Charanjit Singh Channi: సిద్ధూ అల్టిమేటం.. వెనక్కి తగ్గని చన్నీ..!

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పంజాబ్‌లో కాంగ్రెస్‌కు రోజుకో ఇబ్బంది పరిస్థితి తలెత్తుతోంది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవ్‌జోత్‌ సింగ్ సిద్ధూ చుట్టే విమర్శలు, ప్రతివిమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త ముఖ్యమంత్రి, సిద్ధూ మధ్య కూడా సఖ్యత లేదని తెలుస్తోంది. రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా ఏపీఎస్‌ డియోల్ నియామకాన్ని సిద్ధూ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం ప్రస్తుత వివాదానికి కారణం.

Published : 06 Nov 2021 19:02 IST

ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారిన పంజాబ్ రాజకీయాలు

చండీగఢ్‌: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పంజాబ్‌లో కాంగ్రెస్‌కు రోజుకో ఇబ్బంది పరిస్థితి తలెత్తుతోంది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవ్‌జోత్‌ సింగ్ సిద్ధూ చుట్టే విమర్శలు, ప్రతివిమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త ముఖ్యమంత్రి, సిద్ధూ మధ్య కూడా సఖ్యత లేదని తెలుస్తోంది. రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా ఏపీఎస్‌ డియోల్ నియామకాన్ని సిద్ధూ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం ప్రస్తుత వివాదానికి కారణం. ఆయన్ను తొలగించి.. పంజాబ్‌కు కొత్త అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ)ను నియమించిన రోజే తాను కాంగ్రెస్ కార్యాలయంలోకి అడుగుపెట్టి, పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తానని సిద్ధూ తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ అదే స్థాయిలో బదులిచ్చారు. ప్రభుత్వ న్యాయ బృందానికి తన మద్దతు ప్రకటించారు.

‘మా న్యాయబృందం నిరసనకారులపై కాల్పులు, మత ఘటనల కేసులో గుర్మీత్ రామ్ రహీమ్‌ను విచారించేందుకు అనుమతి పొందింది. అలాగే డ్రగ్స్ కేసులో కూడా మా న్యాయవాదులు కోర్టులో పోరాడుతున్నారు. నవంబర్ 18న వాటికి సంబంధించిన సీల్డ్‌ నివేదికలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది’ అని చన్నీ స్పష్టం చేశారు. డియోల్ నియామకం విషయంలో చన్నీకి వెనక్కి తగ్గే ఆలోచన లేదని తాజా వ్యాఖ్యలతో స్పష్టమైంది.  

ప్రస్తుతం రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా ఉన్న సీనియర్ న్యాయవాది ఏపీఎస్‌ డియోల్‌ నియామకాన్ని సిద్ధూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2015లో అప్పటి అకాలీదళ్‌ ప్రభుత్వ హయాంలో నిరసనకారులపై కాల్పులు, మతపరమైన ఘటనలకు సంబంధించిన కేసుల్లో నిందితులైన మాజీ డీజీపీ సుమేధ్‌ సైనీ, మరో పోలీసు అధికారి తరఫున వాదించిన డియోల్‌ని ఏజీగా నియమించడమేంటని ప్రశ్నిస్తున్నారు. అలాగే, ప్రస్తుతం డీజీపీగా ఉన్న సహోతాను కూడా తప్పించాలని సిద్ధూ డిమాండ్‌ చేస్తున్నారు. ఆయన అప్పట్లో ప్రభుత్వం నియమించిన సిట్‌కు నేతృత్వం వహించారని పేర్కొన్నారు.

కాగా సిద్ధూ ఆరోపణలను ఈ రోజు ఉదయం డియోల్‌ తప్పుపట్టారు. పదే పదే చేస్తోన్న ఆరోపణలు డ్రగ్స్ కేసు, మత ఘటనల కేసులో న్యాయం జరిగేలా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు. సహచరులపై రాజకీయంగా లబ్ధి పొందేందుకు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని విమర్శించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని