గహ్లోత్‌ సిఫార్సును మరోసారి తిప్పి పంపిన గవర్నర్‌!

రాజస్థాన్‌లో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. శాసనసభ సమావేశాలను వెంటనే నిర్వహించాలన్న సీఎం అశోక్‌ గహ్లోత్‌ సిఫార్సును గవర్నర్‌ తిరస్కరించారు.......

Published : 27 Jul 2020 12:24 IST

రాజస్థాన్‌లో మరింత ముదురుతున్న రాజకీయాలు

జైపుర్‌: రాజస్థాన్‌లో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. శాసనసభ సమావేశాలను వెంటనే నిర్వహించాలన్న సీఎం అశోక్‌ గహ్లోత్‌ సిఫార్సును గవర్నర్‌ తిరస్కరించారు. అసెంబ్లీని సమావేశపర్చాలని ఇప్పటికే రెండుసార్లు గవర్నర్‌కు మంత్రివర్గం ప్రతిపాదనలు పంపింది. తొలిసారి ఆరు పాయింట్లపై స్పష్టత కోరిన గవర్నర్‌ ఈసారి అదనపు సమాచారం కావాలని ఫైల్‌ను తిప్పి పంపారు. బలపరీక్ష నిర్వహించాలనుకుంటున్నారా.. ఒకవేళ అలా అనుకుంటే దానికి సంబంధించి సిఫార్సుల్లో ఎలాంటి ప్రస్తావన లేకపోవడంపై గవర్నర్‌ వివరణ కోరినట్లు సమాచారం.  

బలపరీక్ష కోసం సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అడిగితే గవర్నర్‌ కల్‌రాజ్‌మిశ్ర దానిపై అనేక ప్రశ్నలు సంధించి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన విషయం తెలిసిందే. దీంతో మార్పులతో కూడిన తీర్మానాన్ని గహ్లోత్‌ ఆదివారం గవర్నర్‌కు పంపించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో దానిపై చర్చకు ఈ నెల 31న సభను అత్యవసరంగా సమావేశపరచాలని గవర్నర్‌కు కేబినెట్‌ తరఫున ప్రతిపాదనను పంపించారు. తాజాగా వాటిని కూడా గవర్నర్‌ తిప్పిపంపడంతో రాష్ట్రంలో రాజకీయాలు ప్రస్తుతం గవర్నర్‌ వర్సెస్‌ సీఎం అన్నట్లుగా మారాయి. 

మరోవైపు కాంగ్రెస్‌ తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ సహా ఆయన వర్గ ఎమ్మెల్యేల అనర్హతపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దన్న హైకోర్టు తీర్పును స్పీకర్‌ మనోహర్‌ జోషి సుప్రీంలో సవాల్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయి. 

బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో విలీనం కావడాన్ని సవాల్‌ చేస్తూ భాజపా ఎమ్మెల్యే మదన్‌ దిలావర్‌ వేసిన పిటిషన్‌పై రాజస్థాన్‌ హైకోర్టు మరికాసేపట్లో విచారణ ప్రారంభించనుంది. ఈ పిటిషన్‌లో తమని కూడా చేర్చాలని బీఎస్పీ కోరడం గమనార్హం. ఇప్పటికే బీఎస్పీ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలకు ఆ పార్టీ విప్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. విశ్వాస పరీక్ష జరిగితే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరింది. తాజాగా బీఎస్పీ టికెట్‌పై గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేల ఓటు హక్కులను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసేందుకు కూడా సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని