బెన్‌స్టోక్స్‌ అదరగొట్టెన్‌

ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అదరగొట్టాడు. కెరీర్‌లో తొలిసారి అత్యుత్తమ టెస్టు ర్యాంకింగ్స్‌ సాధించాడు. ఐసీసీ మంగళవారం విడుదల ఈ ర్యాంకింగ్స్‌లో స్టోక్స్‌...

Published : 21 Jul 2020 16:25 IST

టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అదరగొట్టాడు. కెరీర్‌లో తొలిసారి అత్యుత్తమ టెస్టు ర్యాంకింగ్స్‌ సాధించాడు. ఐసీసీ మంగళవారం విడుదల ఈ ర్యాంకింగ్స్‌లో స్టోక్స్‌ మొదట ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానం సంపాదించాడు. విండీస్‌ సారథి జేసన్‌ హోల్డర్‌నను వెనక్కి నెట్టాడు. అలాగే బ్యాట్స్‌మన్‌ జాబితాలో ఆస్ట్రేలియా క్రికెటర్‌ మార్నస్‌ లబుషేన్‌తో సమానంగా మూడో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో స్టోక్స్‌ కన్నా ముందు ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌స్మిత్‌ అగ్రస్థానంలో ఉండగా, టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే అతడు పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజామ్‌, న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌లను అధిగమించాడు. 

మరోవైపు ఆల్‌రౌండర్ల జాబితాలో హోల్డర్‌ 18 నెలల పాటు నంబర్‌ వన్‌గా కొనసాగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌లో స్టోక్స్‌ అద్భుత బ్యాటింగ్‌ ప్రదర్శన చేస్తున్నాడు. తొలి టెస్టులో 43, 46 పరుగులు చేసిన అతడు రెండో టెస్టులో 176, 78 విరోచితంగా ఆడాడు. దీంతో ఆల్‌రౌండర్ల జాబితాలో తొలిసారి అగ్రస్థానం చేరుకున్నాడు. కాగా, 2006 మేలో మాజీ క్రికెటర్‌ ఆండ్రూ ఫ్లింటాప్‌  తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసిన తొలి ఇంగ్లాండ్‌ క్రికెటర్‌గా స్టోక్స్‌ రికార్డు నెలకొల్పాడు. అలాగే 2008 ఏప్రిల్‌లో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ జాక్వెస్‌ కలీస్‌ అత్యథికంగా 517 పాయింట్లు సాధించాక.. స్టోక్స్‌ మాత్రమే 497 పాయింట్లు సాధించాడు. ఇక ఇదే జాబితాలో టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా 397 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని