UP politics: యోగి-జితిన్‌ తొలిసారి భేటీ

కాంగ్రెస్‌కు స్వస్తి చెప్పి భాజపా తీర్థం పుచ్చుకున్న కేంద్ర మాజీ మంత్రి జితిన్‌ ప్రసాద తొలిసారిగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు..

Published : 20 Jun 2021 01:34 IST

దిల్లీ: కాంగ్రెస్‌కు స్వస్తి చెప్పి భాజపా తీర్థం పుచ్చుకున్న కేంద్ర మాజీ మంత్రి జితిన్‌ ప్రసాద తొలిసారిగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వివిధ సంక్షేమ పథకాలపై యోగితో చర్చించినట్లు ఆయన చెప్పారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోం మంత్రి అమిత్‌షా మార్గనిర్దేశంలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే భాజపాలో చేరాను. పార్టీలో చేరిన తర్వాత రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. అందువల్ల మర్యాదపూర్వకంగానే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిశాను’’ అని ఆయన మీడియాకు వివరించారు. భవిష్యత్‌లో రాష్ట్రంలో తీసుకురావాల్సిన సంక్షేమ పథకాలు, పార్టీ నాయకత్వాన్ని ఎలా బలోపేతం చేయాలన్న దానిపై చర్చించినట్లు భేటీ అనంతరం జితిన్‌ ప్రసాద వివరించారు.

ఈ నెల 9న దిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ సమక్షంలో జితిన్‌ ప్రసాద భాజపాలోకి చేరారు. కాంగ్రెస్‌తో మూడు తరాల అనుబంధం ఉన్నప్పటికీ ప్రజల ప్రయోజనాల కోసం, ప్రజల కోసం నిలబడే పార్టీలో చేరానని ఆయన అన్నారు. 47 ఏళ్ల జితిన్‌ ప్రసాద.. యూపీలో కాంగ్రెస్‌కు సీనియర్‌ నాయకుడు. 2004లో షాజహాన్‌పూర్‌, 2009లో ధౌరాహ్రా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2008 నుంచి 2009 వరకు అప్పటి యూపీఏ ప్రభుత్వంలో ఉక్కుశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. రెండోసారి యూపీఏ ప్రభుత్వంలోనూ పలు శాఖలకు సహాయమంత్రిగా వ్యవహరించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జితిన్‌ పార్టీని వీడటం కాంగ్రెస్‌కు గట్టి దెబ్బే అని చెప్పాలి. మధ్య యూపీ ప్రాంతంలోని బ్రాహ్మణ వర్గంలో జితిన్‌కు గట్టి పట్టుంది. దీంతో ఆయన రాక భాజపాకు కలిసొచ్చే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు