Rajasthan: వైద్యుడి పేరు చెప్పి తప్పించుకున్న గహ్లోత్!

మంత్రివర్గాన్ని విస్తరించాలంటూ రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌పై ఒత్తిడిపెరుగుతోంది.

Published : 16 Jun 2021 01:23 IST

దిల్లీ: మంత్రివర్గాన్ని విస్తరించాలంటూ రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌పై ఒత్తిడిపెరుగుతోంది. దీనిపై సొంతపార్టీకి చెందిన సచిన్ పైలట్ వర్గీయులు డిమాండ్ చేస్తుండగా.. ముఖ్యమంత్రి మాత్రం వైద్యుల పేరు చెప్పి ఆ డిమాండ్లను పక్కనపెట్టారు. కొవిడ్ కారణంగా వ్యక్తిగత సమావేశాలకు దూరంగా ఉండాలని వైద్యులు గహ్లోత్‌కు సూచించారని ఆయన వ్యక్తిగత అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. ‘కొవిడ్ తదనంతర పరిణామాల దృష్ట్యా, వైదుల సలహా మేరకు ముఖ్యమంత్రి ఎవరిని వ్యక్తిగతంగా కలవలేరు. అన్ని సమావేశాలు, నిర్ణయాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే జరుగుతున్నాయి. రెండు నెలల పాటు వీడియో కాన్ఫరెన్స్ వేదికగానే సమావేశాలు నిర్వహించాలని వైద్యులు చెప్పారు’ అని తెలిపారు.

గతేడాది తిరుగుబావుటా ఎగురవేసిన సచిన్ పైలట్‌ను బుజ్జగించి..రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో పలు మార్పులకు సంబంధించి దిల్లీలోని పార్టీ నాయకత్వం ఆయనకు హామీ ఇచ్చింది. అయితే ఆ హామీని నెరవేర్చేందుకు గహ్లోత్‌ సుముఖంగా లేరు. పైలట్, గహ్లోత్ వర్గాల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలు ఇప్పట్లో సమసిపోవని తాజా ప్రకటనతో వెల్లడవుతోంది. మరోపక్క శనివారం రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దొతాస్రా మాట్లాడుతూ..కేబినెట్ విస్తరణ జరుగుతుందని, పార్టీలో ఏ సమస్యా లేదని వెల్లడించారు. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదు. 

ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సన్నిహితుడు జితేంద్ర ప్రసాద భాజపాలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సచిన్‌ పైలట్ కూడా కాంగ్రెస్‌ను వీడతారనే వార్తలు గుప్పుమంటున్నాయి. అందుకు తగ్గట్టే ఆయన దిల్లీకి వెళ్లారు. పది నెలలుగా నెరవేరిన డిమాండ్ల గురించి ఒత్తిడి తెచ్చేందుకు అక్కడ ఉన్నట్లు ఆయన చెప్తున్నారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని