Karnataka Politics: ఈ ప్రభుత్వం కూలిపోవచ్చు..

కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కర్ణాటక కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన బసవరాజ్‌ బొమ్మై నేతృత్వంలోని.....

Published : 15 Aug 2021 02:08 IST

సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు

బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కర్ణాటక కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన బసవరాజ్‌ బొమ్మై నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చన్నారు. ఈ ప్రభుత్వం పూర్తికాలం పాటు కొనసాగుతుందని తాను అనుకోవడంలేదని విలేకర్లతో అన్నారు. ఒక సీనియర్‌ ఎమ్మెల్యే సొంత ప్రభుత్వ అన్యాయంపైనే మహాత్మా గాంధీ విగ్రహం ముందు కూర్చొని విలపిస్తున్నారన్నారు. కొందరు మంత్రులు తాము సంతృప్తిగా లేమని చెబుతుండగా.. ఇంకొందరు ఎమ్మెల్యేలు మంత్రి పదవులు రానందుకు అసంతృప్తితో రగిలిపోతున్నారని వ్యాఖ్యానించారు. బసనగౌడ పాటిల్‌ యత్నాల్‌, సీపీ యోగేశ్వర్‌, ఎస్‌ఏ రామదాస్‌, అరవింద్‌ లింబవలి, అరవింద్‌ బెల్లాడ్‌ వంటి భాజపా అసంతృప్త నేతలను ఉటంకిస్తూ వీరంతా మంత్రి పదవులు రానందుకు అసంతృప్తితో దిల్లీ వెళ్తున్నారని చెప్పారు. ఈ పరిణామాల దృష్ట్యా రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం లేదని తాను అభిప్రాయపడుతున్నట్టు చెప్పారు. ఇటీవల రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య.. తాజాగా ప్రభుత్వం పడిపోతుందంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.

యడియూరప్ప రాజీనామాతో బసవరాజ్‌ బొమ్మై నేతృత్వంలో కొలువుదీరిన కొత్త మంత్రివర్గంలో 13 జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదని విమర్శించారు. కేవలం నాలుగైదు జిల్లాలకు మంత్రులు లేకపోతే అర్థంచేసుకోవచ్చు.. కానీ మైసూరు, చామరాజనగర్‌, కొడగు తదితర 13 జిల్లాల నుంచి అసలు మంత్రులే లేరన్నారు. ఒక్క బెంగళూరు నుంచే ఏడుగురు మంత్రులుగా ఉన్నారన్నారు. దీనికి బదులుగా ఇతర జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిందని సిద్ధరామయ్య అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని