Punjab Congress: సీఎం చన్నీనే.. కానీ సిద్ధూ నాయకత్వంలోనే ఎన్నికలకు..!

పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా చరణ్‌జీత్ సింగ్‌ ప్రమాణస్వీకారం వేళ కాంగ్రెస్‌ పార్టీలో మరోసారి అంతర్గత విబేధాలు భగ్గుమన్నాయి. పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌

Updated : 20 Sep 2021 14:43 IST

హరీశ్‌ రావత్ వ్యాఖ్యలు.. తప్పుబట్టిన సొంత పార్టీ నేత

చండీగఢ్‌: పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్‌ ప్రమాణస్వీకారం వేళ కాంగ్రెస్‌ పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌ సింగ్‌ సిద్ధుకు మద్దతుగా పార్టీ సీనియర్ నేత హరీశ్‌ రావత్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. రావత్‌ వ్యాఖ్యలను పంజాబ్‌ పీసీసీ మాజీ చీఫ్‌ సునిల్‌ జాఖర్‌ తప్పుబట్టారు. అసలేం జరిగిందంటే..

పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా దళిత నేత చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీని ఎన్నుకున్న విషయం తెలిసిందే. నేడు ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఈ పరిణామాలపై పంజాబ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యులుగా ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరీశ్‌ రావత్‌ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ అధిష్ఠానమే నిర్ణయిస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా పాపులర్‌ వ్యక్తి అయిన పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సిద్ధూ నాయకత్వంలోనే కాంగ్రెస్‌ ఎన్నికలకు వెళ్తుంది’’ అని చెప్పుకొచ్చారు.

ఈ వ్యాఖ్యలపై సునిల్‌ జాఖర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘నూతన ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్‌ సింగ్‌ ప్రమాణస్వీకారం వేళ.. ‘సిద్ధూ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తాం’ అన్న రావత్‌ వ్యాఖ్యలు ప్రజలను గందరగోళానికి గురిచేసేలా ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలు సీఎం అధికారాలను తక్కువ చేస్తున్నట్లుగా ఉన్నాయి’’ అని ట్వీట్ చేశారు. 

ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న చన్నీ ఈ ఉదయం హరీశ్‌ రావత్‌ను కలిశారు. అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు బయల్దేరారు. చన్నీ ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హాజరుకానున్నట్లు సమాచారం. అయితే మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని