Karnataka Politics: నాకు కేబినెట్‌ హోదా వద్దు..!

తనకు కేబినెట్‌ హోదా కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Published : 09 Aug 2021 01:11 IST

కర్ణాటక ముఖ్యమంత్రికి మాజీ సీఎం యడియూరప్ప లేఖ

బెంగళూరు: తనకు కేబినెట్‌ హోదా కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేవలం మాజీ ముఖ్యమంత్రికి ఉండే సదుపాయాలు, భద్రత మాత్రమే తనకు కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  బాధ్యతల నుంచి తప్పుకున్న యడియూరప్ప.. సీఎంగా బసవరాజ్‌ బొమ్మైని సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.

‘ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సదుపాయాలను మాత్రమే నాకు కల్పించండి. కేబినెట్‌ హోదా కల్పిస్తూ జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకోండి’ అని భాజపా సీనియర్‌ నేత యడియూరప్ప, కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఇక, కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న యడియూరప్ప జులై 26న తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం భాజపా అధిష్ఠానం సూచనల మేరకు శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన బసవరాజు బొమ్మై.. జులై 28న నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రికి యడియూరప్పకు కేబినెట్‌ ర్యాంకు కలిస్తూ శనివారం ఆదేశాలు జారీచేశారు. దీన్ని తిరస్కరించిన యడియూరప్ప.. కొత్త ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఇదిలాఉంటే, కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కొలువులో అమాత్యులకు ఆశించిన శాఖలు దక్కక పోవడంతో అసమ్మతి స్వరం ప్రతిధ్వనించింది. కేటాయించిన మంత్రి పదవులపై కొందరు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే యడియూరప్ప  కూడా ముఖ్యమంత్రికి లేఖ రాయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని