IPL 2021: చెన్నై.. తొమ్మిదోసారి

చెన్నై ఐపీఎల్‌-14 ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. పృథ్వీ షా (60; 34 బంతుల్లో 7×4, 3×6), పంత్‌ (51 నాటౌట్‌; 35 బంతుల్లో 3×4, 2×6), హెట్‌మయర్‌ (37; 24 బంతుల్లో 3×4, 1×6) మెరవడంతో మొదట దిల్లీ 5 వికెట్లకు 172 పరుగులు సాధించింది.

Updated : 11 Oct 2021 07:45 IST

 ఐపీఎల్‌ ఫైనల్లో ప్రవేశం

క్వాలిఫయర్‌-1లో దిల్లీపై విజయం

చెలరేగిన ఉతప్ప, రుతురాజ్‌

ఆఖర్లో ధోని ధనాధన్‌

సూపర్‌కింగ్స్‌దే సంబరం. మూడుసార్లు ఛాంపియన్‌ చెన్నై.. తొమ్మిదోసారి ఐపీఎల్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఉతప్ప దంచుడు.. రుతురాజ్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌.. తనలోని ఒకప్పటి ఫినిషర్‌ను గుర్తుకు తెస్తూ ఒత్తిడిలో ధోని మెరుపులు.. వెరసి ఉత్కంఠ పోరులో పైచేయి సాధించింది. చెన్నై అనుభవాన్నంతా ఉపయోగిస్తూ క్వాలిఫయర్‌-1లో కుర్ర దిల్లీని మట్టికరిపించింది. ఓడిపోయినా ఫైనల్‌ చేరేందుకు దిల్లీకి ఇంకో ఛాన్సుంది. కోల్‌కతా, బెంగళూరు మధ్య ఎలిమినేటర్‌లో విజేతను పంత్‌ జట్టు ఢీకొంటుంది.

దుబాయ్‌

చెన్నై ఐపీఎల్‌-14 ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. పృథ్వీ షా (60; 34 బంతుల్లో 7×4, 3×6), పంత్‌ (51 నాటౌట్‌; 35 బంతుల్లో 3×4, 2×6), హెట్‌మయర్‌ (37; 24 బంతుల్లో 3×4, 1×6) మెరవడంతో మొదట దిల్లీ 5 వికెట్లకు 172 పరుగులు సాధించింది. హేజిల్‌వుడ్‌ (2/29), మొయిన్‌ అలీ (1/27) బంతితో రాణించారు. రుతురాజ్‌ గైక్వాడ్‌ (70; 50 బంతుల్లో 5×4, 2×6), ఉతప్ప (63; 44 బంతుల్లో 7×4, 2×6)ల అదిరే బ్యాటింగ్‌కు కెప్టెన్‌ ధోని (18 నాటౌట్‌; 6 బంతుల్లో 3×4, 1×6) కొస మెరుపులు  తోడవడంతో లక్ష్యాన్ని చెన్నై 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రుతురాజ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

ఆ ఇద్దరి జోరు: ఛేదనలో చెన్నై తొలి ఓవర్లోనే డుప్లెసిస్‌ను కోల్పోయినా.. అతడి స్థానంలో వచ్చిన ఉతప్ప విరుచుకుపడడంతో స్కోరు బోర్డు ఉరకలెత్తింది. మరోవైపు రుతురాజ్‌ సహకరిస్తుండగా ఉతప్ప బ్యాట్‌ ఝుళిపించాడు.పవర్‌ప్లే ముగిసే సమయానికి స్కోరు 59/1. అవేష్‌ ఖాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో ఉతప్ప రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు దంచాడు. తర్వాత స్కోరు వేగం తగ్గినా చేతిలో వికెట్లు ఉండడం, క్రీజులో స్థిరపడ్డ బ్యాట్స్‌మెన్‌ ఉండడంతో చెన్నైకి ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయింది. 10 ఓవర్లకు స్కోరు 81/1. అక్షర్‌ వేసిన ఆ తర్వాత ఓవర్లో రుతురాజ్‌ వరుసగా 4, 6 దంచాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో ఉతప్ప వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. 13 ఓవర్లకు స్కోరు 111/1. చెన్నై స్పష్టంగా విజయం దిశగా సాగుతున్న దశ అది. చేతిలో 9 వికెట్లున్న ఆ జట్టు.. చివరి ఏడు ఓవర్లలో చేయాల్సింది 62 పరుగులు. కానీ మ్యాచ్‌ ఒక్కసారిగా ఉత్కంఠగా మారింది. చెన్నై ఆరు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. జోరుమీదున్న ఉతప్పతో పాటు శార్దూల్‌, రాయుడు వెంటవెంటనే ఔటయ్యారు. రుతురాజ్‌ చక్కగానే బ్యాటింగ్‌ చేస్తున్నా.. దిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండడం, సాధించాల్సిన రన్‌రేట్‌ పెరుగుతుండడంతో చెన్నైపై ఒత్తిడి పెరిగిపోయింది.

ధోని కొసమెరుపులు..: రుతురాజ్‌ రెండు ఫోర్లు కొట్టడంతో నార్జ్‌ వేసిన 18వ ఓవర్లో 11 పరుగులు రాగా.. చివరి రెండు ఓవర్లలో చెన్నైకి 24 పరుగులు అవసరమయ్యాయి. కానీ అవేష్‌ ఖాన్‌ వేసిన 19వ ఓవర్‌ తొలి బంతికే రుతురాజ్‌ ఔటయ్యాడు. అప్పుడొచ్చాడు క్రీజులోకి ధోని. ఇటీవల కాలంలో అతడు అంతగా ఫామ్‌లో లేకపోవడంతో ఎలా ఆడతాడో అని ,చెన్నై అభిమానుల్లో టెన్షన్‌. అలీ ఫోర్‌ కొట్టి సింగిల్‌ తీయడంతో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని.. తొలి బంతిని తాక లేకపోయాడు. కానీ తర్వాతి బంతిని తనదైన శైలిలో సిక్స్‌గా మలిచాడు. తర్వాత స్లో బంతిని అందుకోలేకపోయాడు. చివరి ఓవర్లో (టామ్‌ కరన్‌) చెన్నై 13 పరుగులు చేయాల్సిన స్థితిలో తొలి బంతికే అలీ నిష్క్రమించడంతో ఆ జట్టుపై ఒత్తిడి ఇంకా పెరిగిపోయింది. కానీ తనలోని పాత ఫినిషర్‌ను బయటికి తీస్తూ.. ధోని ధనాధన్‌ షాట్లతో చెన్నైని విజయ తీరాలకు చేర్చాడు. టామ్‌ రెండో బంతిని ధోని ఎక్స్‌ట్రా కవర్లో బౌండరీ దాటించాడు. ఆఫ్‌స్టంప్‌ ఆవల పడ్డ తర్వాతి బంతిని అతడు కొట్టే ప్రయత్నం చేయగా.. ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌తో ఫోర్‌ వచ్చింది. 3 బంతులో చెన్నై 5 పరుగులు చేయాల్సిన స్థితిలో టామ్‌ వైడ్‌ వేశాడు. ఆ తర్వాతి బంతిని డీప్‌ స్క్వేర్‌ లెగ్‌లో బౌండరీ దాటించడం ద్వారా ధోని పని పూర్తి చేశాడు.

పృథ్వీ ధనాధన్‌: అంతకుముందు దిల్లీ ఇన్నింగ్స్‌ ఆసక్తికరంగా సాగింది. పృథ్వీ ధనాధన్‌ బ్యాటింగ్‌తో ఘనంగా ఆరంభించిన ఆ జట్టు.. తర్వాత చెన్నై బౌలర్ల ధాటికి తడబడింది. ఆపై పంత్‌, హెట్‌యమర్‌ మెరుపులతో ఇన్నింగ్స్‌ను మెరుగ్గా ముగించింది. టాస్‌ ఓడి దిల్లీ బ్యాటింగ్‌కు దిగగా.. చెలరేగి ఆడిన పృథ్వీ షా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కళ్లు చెదిరే షాట్లతో అలరించాడు. హేజిల్‌వుడ్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో ఫోర్‌, సిక్స్‌ బాదిన అతడు.. దీపక్‌ చాహర్‌ ఓవర్లో ఏకంగా నాలుగు ఫోర్లు కొట్టాడు. ధావన్‌ (7)ను హేజిల్‌వుడ్‌ వెనక్కి పంపినా.. పృథ్వీ జోరు తగ్గలేదు. శార్దూల్‌    బౌలింగ్‌లో అతడు రెండు సిక్స్‌లు దంచడంతో దిల్లీ 5 ఓవర్లలో 50/1తో  నిలిచింది. కానీ ఆ తర్వాత ఆ జట్టు వేగానికి కళ్లెం పడింది. తర్వాతి ఆరు ఓవర్లలో 33 పరుగులే ఇచ్చిన చెన్నై బౌలర్లు, 4 వికెట్లు పడగొట్టి దిల్లీని గట్టి దెబ్బతీశారు. దూకుడు కొనసాగిస్తూ జడేజా బౌలింగ్‌లో లాఫ్టెడ్‌ షాట్‌ ఆడిన పృథ్వీ లాంగాఫ్‌లో డుప్లెసిస్‌ అందుకున్న చక్కటి క్యాచ్‌కు నిష్క్రమించాడు. 27 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించిన అతడు.. నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. కానీ హెట్‌మయర్‌, పంత్‌ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. అయిదో వికెట్‌కు 50 బంతుల్లో 83 పరుగులు జోడించి దిల్లీకి మంచి స్కోరును అందించారు. భాగస్వామ్యం మొదట్లో వీళ్లిద్దరు సింగిల్స్‌కే పరిమితమయ్యారు. 13 ఓవర్లకు స్కోరు 96/4. హెట్‌మయర్‌, పంత్‌ క్రమంగా దూకుడు పెంచారు. చకచకా సింగిల్స్‌ తీస్తూ, వీలైనప్పుడల్లా బంతిని బౌండరీ దాటించారు. హెట్‌మయర్‌ను 19వ ఓవర్లో బ్రావో ఔట్‌ చేయడంతో అయిదో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.. చివరి ఓవర్లో పంత్‌కు శార్దూల్‌ వరుసగా మూడు డాట్‌ బాల్స్‌ వేయడం విశేషం. తన ఇన్నింగ్స్‌లో మొత్తం రెండు సిక్స్‌లు బాదిన పంత్‌ 35 బంతుల్లో అర్ధశతకం సాధించాడు.


దిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) డుప్లెసిస్‌ (బి) జడేజా 60; శిఖర్‌ ధావన్‌ (సి) ధోని (బి) హేజిల్‌వుడ్‌ 7; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) రుతురాజ్‌ (బి) హేజిల్‌వుడ్‌ 1; అక్షర్‌ పటేల్‌ (సి) శాంట్నర్‌ (బి) అలీ 10; పంత్‌ నాటౌట్‌ 51; హెట్‌మయర్‌ (సి) జడేజా (బి) బ్రావో 37; టామ్‌ కరన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20  ఓవర్లలో 5 వికెట్లకు) 172

వికెట్ల పతనం: 1-36, 2-50, 3-77, 4-80, 5-163

బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌   3-0-26-0; హేజిల్‌వుడ్‌     4-0-29-2; శార్దూల్‌ ఠాకూర్‌  3-0-36-0; జడేజా 3-0-23-1; మొయిన్‌ అలీ 4-0-27-1; డ్వేన్‌ బ్రావో 3-0-31-1

చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) అక్షర్‌ (బి) అవేష్‌ 70; డుప్లెసిస్‌ (బి) నార్జ్‌ 1; ఉతప్ప (సి) శ్రేయస్‌ (బి) టామ్‌ కరన్‌ 63; శార్దూల్‌ (సి) శ్రేయస్‌ (బి) టామ్‌ కరన్‌ 0; రాయుడు రనౌట్‌ 1; మొయిన్‌ అలీ (సి) రబాడ (బి) టామ్‌ కరన్‌ 16; ధోని నాటౌట్‌ 18; జడేజా నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (19.4   ఓవర్లలో 6 వికెట్లకు) 173

వికెట్ల పతనం: 1-3, 2-113, 3-117, 4-119, 5-149, 6-160

బౌలింగ్‌: నార్జ్‌ 4-0-31-1; అవేష్‌ ఖాన్‌ 4-0-47-1; రబాడ 3-0-23-0; అక్షర్‌ పటేల్‌ 3-0-23-0; టామ్‌ కరన్‌ 3.4-0-29-3; అశ్విన్‌ 2-0-19-0


9

చెన్నై సూపర్‌కింగ్స్‌ ఫైనల్‌ చేరిన సందర్భాలు. మొత్తం ఆ జట్టుకిది 12వ ఐపీఎల్‌. నిషేధం కారణంగా 2016, 17 సీజన్లలో ఆ జట్టు లీగ్‌కు దూరమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని