Updated : 29/09/2021 10:55 IST

Punjab Politics: అప్పుడు టీమిండియాను మధ్యలో వదిలేసినట్లే.. సిద్ధూపై అమరీందర్‌ ఘాటు వ్యాఖ్యలు

చండీగఢ్‌: పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ పదవికి నవజోత్‌ సింగ్‌ సిద్ధూ అనూహ్య రాజీనామాతో ఆ రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎన్నికల వేళ సిద్ధూ రాజీనామాతో సంక్షోభంలో పడిన కాంగ్రెస్‌ పార్టీ.. ఈ సమస్యను రాష్ట్ర నాయకత్వమే పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. సిద్ధూకు స్థిరత్వం లేదంటూ దుయ్యబట్టిన పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తాజాగా ఆయనపై మరిన్ని విమర్శలు గుప్పించారు. సిద్దూ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని, ఆయనో ఒంటరివాడని అన్నారు. ఆనాడు భారత జట్టును ఇంగ్లాండ్‌లో వదిలేసి వచ్చినట్లే.. ఇప్పుడు కాంగ్రెస్‌ను కూడా మధ్యలోనే వదిలేసి మరో పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు.

దిల్లీ పర్యటనలో ఉన్న అమరీందర్‌ సింగ్‌.. అక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘ఈయన(సిద్ధూను ఉద్దేశిస్తూ) అస్థిరమైన, ప్రమాదకరమైన వ్యక్తి అని నేను ముందు నుంచీ చెబుతూనే ఉన్నాను. తాను నాకు చిన్నప్పటికీ నుంచి తెలుసు. ఎప్పుడూ ఒంటరిగా ఉంటాడు. జట్టు ఆటగాడిగా ఉండలేడు. అందుకే 1996లో భారత్‌ జట్టును ఇంగ్లాండ్‌లో మధ్యలోనే వదిలేసి వచ్చేశాడు. సిద్ధూ అసలైన వ్యక్తిత్వం అదే. నా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ పదవికి న్యాయం చేయలేదు. పాకిస్థాన్‌తో 600 కిలోమీటర్ల సరిహద్దు కలిగిన పంజాబ్‌ చాలా సున్నితమైన, సమస్యాత్మకమైన రాష్ట్రం. సిద్ధూకు అతడి క్రికెట్‌ స్నేహితుడు ఇమ్రాన్‌ఖాన్‌(పాక్‌ ప్రధాని), ఐఎస్‌ఐ చీఫ్‌ ఒమర్‌ జావెద్‌ బజ్వాతో దగ్గరి సంబంధాలున్నాయి. అది దేశ భద్రతకు తీవ్ర ముప్పు లాంటిదే’’ అని ఆరోపించారు. 

ఇక పంజాబ్‌ కొత్త సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ నిర్ణయాలు నచ్చకే సిద్ధూ రాజీనామా చేసినట్లు వస్తున్న వార్తలపై స్పందించిన కెప్టెన్‌.. ‘‘కేబినెట్‌ అనేది పూర్తిగా సీఎంకు సంబంధించిన విషయం. ఇందులో సిద్ధూ ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు. సిద్ధాంతాలు నచ్చకే రాజీనామా చేస్తున్నా అని సిద్ధూ చెబుతున్నారు. కానీ ఆయనకేం విలువలు, సిద్ధాంతాలున్నాయి. చూడండి.. అతి త్వరలోనే సిద్ధూ కాంగ్రెస్‌ను వదిలేసి మరో పార్టీతో చేతులు కలుపుతాడు’’ అని చెప్పుకొచ్చారు.

1996లో భారత జట్టు ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లింది. ఆ సమయంలో కెప్టెన్‌ అజారుద్దీన్‌తో విభేదాలు రావడంతో సిద్ధూ టోర్నీని మధ్యలోని వీడి ఇంగ్లాండ్‌ నుంచి తిరిగొచ్చారు. అప్పట్లో ఇది సంచలనమైంది.

రావత్‌ పర్యటన రద్దు..

పంజాబ్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఆ పార్టీ సీనియర్‌ నేత, పంజాబ్‌ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు హరీశ్‌ రావత్‌.. బుధవారం చండీగఢ్‌ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే కాంగ్రెస్‌ అధిష్ఠానం వద్దని చెప్పడంతో రావత్‌ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ సమస్యను పంజాబ్‌ సీఎం చన్నీనే పరిష్కరించుకోవాలని పార్టీ హైకమాండ్‌ ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చన్నీ.. నేడు కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని