Gujarat: ‘ఈ నిర్ణయాన్ని ప్రజలు మెచ్చుకుంటారు’.. రూపానీ రాజీనామాపై జిగ్నేశ్‌ వ్యంగ్యాస్త్రాలు

కరోనా కట్టడిలో ప్రభుత్వ లోపాలను చూసిన ప్రజలు సీఎం రూపానీ రాజీనామా నిర్ణయాన్ని మెచ్చుకుంటారని జిగ్నేశ్‌ మేవానీ ఎద్దేవా చేశారు.....

Published : 12 Sep 2021 01:13 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదికిపైగా సమయం ఉన్నప్పటికీ ఇప్పటినుంచే నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా సీఎం రాజీనామాపై సామాజిక కార్యకర్త, ఆ రాష్ట్ర స్వతంత్ర్య ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసమే అధిష్ఠానం పాచికలాడుతోందని దుయ్యబట్టారు. ‘కరోనా కట్టడిలో ప్రభుత్వ లోపాలను చూసిన ప్రజలు సీఎం రూపానీ రాజీనామా నిర్ణయాన్ని మెచ్చుకుంటారు. ఇది పూర్తిగా 2022 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం’ అని ట్వీట్‌ చేశారు.

తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ శనివారం గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌కు రాజీనామా సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను పదవి నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. నూతన నాయకత్వంలో గుజరాత్‌ అభివృద్ధి పథంలో మరింత దూసుకెళ్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. పదవీ కాలం మరో ఏడాది పాటు ఉన్నప్పటికీ ఆయన రాజీనామా చేయడంపట్ల పలు ఊహాగానాలు మొదలయ్యాయి. రూపానీ రాజీనామాతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తర్వాత సీఎంను ఎన్నుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలు వచ్చే మంగళవారం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని