Mamata Banerjee: భవానీపుర్‌లో మమతా బెనర్జీ ఘన విజయం

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  భవానీపూర్‌ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు.

Updated : 03 Oct 2021 15:28 IST

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  భవానీపుర్‌ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌పై భారీ ఆధిక్యాన్ని నమోదు చేశారు. తొలి రౌండ్‌ నుంచీ మమత ఆధిపత్యం కొనసాగింది. రౌండ్‌ రౌండుకు దీదీ మెజారిటీ పెరిగి 50 వేలకుపైగా చేరింది. 58,832 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగరవేశారు. ఈ విజయంతో మమత సీఎం పీఠాన్ని నిలబెట్టుకున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఓడిపోయిన మమతా బెనర్జీ.. ఈసారి భవానీపుర్‌ నుంచి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఆమెపై భాజపా తరఫున ప్రియాంక టిబ్రేవాల్‌, సీపీఐ(ఎం) నుంచి శ్రీజిబ్‌ బిశ్వాస్‌ పోటీలో ఉన్నారు. సీఎంగా కొనసాగాలంటే తప్పక గెలవాల్సిన ఈ ఎన్నికలో మమత విజయం సాధించారు.

ప్రతిష్ఠాత్మక పోరులో విజయం

ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పశ్చిమబెంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి బరిలోకి దిగిన మమతా బెనర్జీ, ప్రత్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ ముఖ్యమంత్రిగా మే 5న బాధ్యతలు స్వీకరించారు. దీంతో అప్పటినుంచి ఆరు నెలల్లోగా అనగా.. నవంబర్‌ 5వ తేదీలోగా శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మరో రెండు స్థానాలతో పాటు మొత్తం మూడు స్థానాలకు సెప్టెంబర్‌ 30న కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్‌ నిర్వహించింది. ప్రతిష్ఠాత్మకంగా మారిన భవానీపుర్‌ నుంచి మమతా బెనర్జీ పోటీలో నిలిచారు. అయితే, మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి వీలుగా భవానీపుర్‌ నుంచి గెలుపొందిన శోభన్‌దేవ్‌ ఛటోపాధ్యాయ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ తృణమూల్‌ కాంగ్రెస్‌కు మంచి పట్టుండడంతో దీదీ గెలుపు ఖాయమయ్యింది.

భవానీపూర్‌ ప్రజలకు రుణపడి ఉంటా..!

ఉపఎన్నికల్లో భారీ విజయం అనంతరం స్పందించిన మమతా బెనర్జీ.. భవానీపూర్‌ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. ‘ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా ఉన్న సోదరీ, సోదరీమణులు, తల్లులకు కృతజ్ఞతలు. ముఖ్యంగా భవానీపూర్‌ ప్రజలు నాపై ఉంచిన విశ్వాసానికి సంతోషిస్తున్నాను. ఈ సందర్భంగా భవానీపూర్‌ ప్రజలకు నేను రుణపడి ఉంటాను’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

58వేల ఆధిక్యంతో మమతా విజయం..

తృణమూల్‌కు కంచుకోటగా ఉన్న భవానీపూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి మమతా బెనర్జీ ఇప్పటికే రెండుసార్లు గెలిచారు. తాజాగా జరిగిన ఉపఎన్నికల్లో మరోసారి విజయం సాధించి సీఎం పీఠాన్ని నిలబెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీకి మొత్తం 84వేల ఓట్లు (మొత్తం పోలైన ఓట్లలో దాదాపు 72శాతం) పోలవ్వగా.. ప్రత్యర్థిపై 58వేల ఆధిక్యం సాధించారు. ఇక భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌కు 26వేల ఓట్లే వచ్చాయి. వీరికి కేవలం 23శాతం ఓట్లు మాత్రమే పొందగలిగారు. ఫలితాలపై స్పందించిన టిబ్రేవాల్‌.. మమతా బెనర్జీ చేతిలో ఓటమిని అంగీకరించారు. వీటిపై న్యాయస్థానాలను కూడా ఆశ్రయించనని స్పష్టం చేశారు. గెలుపు అనంతరం మమతా బెనర్జీకి అభినందనలు తెలిపిన టిబ్రేవాల్‌.. దీదీ గెలిచిన తీరును ప్రతిఒక్కరూ గమనించారని వ్యాఖ్యానించారు. ఇక మూడో స్థానంలో ఉన్న సీపీఎం అభ్యర్థి శ్రీజీబ్‌ బిశ్వాస్‌ కేవలం రెండున్నర వేల ఓట్లు మాత్రమే పొందగలిగారు. వీరికి 3శాతం కంటే తక్కువ ఓట్లే పోలయ్యాయి.

మరో రెండు స్థానాలు తృణమూల్‌వే..

భవానీపూర్‌తో పాటు శంషేర్‌గంజ్‌, జాంగిపూర్‌లోనూ తృణమూల్‌ అభ్యర్థుల విజయం ఖాయమైంది. జాంగిపూర్‌లో తృణమూల్‌ అభ్యర్థి జాకీర్‌ హుస్సేన్‌కూ భారీ మెజారిటీ వచ్చింది. అక్కడ మొత్తం పోలైన ఓట్లలో దాదాపు 68శాతం ఓట్లు తృణమూల్‌ అభ్యర్థి హుస్సేన్‌కే వచ్చాయి. రెండోస్థానంలో ఉన్న భాజపా అభ్యర్థి సుజిత్‌ దాస్‌ కేవలం 22శాతం ఓట్లు మాత్రమే పొందారు. ఇక శంషేర్‌గంజ్‌లో టీఎంసీ అభ్యర్థి అమిరుల్‌ ఇస్లాంకు 50శాతం పోలయ్యాయి. రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థికి 40శాతం ఓట్లు వచ్చాయి. భాజపా, సీపీఎంలు అక్కడ డిపాజిట్‌ కోల్పోయినట్లు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని