ఆ ఒక్కటి ఎవరిదో?

ఐపీఎల్‌-14లో ఇప్పటికే మూడు జట్లు (దిల్లీ, చెన్నై, బెంగళూరు) ప్లేఆఫ్స్‌ చేరిపోయాయి. మిగిలిన చివరి బెర్తు కోసం నాలుగు జట్లు (కోల్‌కతా, ముంబయి, పంజాబ్‌, రాజస్థాన్‌) పోటీలో ఉన్నాయి. ఈ స్థానం ఎవరిదన్నది లీగ్‌ దశలో చివరి మ్యాచ్‌ పూర్తయ్యే

Updated : 07 Oct 2021 08:55 IST

* ఐపీఎల్‌-14లో ఇప్పటికే మూడు జట్లు (దిల్లీ, చెన్నై, బెంగళూరు) ప్లేఆఫ్స్‌ చేరిపోయాయి. మిగిలిన చివరి బెర్తు కోసం నాలుగు జట్లు (కోల్‌కతా, ముంబయి, పంజాబ్‌, రాజస్థాన్‌) పోటీలో ఉన్నాయి. ఈ స్థానం ఎవరిదన్నది లీగ్‌ దశలో చివరి మ్యాచ్‌ పూర్తయ్యే వరకు తేలేలా కనిపించడం లేదు. పోటీలో ఉన్న నాలుగు జట్లూ తలో 13 మ్యాచ్‌లు ఆడేశాయి. ఆరేసి విజయాలతో కోల్‌కతా, ముంబయి రేసులో ముందుండగా.. అయిదేసి విజయాలతో పంజాబ్‌, రాజస్థాన్‌ సాంకేతికంగా ఇంకా పోటీలో ఉన్నాయి. మరి ఈ నాలుగు జట్లలో దేని ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

* మిగతా మూడు జట్లతో పోలిస్తే కోల్‌కతా మెరుగైన స్థితిలో ఉంది. 6 విజయాలు సాధించడమే కాదు.. మెరుగైన నెట్‌ రన్‌రేట్‌ (+0.294) కూడా ఆ జట్టు సొంతం. గురువారం రాత్రి రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడనున్న కేకేఆర్‌.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే చివరి ప్లేఆఫ్‌ బెర్తును దాదాపుగా సొంతం చేసుకున్నట్లే. ఈ మ్యాచ్‌ ఓడినా కోల్‌కతాకు అవకాశముంటుంది. కాకపోతే భారీ తేడాతో ఓడకూడదు. అప్పుడు ముంబయి చివరి మ్యాచ్‌లో ఓడిపోతే కోల్‌కతానే ముందంజ వేస్తుంది.

* కోల్‌కతాతో సమానంగా ఆరు విజయాలు సాధించినప్పటికీ.. ఆ జట్టుతో పోలిస్తే ముంబయి నెట్‌రన్‌రేట్‌ (-0.048)లో వెనుకబడి ఉంది. రాజస్థాన్‌ చేతిలో కోల్‌కతా ఓడిపోయి, తన చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను ఓడిస్తే ముంబయిదే ప్లేఆఫ్స్‌ బెర్తు. కోల్‌కతా గెలిచినా ముంబయికి అవకాశం ఉంటుంది. అయితే భారీ తేడాతో ఆఖరి మ్యాచ్‌లో గెలవాల్సి రావొచ్చు. చివరి మ్యాచ్‌లో ఓడితే ఈ నెట్‌రన్‌రేట్‌తో ముందంజ వేయడం దాదాపు అసాధ్యం. కోల్‌కతా మరీ చిత్తుగా ఓడితే  తప్ప ముంబయికి అవకాశం లేనట్లే.

* పంజాబ్‌, రాజస్థాన్‌ జట్లు రెంటికీ ప్లేఆఫ్స్‌ అవకాశాలు దాదాపు లేనట్లే. వాటిలో ఒకటి ముందంజ వేయాలంటే అద్భుతాలు జరగాలి. చెరో అయిదు విజయాలే సాధించిన ఈ జట్ల నెట్‌రన్‌రేట్‌ కూడా పేలవం. పంజాబ్‌ రన్‌రేట్‌ -0.241 కాగా, రాజస్థాన్‌ది -0.737 మాత్రమే. కోల్‌కతా, ముంబయి తమ చివరి మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడిపోయి.. పంజాబ్‌,  రాజస్థాన్‌ భారీ విజయాలు సాధిస్తే.. వీటిలో ఒకటి ముందంజ వేయొచ్చు. ఆ స్థితిలోనూ అన్ని సమీకరణాలూ కలిసొస్తే పంజాబ్‌కైనా కాస్త అవకాశముందేమో కానీ.. -0.737 నెట్‌ రన్‌రేట్‌తో ఉన్న రాయల్స్‌ మిగతా జట్లను దాటి ముందంజ వేయడం అసాధ్యమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని