Politics: గోవాలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. మాజీ సీఎం రాజీనామా!

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, గోవా మాజీ ముఖ్యమంత్రి లుజినో ఫలైరో పార్టీకి రాజీనామా చేశారు.

Published : 28 Sep 2021 01:34 IST

తృణమూల్‌లో చేరేందుకు సిద్ధం

పనాజీ: వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ.. కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, గోవా మాజీ ముఖ్యమంత్రి లుజినో ఫలైరో పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. కాంగ్రెస్‌ను వీడిన ఫలైరో తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే గోవాలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అడుగుపెడుతుందని ఆ పార్టీ ఎంపీ, పశ్చిమబెంగాల్‌ సీఎం మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే కాంగ్రెస్‌ నేత రాజీనామా చేయడం గమనార్హం.

‘నూతన ప్రయాణానికి నా ప్రాంత ప్రజల ఆశీస్సులు కోరాను. నేను వృద్ధుడినే కావచ్చు.. కానీ, నా రక్తం మాత్రం కొత్తదే. పరిస్థితులను మార్చేందుకు పట్టుదలతో ఉన్నాను. గోవా ప్రజలు ఎదుర్కొంటున్న బాధలకు ముగింపు పలికి కొత్త ఉషోదయాన్ని తీసుకువద్దాం. నాపై నమ్మకం ఉంచినందుకు నావెలిమ్‌ ప్రాంత ప్రజలకు కృతజ్ఞతలు. భవిష్యత్తులో జరిగే అన్ని ప్రయత్నాల్లో మీ మద్దతు కోసం ఎదురుచూస్తాను’ అని గోవా మాజీ సీఎం లుజినో ఫలైరో పేర్కొన్నారు.

ఇక, పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన మమతా బెనర్జీ.. పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకోసం వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గోవాలోనూ పార్టీ అడుగుపెడుతున్నట్లు తృణమూల్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ ఈమధ్యే ప్రకటించారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి లుజినో రాజీనామా చేశారు. దీంతో లుజినో ఫలైరోతో సంప్రదింపులు జరిపేందుకు తృణమూల్‌ సీనియర్‌ నేతలు డెరెక్‌ ఓబ్రెయిన్‌, ప్రసూన్‌ బెనర్జీలు ఇప్పటికే గోవాకు చేరుకున్నారు. వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవాతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని