Politics: తృణమూల్‌లో చేరిన గోవా మాజీ సీఎం ఫలైరో!

ఈ మధ్యే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన గోవా మాజీ ముఖ్యమంత్రి లుజినో ఫలైరో తాజాగా తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు.

Published : 29 Sep 2021 23:38 IST

కోల్‌కతా: ఈ మధ్యే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన గోవా మాజీ ముఖ్యమంత్రి లుజినో ఫలైరో తాజాగా తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. కోల్‌కతా వెళ్లిన ఆయన.. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఫలైరోతో పాటు మరికొంత మంది కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు, గోవాకు చెందిన ఇతర ప్రముఖులు కూడా తృణమూల్‌లో చేరినట్లు మమతా బెనర్జీ వెల్లడించారు. గోవా కాంగ్రెస్‌లో బలమైన నేతగా ఉన్న ఫలైరో.. తృణమూల్‌లో చేరడంతో అక్కడ కాంగ్రెస్‌కు ఇక కష్టకాలమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ.. గోవాలో తృణమూల్‌ కాంగ్రెస్‌ భారీ స్థాయిలో అడుగుపెడుతుందని ఆ పార్టీ ఎంపీ, పశ్చిమబెంగాల్‌ సీఎం మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ ప్రకటించారు. ఆయన చెప్పినట్లుగానే గోవా మాజీ సీఎంతో పాటు మరికొంతమంది కాంగ్రెస్‌ నేతలు, ఇతర ప్రముఖులు తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. మాజీ సీఎం ఫలైరోతోపాటు మాజీ ఎమ్మెల్యే లావూ మామ్లేదార్‌, కాంగ్రెస్‌ నాయకులు యతీష్‌ నాయక్‌, విజయ్‌ పోయ్‌, మారియో పింటో, ఆనంద్‌ నాయక్‌ తృణమూల్‌లో చేరిన వారిలో ఉన్నారు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ రచయిత శివ్‌దాస్‌ సోనూ నాయక్‌, దక్షిణ గోవా అడ్వకేట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆంటోనియో మోంటైరో క్లోవిస్‌, రాజేంద్ర శివాజీ కకోద్కర్‌ కూడా తృణమూల్‌లో చేరారు. ఏడుసార్లు ఎమ్మెల్యే, గోవా మాజీ సీఎం తమ పార్టీలోకి రావడం గొప్ప విషయమని.. ఆయనతో పాటు పార్టీలో చేరిన గోవా నాయకులందరికీ స్వాగతం పలుకుతున్నట్లు మమతా బెనర్జీ పేర్కొన్నారు.

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన మమతా బెనర్జీ.. పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకోసం వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గోవాలో పార్టీని మరింత బలోపేతం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదే సమయంలో గోవా కాంగ్రెస్‌ పార్టీలో బలమైన నేతగా ఉన్న లుజినో ఫలైరోతో పాటు ఇతర నేతలతో సంప్రదింపులు జరిపారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఫలైరో.. తృణమూల్‌లో చేరారు. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో పట్టుకోసం ప్రయత్నిస్తున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ తాజాగా గోవాలోనూ తమ పార్టీని విస్తరించాలనే భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని