Navjot Singh Sidhu: నా పోరాటమంతా నిజం కోసమే..!

పంజాబ్ కాంగ్రెస్‌ చీఫ్ పదవికి రాజీనామా చేసి, ఆశ్చర్యపర్చిన నవజోత్ సింగ్ సిద్ధూ.. బుధవారం ట్విటర్ వేదికగా వీడియో సందేశం ఇచ్చారు. ‘నా తుదిశ్వాస వరకు నిజం కోసమే పోరాడతాను’ అని అన్నారు. అవినీతి మరకలు అంటిన నేతల్ని ప్రభుత్వంలోకి అనుమతించబోమని వ్యాఖ్యలు చేశారు. 

Published : 29 Sep 2021 12:22 IST

పీసీసీ పదవికి రాజీనామా చేసిన అనంతరం ట్విటర్‌లో సిద్ధూ స్పందన

చండీగఢ్‌: పంజాబ్ కాంగ్రెస్‌ చీఫ్(పీసీసీ) పదవికి రాజీనామా చేసి అందరినీ షాక్‌కు గురిచేసిన నవజోత్ సింగ్ సిద్ధూ.. బుధవారం ట్విటర్ వేదికగా వీడియో సందేశం ఇచ్చారు. ‘నా తుదిశ్వాస వరకు నిజం కోసమే పోరాడతాను’ అని అన్నారు. అవినీతి మరకలు అంటిన నేతల్ని ప్రభుత్వంలోకి అనుమతించబోమని వ్యాఖ్యలు చేశారు.

‘ఇది వ్యక్తిగత విషయాల కోసం జరిగే యుద్ధం కాదు. సిద్ధాంతాల కోసం జరిపే పోరాటం. నేను సిద్ధాంతాల విషయంలో రాజీ పడను. అవినీతి మరకలు అంటిన మంత్రులను తిరిగి తీసుకురావడానికి నేను ఏ మాత్రం అంగీకరించలేను’ అని ఆ వీడియోలో సిద్ధూ తన రాజీనామా వెనుక గల కారణాన్ని వెల్లడించారు. అలాగే ఆయన రాజీనామాపై వెనక్కి తగ్గే యోచనలో లేనట్లు సన్నిహిత వర్గాల సమాచారం.

గత కొద్ది నెలలుగా పంజాబ్ కాంగ్రెస్ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడం, చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఎంపిక కావడం.. వంటి కీలక వ్యవహారాల్లో సిద్ధూ పాత్రే ప్రధానం. అయితే చన్నీ తన కేబినెట్‌లో చేర్చుకున్న మంత్రుల విషయంలో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇసుక మైనింగ్ కుంభకోణంలో రానా గుర్జిత్ సింగ్ పాత్రపై ఆరోపణలున్నాయి. ఇప్పుడు చన్నీ తిరిగి ఆయన్ను కేబినెట్‌లోకి చేర్చుకున్నారు. ఈ ఆరోపణలతోనే 2018లో కెప్టెన్ కేబినెట్ నుంచి ఆయన వైదొలిగారు. అయితే ఆ ఆరోపణలు అవాస్తవమని విచారణ కమిటీ తేల్చింది. ఇదిలా ఉండగా.. కొద్ది నెలల్లో ఎన్నికలకు వెళ్లనున్న పంజాబ్‌కు తాజా పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని