Updated : 16/11/2021 15:26 IST

IND vs NZ: టీమ్‌ఇండియా నిలవాలంటే.. గెలవాల్సిందే

న్యూజిలాండ్‌తో పోరు నేడు

ఓడితే టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించినట్లే!

రాత్రి 7.30 నుంచి

దుబాయ్‌

అవును టీమ్‌ఇండియాకు ఇది చావో రేవోనే! కివీస్‌తో తాడోపేడో తేల్చుకోవాల్సిందే! ఓడితే అంతే సంగతులు.. ప్రపంచకప్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన టీమ్‌ఇండియా కథ దాదాపుగా ముగిసినట్లే. ‘నాకౌట్‌’ లాంటి మ్యాచ్‌లో కోహ్లీసేన న్యూజిలాండ్‌ను ఢీకొనబోతోంది. పాకిస్థాన్‌ చేతిలో ఓటమితో సెమీస్‌ అవకాశాలు క్లిష్టంగా మారిన నేపథ్యంలో స్టార్లతో కూడిన భారత బ్యాటింగ్‌ లైనప్‌కు, బౌలింగ్‌ దళానికి ఇది కఠిన పరీక్షే. బలంగా కనిపిస్తోన్న కివీస్‌పై పైచేయి సాధించాలంటే టీమ్‌ఇండియా గొప్ప ప్రదర్శన చేయాల్సిందే.

టీమ్‌ఇండియా కీలక సమరానికి సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ 12 మ్యాచ్‌లో ఆదివారం న్యూజిలాండ్‌ను  ఢీకొంటుంది. గత ఆదివారం తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ చేతిలో ఓడిన కోహ్లీసేన.. ఇటు బ్యాటింగ్‌లో, అటు బౌలింగ్‌లో సరిదిద్దుకోవాల్సిన లోపాలు చాలానే ఉన్నాయి. ఇంకో ఓటమికి అవకాశం లేదు. ఓడితే.. అద్భుతాల కోసం ఎదురు చూడాల్సిందే. గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ముందంజ వేయనుండగా.. భారత్‌, న్యూజిలాండ్‌, అఫ్గానిస్థాన్‌ మీద గెలిచిన పాకిస్థాన్‌ అగ్రస్థానంతో సెమీస్‌ చేరడం లాంఛనమే. భారత్‌, కివీస్‌లు అఫ్గానిస్థాన్‌తో పాటు పసికూనలు నమీబియా, స్కాట్లాండ్‌లపై గెలుస్తాయనుకుంటే.. ఆదివారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచే రెండో స్థానంతో సెమీస్‌ చేరే జట్టేదో నిర్ణయిస్తుందన్నమాట. కాబట్టి ఓడిన జట్టు ఇంటిముఖం పట్టినట్లే! పసికూనలున్న ఈ గ్రూపు-2 పేరుకే తేలికైంది. ఒక్క  ఓటమితోనే భారత్‌, కివీస్‌లు ఎదుర్కొంటున్న పరిస్థితి అందుకు నిదర్శనం.

తేలికేమీ కాదు..: న్యూజిలాండ్‌తో పోరు తేలికేమీ కాదు. ఆ జట్టుకు కూడా  ఇది చావో రేవో కాబట్టి గట్టిగా ప్రయత్నిస్తుందనడంతో సందేహం లేదు. అయితే బ్యాటింగ్‌లో కివీస్‌ ఇబ్బందుల ఎదుర్కోంటోంది. కెప్టెన్‌ విలియమ్సన్‌ సరైన ఫామ్‌లో లేడు. ఫిట్‌నెస్‌ సమస్యలూ ఎదుర్కొంటున్నాడు. గప్తిల్‌ పాదానికి గాయమైంది. విలియమ్సన్‌ మ్యాచ్‌ ఆడటం ఖాయమే కానీ.. గప్తిల్‌ సంగతే తేలాల్సి ఉంది. కేన్‌, గప్తిల్‌లతో పాటు మిచెల్‌, కాన్వే, ఫిలిప్స్‌, నీషమ్‌, సీఫర్ట్‌లతో కాగితం మీద మాత్రం కివీస్‌ బ్యాటింగ్‌ చాలా బలంగా కనిపిస్తోంది. నీషమ్‌, శాంట్నర్‌ బ్యాటుతో, బంతితో బాగా ఉపయోగపడతారు. అయితే బ్యాట్స్‌మెన్‌లో ఎవ్వరూ అంత జోరు మీద లేకపోవడం భారత్‌కు కలిసొచ్చే అంశం. సరైన ఫినిషర్‌ లేకపోవడం కూడా ఆ కివీస్‌ సమస్యే. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలంటే భారత బౌలర్లు ప్రణాళికలకు తగినట్లు బౌలింగ్‌ చేయాలి. బుమ్రా, షమి అంచనాలకు తగ్గట్లు చెలరేగడం భారత్‌కు కీలకం. భువి స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌ను తీసుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం. పాక్‌పై ప్రభావం చూపలేకపోయిన వీళ్లు గాడిన పడితే జట్టుకు ఎదురుండదు. స్పిన్నర్లు వరుణ్‌, జడేజా కూడా మాయ చేయాలని జట్టు ఆశిస్తోంది. ఇక రాహుల్‌, రోహిత్‌, కోహ్లి, సూర్యకుమార్‌, రిషబ్‌ పంత్‌, జడేజా, హార్దిక్‌లతో బలంగా కనిపిస్తోన్న లైనప్‌.. ఈ మ్యాచ్‌లోనైనా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తుందేమో చూడాలి. సౌథీ, బౌల్ట్‌ కీలక మ్యాచ్‌ల్లో గొప్పగా బౌలింగ్‌ చేస్తారు. వారికి భారత బ్యాట్స్‌మెన్‌పై మంచి అవగాహన ఉంది. శాంట్నర్‌, ఇష్‌ సోధీలతో కివీస్‌ స్పిన్‌ కూడా బాగానే ఉంది.

హార్దిక్‌ ఉంటాడా?

పాక్‌తో మ్యాచ్‌లో పరాభవం తర్వాత భారత జట్టులో అత్యంత విమర్శలు ఎదుర్కొన్నది హార్దిక్‌ పాండ్యనే. అతను చాన్నాళ్లుగా పేరుకే ‘ఆల్‌రౌండర్‌’గా ఉంటున్నాడు. కానీ బౌలింగ్‌ చేయట్లేదు. కేవలం బ్యాటింగ్‌తో జట్టులో ఉండేంతగా అతనేమీ మెరుపులు మెరిపించట్లేదు. పాక్‌తో మ్యాచ్‌లోనూ తేలిపోయాడు. హార్దిక్‌ బౌలింగ్‌ చేయనపుడు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా ఇషాన్‌ కిషన్‌ను ఎంచుకోవచ్చు. బౌలింగే ప్రధానమనుకుంటే కావాలనుకుంటే కాస్త బ్యాటింగ్‌ చేయగల శార్దూల్‌ ఠాకూర్‌ను లేదా అశ్విన్‌ను తీసుకోవచ్చు. మరి కివీస్‌తో మ్యాచ్‌లో హార్దిక్‌పై వేటు పడుతుందా.. లేక హార్దిక్‌కు ఇంకో అవకాశం ఇస్తారా అన్నది చూడాలి. కోహ్లి మాటల్ని బట్టి చూస్తే హార్దిక్‌ ఆడే అవకాశముంది. నెట్స్‌లో బౌలింగ్‌ కూడా చేశాడు కాబట్టి ఈ మ్యాచ్‌లో అతను ఆడితే కచ్చితంగా బంతి పట్టుకునే అవకాశముంది.

టాస్‌ కీలకం...

టాస్‌ గెలిస్తే సగం పనైట్లే. ఈ ప్రపంచకప్‌లో పరిస్థితిది. టాస్‌ నెగ్గితే జట్లు మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్‌ ఎంచుకుంటున్నాయి. అది ఆ జట్లకు చాలా కలిసొస్తోంది. ఈ ఏడాది దుబాయ్‌లో జరిగిన 20 మ్యాచ్‌ల్లో 14 సార్లు ఛేదించిన జట్లే గెలిచాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో కూడా టాస్‌ చాలా కీలకమే అనడంలో సందేహం లేదు. ఒకవేళ టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేయాల్సి వస్తే భారత్‌.. పరిస్థితులకు తగ్గట్లు ఎలా ఆడుతుందో చూడాలి.

ఆరో బౌలర్‌ అవసరమే..

టీమ్‌ఇండియా ఆరో బౌలర్‌ అవసరమని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. ‘‘అది నేను కావొచ్చు లేదా హార్దిక్‌ కావొచ్చు... ఆరో బౌలింగ్‌ ప్రత్యామ్నాయం ఉండడం చాలా ముఖ్యం. ఒకట్రెండు ఓవర్లు వేయగలిగే ఫిట్‌నెస్‌ హార్దిక్‌కు ఉండాలి’’ అని కోహ్లి అన్నాడు. ‘‘ఆరో బౌలర్‌ను ఎప్పుడు వాడాలన్నది మ్యాచ్‌ పరిస్థితి నిర్దేశిస్తుంది. మా చివరి మ్యాచ్‌లో వాళ్లు (పాకిస్థాన్‌) మొదట బ్యాటింగ్‌ చేసి ఉంటే నేను ఒకట్రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసేవాణ్ని. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మాకు వికెట్లు అవసరమైనప్పుడు మా ప్రధాన బౌలర్లతోనే బౌలింగ్‌ చేయించాల్సివచ్చింది. ఆరు ఏడు బౌలింగ్‌ ప్రత్యామ్నాయాలు ఉన్న జట్టు ఓడిపోదనేమీ లేదు’’ అని చెప్పాడు.


3

బౌల్ట్‌, సౌథీ, శాంట్నర్‌ టీ20 క్రికెట్లో తలో మూడుసార్లు రోహిత్‌ను ఔట్‌ చేశారు.


4

షమి నాలుగుసార్లు విలియమ్సన్‌ను ఔట్‌ చేశాడు.


* 2016 వరకు టీ20ల్లో భారత్‌ చేతిలో న్యూజిలాండ్‌ ఒక్క మ్యాచ్‌ కూడా ఓడలేదు. ఆ తర్వాత 11 మ్యాచ్‌ల్లో ఎనిమిది ఓడిపోయింది.


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని