన్నాయని నిరూపిస్తోంది. అసలు స్నేహం... ప్రేమని స్పృశించని చిత్రాలు అరుదు అనే చెప్పాలి. కొన్ని చిత్రాలు మాత్రం స్నేహమే ప్రధానంగా రూపొందుతుంటాయి. ‘స్నేహంకోసం’, ‘ఇద్దరు మిత్రులు’,   ‘స్నేహితులు’, ‘స్నేహమంటే ఇదేరా’, ‘ఓ మై ఫ్రెండ్‌’, ‘నీ స్నేహం’... ఇలా ఎన్నో చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. ‘వసంతం’, ‘మహర్షి’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘ఎవడే సుబ్రమణ్యం?’, ‘టైగర్‌’ తదితర చిత్రాల్లోనూ స్నేహం గొప్పతనం కనిపిస్తుంది. ఇప్పుడూ కొన్ని చిత్రాలు స్నేహం ప్రధానంగా రూపొందుతున్నాయి.

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ దోస్తీ

అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం  వహిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ కోసం కథానాయకులు  ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ స్నేహహస్తం చాటారు. ఒకరు కొమరం భీమ్, మరొకరు అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో రాజమౌళి స్నేహబంధాన్ని బలంగా ఆవిష్కరించారని సమాచారం. స్నేహం ప్రధానంగా సాగే ‘దోస్తీ...’ అనే పాట ఆదివారం విడుదలవుతోంది. మిత్రులైన అగ్ర కథానాయకుల మధ్య... అందునా నిజ జీవిత కథానాయకుల పాత్రల్లోనే కనిపించే ఆ ఇద్దరి మధ్య స్నేహబంధం అంటే కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరించే అంశమే. మరి ఆ బంధం నేపథ్యంలో జక్కన్న పండించిన భావోద్వేగాలు ఏ  స్థాయిలో ఉంటాయో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.


శత్రువుల్లా..?

తెరపైనే కాదు... నిజ జీవితంలోనూ కథానాయకులు మంచి స్నేహితులుగా మెలుగుతుంటారు వారు. దక్షిణాది కథానాయకుల్లో స్నేహితుల జాబితానే తీస్తే తొలి వరసలో కనిపించే ద్వయం విశాల్‌ - ఆర్య. ఈ ఇద్దరూ కలిసి ‘ఎనిమి’ అనే సినిమా చేస్తున్నారు. స్నేహితులు కాస్త శత్రువులయ్యారన్నమాట. మరి ఈ స్నేహం, శత్రుత్వం వెనక సంగతులేమిటనేది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. ‘ప్రపంచంలోనే ప్రమాదకరమైన శత్రువు ఎవరో తెలుసా... నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడే...’ అనే డైలాగ్‌తో ఇటీవల టీజర్‌ విడుదలైంది. స్నేహంలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే కథతో ఈ సినిమా రూపొందుతోందని స్పష్టమవుతోంది.


‘మహా...’  స్నేహితులు

శర్వానంద్, సిద్ధార్థ్‌ కథానాయకులుగా రూపొందుతున్న ‘మహాసముద్రం’లోనూ ఇద్దరు స్నేహితులు కనిపిస్తారు. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ సినిమా స్నేహం, ప్రేమ చుట్టూ సాగుతుందని... కథానాయకులిద్దరూ స్నేహితులుగా సందడి చేస్తారని తెలిసింది. అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని