Punjab: సీఎం మార్పుతో రాహుల్‌ గాంధీ ప్రజలకు నమ్మకాన్ని కల్పించారు: సిద్ధూ

కాంగ్రెస్‌ ప్రధాన నేత రాహుల్‌ గాంధీపై సిద్ధూ ప్రశంసించారు. రాహుల్‌ గాంధీ ఓ ముఖ్యమంత్రిని నియమించడమే కాదు.....

Published : 21 Sep 2021 01:29 IST

చండీగఢ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి పీఠం నుంచి కెప్టెన్ అమరీందర్‌సింగ్‌ అకస్మాతుగా తప్పుకోవడం.. కొత్త సీఎంగా పలువురి పేర్లు వినిపించినప్పటికీ అనూహ్యంగా చరణ్‌జిత్‌ చన్నీ ఆ స్థానాన్ని దక్కించుకున్నారు. అమరీందర్‌ నాయకత్వాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్న పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌సింగ్‌ సిద్ధూ.. తాజాగా అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. కాంగ్రెస్‌ ప్రధాన నేత రాహుల్‌ గాంధీపై ప్రశంసించారు. ‘రాహుల్‌ గాంధీ ఓ ముఖ్యమంత్రిని నియమించడమే కాదు.. ప్రజలకు నమ్మకం, ధైర్యాన్ని కల్పించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై నూతన ముఖ్యమంత్రి పనిచేయడం ప్రారంభించారు’ అని సిద్ధూ పేర్కొన్నారు.

అమరీందర్‌సింగ్‌కు, ఆ రాష్ట్ర పార్టీ చీఫ్‌ సిద్ధూకు మధ్య మొదటి నుంచీ విభేదాలున్నాయి. సిద్ధూ మద్దతుదారులైన పలువురు ఎమ్మెల్యేలు కెప్టెన్‌పై గతంలో తిరుగుబాటు ప్రకటించారు. అధిష్ఠానానికి సీఎం వ్యతిరేక వర్గం ఇటీవల లేఖ రాసినట్లు పార్టీలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వీటితోపాటు పార్టీలోని లుకలుకలను అవమానకరంగా భావించిన అమరీందర్‌సింగ్‌ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం సీఎం ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. సీఎం అభ్యర్థిగా సునీల్‌ జాఖడ్‌, సుఖ్‌జీందర్‌సింగ్‌ రంధ్వా, రాజేందర్‌ కౌర్‌ భట్టల్‌ వంటి సీనియర్‌ నేతల పేర్లు వినిపించాయి. కానీ వారిని కాదని.. ఎస్సీ నేత, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన చరణ్‌జిత్‌కు కాంగ్రెస్‌ పట్టం కట్టింది. నేడు ఆయన ప్రమాణస్వీకారం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని