Jagdeep Dhankhar: బెంగాల్‌గవర్నర్‌ మరోసారిసంచలన వ్యాఖ్యలు

పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్కర్‌ మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగాల్‌లో రాజకీయ పరిస్థితి భయానకంగా......

Published : 25 Jan 2022 16:24 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్కర్‌ మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగాల్‌లో రాజకీయ పరిస్థితి భయానకంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు తమ ఓటు హక్కును కూడా స్వేచ్ఛగా, నిర్భీతిగా వినియోగించుకొనే పరిస్థితుల్లేవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ స్పీకర్‌ బిమన్‌ బెనర్జీ రాజ్యాంగ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారంటూ మండిపడ్డారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ధన్కర్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏ స్థాయిలో హింస చెలరేగిందో అంతా చూశామన్నారు. తమ ఇష్టప్రకారం ఓటు వేయాలనుకొనేవారు ప్రాణాల్ని పణంగా పెట్టాల్సి వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నిజనిర్ధారణ కమిటీ కూడా ఇక్కడ పాలకుల ఇష్టానుసారమే పరిపాలన సాగుతోంది తప్ప.. చట్ట ప్రకారం కాదనే విషయాన్ని గ్రహించిందన్నారు.

సీఎం మమత పైనా విసుర్లు

అసెంబ్లీ స్పీకర్‌ బిమన్‌ బెనర్జీ రాజ్యాంగ నిబంధనలు పాటించడంలేదనీ, తాను కోరిన సమాచారం ఇవ్వడంలేదంటూ గవర్నర్‌ ఆరోపించారు. సీఎం మమతా బెనర్జీ కూడా పలు సందర్భాల్లో తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో విఫలమయ్యారన్నారు. గవర్నర్‌ గురించి ఏదైనా మాట్లాడేందుకు లైసెన్స్‌ ఉందని స్పీకర్‌ అనుకుంటున్నారేమో అంటూ గవర్నర్‌ మండిపడ్డారు. బీఎస్‌ఎఫ్‌ పరిధి పెంపు అంశంపై అసెంబ్లీ చేసిన తీర్మానం సహా పలు సందర్భాల్లో తాను కోరిన సమాచారాన్ని స్పీకర్‌ ఇవ్వలేదన్నారు.అలాగే, ప్రభుత్వ బిల్లులు, సిఫారసులకు సంబంధించిన ఏ ఫైలూ తన వద్ద పెండింగ్‌లో లేవని స్పష్టంచేశారు. 

స్పందించిన స్పీకర్‌

మరోవైపు, గవర్నర్‌ తనపై చేసిన ఆరోపణలపై స్పీకర్‌ బిమన్‌ బెనర్జీ స్పందించారు. గవర్నర్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత అమర్యాదకరమన్నారు. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌కు నివాళులర్పించేందుకు గవర్నర్‌ అసెంబ్లీ వద్దకు వచ్చారనీ.. కానీ, ఆయన మీడియా సమావేశం కోసం ఈ వేదికను వినియోగించుకుంటారని తాము అనుకోలేదని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని