కెప్టెన్‌ సాబ్‌.. సిద్ధూ చేత బిల్లు కట్టించండి..

మాజీ క్రికెటర్‌, కాంగ్రెస్‌ నేత నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ విద్యుత్‌ బిల్లు బకాయిల సెగ పంజాబ్ ప్రభుత్వానికి తగులుతోంది. ఇప్పటికే రాష్ట్రం విద్యుత్‌ సంక్షోభాన్ని

Published : 04 Jul 2021 01:41 IST

చండీగఢ్‌: మాజీ క్రికెటర్‌, కాంగ్రెస్‌ నేత నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ విద్యుత్‌ బిల్లు బకాయిల సెగ పంజాబ్ ప్రభుత్వానికి తగులుతోంది. ఇప్పటికే రాష్ట్రం విద్యుత్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందంటున్న పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కు శిరోమణి అకాలీదళ్‌(ఎస్‌ఏడీ) శనివారం చురకలు అంటించింది. రూ.8 లక్షలకుపైగా విద్యుత్‌ బిల్లు బకాయి పడిన సిద్ధూపై దృష్టి సారించాలంటూ ట్వీట్ చేసింది. కొద్ది రోజులుగా సిద్ధు పలు అంశాలపై సొంత పార్టీ ప్రభుత్వాన్నే విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో తలెత్తిన విద్యుత్‌ సంక్షోభంపైనా ఆయన పలుమార్లు సర్కారుపై బహిరంగ విమర్శలు చేయడం గమనార్హం. 

సిద్ధూ అమృత్‌సర్‌లోని తన ఇంటికి సంబంధించి పంజాబ్‌ రాష్ట్ర విద్యుత్‌ కార్పొరేషన్‌కు రూ.8,67,540 బిల్లు చెల్లించాల్సి ఉంది. బిల్లు చెల్లింపునకు ఆఖరు తేదీ శుక్రవారంతో ముగిసినప్పటికీ ఆయన ఈ విషయంపై స్పందించలేదు. పైగా విద్యుత్‌ కొరతపై రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ అదే రోజు ట్వీట్‌ చేశారు. సరైన చర్యలు తీసుకుంటే విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉండదంటూ అందులో పేర్కొన్నారు. రాష్ట్రంలో తలెత్తిన విద్యుత్‌ సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల పని గంటలు తగ్గించడం సహా పరిశ్రమలకు కరెంటు కోతలు విధించాలంటూ పంజాబ్‌ సీఎం గురువారం ఆదేశించిన విషయం తెలిసిందే. 

పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాజా విద్యుత్ సంక్షోభం ప్రధాన సమస్యగా మారింది. దీంతో అన్ని పార్టీలు ఈ అంశాన్నే ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మార్చుకుంటున్నాయి. ఆమ్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) సైతం ఈ అంశంపైనే దృష్టి పెట్టింది, అందులో భాగంగా వచ్చే ఏడాది నిర్వహించబోయే ఎన్నికల్లో గెలిస్తే ప్రతి ఇంటికీ 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేస్తామంటూ హామీ ఇచ్చింది.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని