రాజస్థాన్‌ రాజకీయం.. అశోక్‌ గహ్లోత్‌ లేఖాస్త్రం

రాజస్థాన్‌ అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి ఆ పార్టీ తమ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు రిసార్టు రాజకీయాలు మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో ‘సత్యంవైపు నిలవండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అంటూ........

Published : 09 Aug 2020 16:35 IST

జైపుర్‌: రాజస్థాన్‌ అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి ఆ పార్టీ తమ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు రిసార్టు రాజకీయాలు మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో ‘సత్యంవైపు నిలవండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అంటూ సీఎం అశోక్ గహ్లోత్‌ లేఖాస్త్రం సంధించారు. కాంగ్రెస్‌ సహా రాష్ట్రంలో అందరు ఎమ్మెల్యేలకు లేఖలు రాశారు.

‘‘ప్రజలు మనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చెడు సంప్రదాయాలవైపు మొగ్గొద్దు. మీరు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ ప్రజల మనోభావాలను, ఎన్నికైన ప్రభుత్వం ప్రజల కోసం ఎలా పనిచేస్తోందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీరు సత్యం వైపే నిలుస్తారన్న నమ్మకం నాకుంది. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వానికి సహకరిస్తారని నమ్ముతున్నా’’ అని లేఖలో పేర్కొన్నారు. కరోనా విపత్తు వేళ మనం కరోనాపై పోరాడాల్సి ఉందని గహ్లోత్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు, ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రేయింబవళ్లు పనిచేస్తోందన్నారు. ఇలాంటి సమయంలో కొందరు సహచరులు, ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు.

ఈ నెల 14న రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో బలపరీక్ష నిర్వహించాలని అశోక్‌ గహ్లోత్‌ భావిస్తున్నారు. ఇప్పటికీ ఆయనకు మద్దుతు ఉందని, అరకొర మెజార్టీతోనైనా గట్టెక్కుతారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రభుత్వ ఒత్తిళ్ల పేరుతో పలువురు భాజపా ఎమ్మెల్యేలు గుజరాత్‌కు తరలివెళ్లారు. ఇప్పటికే గహ్లోత్‌ వర్గం ఎమ్మెల్యేలు జైసల్మేర్‌లో రిసార్టుల్లో గడుపుతుండగా.. సచిన్‌ పైలట్‌ వర్గం కూడా హరియాణాలో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అశోక్‌ గహ్లోత్‌ లేఖాస్త్రం సంధించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని