Karnataka Politics: కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజ్‌ బొమ్మై

కర్ణాటకలో యడియూరప్ప రాజీనామాతో కొత్త వారసుడు ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్‌ బొమ్మైని భాజపా ఖరారు చేసింది. రాష్ట్ర ఓటర్లలో అత్యధిక ప్రాబల్యం కలిగిన......

Updated : 27 Jul 2021 21:56 IST

బెంగళూరు: కర్ణాటకలో యడియూరప్ప రాజీనామాతో కొత్త వారసుడు ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్‌ బొమ్మైని భాజపా ఖరారు చేసింది. కర్ణాటక ఓటర్లలో అత్యధిక ప్రాబల్యం కలిగిన లింగాయత్‌ సామాజిక వర్గానికే మళ్లీ సీఎం పీఠాన్ని అప్పగిస్తూ కమలనాథులు నిర్ణయం తీసుకున్నారు. బసవరాజ్‌ బొమ్మై ఎంపికపై భాజపాలో ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో కొత్త సీఎంను ఎంపిక చేశారు. ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రిగా కొనసాగుతున్న బొమ్మై.. మాజీ సీఎం ఎస్‌ఆర్‌ బొమ్మై కుమారుడు. యడియూరప్పకు కూడా అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది.

రేపు ప్రమాణస్వీకారం

మరోవైపు, భాజపా శాసనసభాపక్ష సమావేశం బెంగళూరులో కొనసాగుతోంది. ఈ సమావేశానికి భాజపా అధిష్ఠానం పరిశీలకులుగా నియమించిన కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, కిషన్‌ రెడ్డితో పాటు  రాష్ట్ర భాజపా వ్యవహారాల ఇంఛార్జి అరుణ్‌ సింగ్‌, ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్న యడియూరప్ప హాజరయ్యారు. బొమ్మై ప్రస్తుతం జీఎస్టీ కౌన్సిల్‌కు కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొత్త సీఎంగా బుధవారం ఉదయం 11గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

బొమ్మై వైపే అధిష్ఠానం మొగ్గు

మరోవైపు, కొత్త సీఎం రేసులో రాష్ట్ర గనుల శాఖమంత్రి మురుగేశ్‌ నిరానీ, ఎమ్మెల్యే అరవింద్‌ బెల్లాట్‌, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, డిప్యూటీ సీఎం అశ్వథ్‌ నారాయణ్‌, కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషీ, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ సునీల్‌ కుమార్‌ తదితర కీలక నేతల పేర్లు కూడా ప్రధానంగా వినబడినప్పటికీ రాష్ట్రంలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బొమ్మై వైపే భాజపా అధిష్ఠానం మొగ్గుచూపింది.

యడియూరప్ప తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు నిన్న మధ్యాహ్నం ప్రకటించినప్పట్నుంచి ఆయన వారసుడు ఎవరు? అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతూ వస్తోంది. యడ్డీ తన రాజీనామా లేఖను గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌కు పంపగా.. ఆయన ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. లింగాయత్‌ వర్గంలో బలమైన నేతగా ఉన్న యడియూరప్ప స్వచ్ఛందంగానే పదవి నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తానని, పార్టీ బలోపేతంపై దృష్టి పెడతానని కూడా ఇప్పటికే ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని