Updated : 09/06/2021 16:19 IST

UP: కాంగ్రెస్‌కు షాక్‌.. భాజపాలోకి జితిన్‌ ప్రసాద

దిల్లీ: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడు, కేంద్ర మాజీ మంత్రి జితిన్‌ ప్రసాద కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరారు. దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ సమక్షంలో బుధవారం ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. 

‘‘కాంగ్రెస్‌తో మాకు మూడు తరాల అనుబంధం ఉంది. అందువల్ల ఈ నిర్ణయం తీసుకునేందుకు చాలా చర్చించాల్సి వచ్చింది. గత 8-10ఏళ్లుగా జాతీయ పార్టీ ఏదైనా ఉందంటే అది భాజపా మాత్రమే అని నాకు అనిపించింది. దేశ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీ, ప్రజల తరఫున నిలబడే పార్టీ భాజపా. అందుకే నేను ఇందులో చేరాను’’ అని పార్టీలో చేరిన అనంతరం జితిన్‌ ప్రసాద తెలిపారు. 

47ఏళ్ల జితిన్‌ ప్రసాద.. యూపీలో కాంగ్రెస్‌కు సీనియర్‌ నాయకుడు. 2004లో షాజహాన్‌పూర్‌, 2009లో ధౌరాహ్రా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2008 నుంచి 2009 వరకు అప్పటి యూపీఏ ప్రభుత్వంలో ఉక్కుశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. రెండోసారి యూపీఏ ప్రభుత్వంలోనూ పలు శాఖలకు సహాయమంత్రిగా వ్యవహరించారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జితిన్‌ పార్టీని వీడటం కాంగ్రెస్‌కు గట్టి దెబ్బే అని చెప్పాలి. మధ్య యూపీ ప్రాంతంలోని బ్రాహ్మణ వర్గంలో జితిన్‌కు గట్టి పట్టుంది. దీంతో ఆయన రాక.. భాజపాకు మంచి బూస్ట్‌ ఇచ్చినట్లైంది.

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌ అధినాయకత్వంలో సంస్కరణలు తీసుకురావాలంటూ జి-23 కాంగ్రెస్‌ సభ్యుల బృందంలో జితిన్‌ కూడా ఒకరు. ఇక, రాహుల్‌ గాంధీ సన్నిహితుల్లో కాంగ్రెస్‌ను వీడిన రెండో ప్రముఖ వ్యక్తి ఈయనే. నిజానికి 2019లోనే జితిన్‌ పార్టీని వీడుతారనే వార్తలు వినిపించాయి. అయితే అప్పుడు ప్రియాంక గాంధీ సర్దిచెప్పడంతో ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. గతేడాది రాహుల్‌ మరో సన్నిహితుడు జ్యోతిరాదిత్య సింధియా హస్తానికి గుడ్‌బై చెప్పి భాజపాలో చేరిన విషయం తెలిసిందే. 

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జితేంద్ర ప్రసాద కుమారుడే జితిన్‌ ప్రసాద. జితేంద్ర.. మాజీ ప్రధానులు రాజీవ్‌ గాంధీ, పీవీ నరసింహారావుకు రాజకీయ సలహాదారుగా వ్యవహరించారు. 1999లో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో జితేంద్ర.. సోనియా గాంధీపై పోటీ చేసి ఓడిపోయారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని