Mamata Banerjee: కాంగ్రెస్‌ వల్లే మోదీ మరింత పవర్‌ఫుల్‌.. దీదీ విమర్శలు

రాజకీయాల పట్ల కాంగ్రెస్‌ సీరియస్‌గా ఉండట్లేదని, అందుకే ప్రధాని మోదీ మరింత శక్తిమంతంగా మారుతున్నారని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి

Updated : 30 Oct 2021 15:53 IST

పనాజీ: రాజకీయాల పట్ల కాంగ్రెస్‌ సీరియస్‌గా ఉండట్లేదని, అందుకే ప్రధాని మోదీ మరింత శక్తిమంతంగా మారుతున్నారని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. గోవా పర్యటనలో ఉన్న దీదీ.. అక్కడ ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే అవసరాన్ని కాంగ్రెస్‌ గుర్తించట్లేదని దుయ్యబట్టారు.

‘‘కాంగ్రెస్‌ రాజకీయాలను సీరియస్‌గా తీసుకోవట్లేదు. ఆ పార్టీ వల్లే మోదీజీ మరింత శక్తిమంతంగా మారుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్‌.. భాజపాకు టీఆర్‌పీగా మారుతోంది. ఇప్పటికైనా వారు(కాంగ్రెస్‌) నిర్ణయం తీసుకోకపోతే.. యావత్ దేశం బాధపడాల్సి వస్తుంది. వారికి గతంలో ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ, వారు భాజపాపై పోరాటం చేయాల్సింది మాని.. మా రాష్ట్రంలో నాపై పోటీ చేశారు. అలాంటప్పుడు మేం వారితో ఎలా చేతులు కలపగల్గుతాం’’ అని మమత విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా ప్రాంతీయ పార్టీల గురించి దీదీ ప్రస్తావించారు. ప్రాంతీయ పార్టీలు మరింత బలంగా మారాలని, అప్పుడే దేశ ఫెడరల్ వ్యవస్థ కూడా బలోపేతమవుతుందని అన్నారు. భాజపాను ఎదుర్కోవాలంటే ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని