Updated : 06/12/2021 05:26 IST

రైతు సమస్యలపై కేంద్రం మొద్దు నిద్ర

 తెరాస ఎంపీలు పోరాడినా మారని వైఖరి

ధాన్యం సేకరణపై పీయూష్‌వి అవాస్తవాలు

ఎఫ్‌సీఐని రద్దు చేసేందుకు కుట్ర

వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రైతులకు సంబంధించిన ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని, తెరాస ఎంపీలు పార్లమెంటులో పోరాడినా తన వైఖరి మార్చుకోవట్లేదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇతర ప్రభుత్వ రంగ సంస్థల మాదిరిగానే ఎఫ్‌సీఐని రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని, అందులో భాగంగానే ధాన్యం సేకరణపై షరతులు విధిస్తోందని విమర్శించారు. పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అవాస్తవాలు చెబుతున్నారని అన్నారు. భాజపా, కాంగ్రెస్‌లకు రాజకీయాలు తప్ప రైతుల సమస్యలు పట్టవని విమర్శించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్‌, మెతుకు ఆనంద్‌, ఎమ్మెల్సీ వాణీదేవి, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డిలతో కలసి విలేకరులతో మాట్లాడారు. ‘‘యాసంగిలో ఉప్పుడు బియ్యం వద్దని కేంద్రం మొండి వాదన చేస్తోంది. ధాన్యం సేకరించాలని తెరాస ఎంపీలు నిలదీస్తుంటే.. పీయూష్‌ గోయల్‌ అవగాహన లేకుండా పార్లమెంటులో మాట్లాడారు. కేంద్రం బియ్యం తీసుకోకుండా... రాష్ట్రమే పంపలేదని బద్నాం చేయడం సిగ్గుచేటు. ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగు, ఎగుమతి అంతా కేంద్ర సంస్థ ఎఫ్‌సీఐదే బాధ్యత. తెలంగాణ నుంచి బియ్యం తరలించాలని పలుమార్లు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ కేంద్రానికి లేఖలు రాసినా స్పందన లేదు. దేశంలో ప్రధాన ప్రతిపక్షం... కాంగ్రెస్‌ రైతుల పక్షాన కొట్లాడకుండా చేతులెత్తేసింది. వరి వద్దని, వాణిజ్య పంటలే సాగు చేయాలని కేంద్రమే చెప్పింది. అందువల్ల రాష్ట్రంలో యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలి. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు 10 లక్షల ఎకరాల్లో రైతులు కంది సాగు చేశారు. దీన్ని 20 లక్షల ఎకరాలకు, పత్తి కోటి ఎకరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాం. రైతులు సంతోషంగా ఉండాలని కేసీఆర్‌ ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రత్యామ్నాయ పంటలపై వారికి అవగాహన కల్పిస్తాం’’ అని నిరంజన్‌రెడ్డి తెలిపారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని