West Bengal: కోల్‌కతా ఓటరుగా ప్రశాంత్‌ కిశోర్‌..!

ఎన్నికల వ్యూహకర్తగా పేరుపొందిన ప్రశాంత్‌ కిశోర్‌ తాజాగా కోల్‌కతా ఓటరుగా నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Updated : 27 Sep 2021 10:32 IST

భవానీపూర్‌ ఉపఎన్నిక కోసమేనన్న భాజపా

కోల్‌కతా: ఎన్నికల వ్యూహకర్తగా పేరుపొందిన ప్రశాంత్‌ కిశోర్‌ తాజాగా కోల్‌కతా ఓటరుగా నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. బిహార్‌కు చెందిన ఆయన.. మొన్నటి వరకు అక్కడి ఓటరుగానే ఉన్నారు. పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల నేపథ్యంలోనే ప్రశాంత్‌ కిశోర్‌ తాజాగా స్థానిక ఓటరుగా నమోదు చేసుకున్నట్లు భాజపా ఆరోపించింది. ముఖ్యంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీకి మద్దతుగా ఉండేందుకే ప్రశాంత్‌ కిశోర్‌ బెంగాలీ ఓటరుగా నమోదు చేసుకున్నట్లు భారతీయ జనతా పార్టీ బెంగాల్‌ విభాగం విమర్శించింది.

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పొటీ చేస్తోన్న భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30న ఉపఎన్నిక జరుగనుంది. గెలుపుకోసం తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే సమయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కోల్‌కతా ఓటరుగా నమోదు చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఉపఎన్నిక జరగనున్న భవానీపూర్‌ స్థానంలోనే ఆయన పేరు నమోదు చేసుకోవడాన్ని భాజపా పశ్చిమబెంగాల్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌ సప్తర్షి చౌధురి విమర్శలు గుప్పించారు. ‘బెంగాలీ అమ్మాయికి ఇతర ప్రాంత ఓటర్లు అవసరం వచ్చిందా..? రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు’ అంటూ సప్తర్షి చౌధురి ట్విటర్‌లో ప్రశ్నించారు.

స్థానిక ఓటరుగా అందుకేనా..?

ప్రశాంత్‌ కిశోర్‌ ఈ ఏడాది జనవరి-ఏప్రిల్‌ మధ్య కాలంలోనే కోల్‌కతా ఓటరుగా నమోదు చేసుకున్నట్లు సమాచారం. అయితే, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనను అక్కడ నుంచి బహిష్కరించేలా ఎన్నికల సంఘంపై భాజపా ఒత్తిడి తెస్తుందనే భయంతోనే స్థానిక ఓటరుగా నమోదు చేసుకున్నట్లు స్థానిక నేతలు భావిస్తున్నారు. పశ్చిమబెంగాల్‌ సీఎం అల్లుడు, ఎంపీ అభిషేక్‌ బెనర్జీ కేరాఫ్‌ అడ్రస్‌తోనే స్థానిక ఓటరుగా నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో ప్రశాంత్‌ కిశోర్‌ ఎక్కువగా అక్కడే గడపడంతో అదే అడ్రస్‌లో ఓటరుగా రిజిస్టర్‌ చేసుకున్నట్లు సమాచారం.

ఇదిలాఉంటే, ఈమధ్యే జరిగిన పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ భారీ మెజార్జీతో అధికారాన్ని నిలుపుకున్నప్పటికీ.. భాజపా అభ్యర్థి సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు. 294 సీట్లున్న పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీలో 213 స్థానాల్లో తృణమూల్‌ గెలుపొందగా.. 77 సీట్లను భాజపా కైవసం చేసుకుంది. అయితే, తృణమూల్‌ గెలుపు కోసం ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ (IPAC) సంస్థ ఆపార్టీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఎన్నికల్లో  భారీ విజయం సాధించిన తృణమూల్‌ కాంగ్రెస్‌.. 2026 వరకు ఐపాక్‌తో కలిసి పనిచేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు