తొలి ముద్దు ఎవరిదో?

అయిదు సార్లు వన్డే ప్రపంచకప్‌ సొంతం చేసుకున్నప్పటికీ అందని ద్రాక్షలా ఊరిస్తున్న తొలి టీ20 ప్రపంచకప్‌ కోసం నిరీక్షణ కొనసాగిస్తున్న జట్టు ఓ వైపు.. వరుసగా గత రెండు వన్డే ప్రపంచకప్‌ల ఫైనల్లోనూ ఓడి ఈ ఏడాది ప్రపంచ టెస్టు

Updated : 14 Nov 2021 07:07 IST

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ నేడే

కొత్త ఛాంపియన్‌పై ఉత్కంఠ

ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్‌ ఢీ

రాత్రి 7.30 నుంచి

అయిదు సార్లు వన్డే ప్రపంచకప్‌ సొంతం చేసుకున్నప్పటికీ అందని ద్రాక్షలా ఊరిస్తున్న తొలి టీ20 ప్రపంచకప్‌ కోసం నిరీక్షణ కొనసాగిస్తున్న జట్టు ఓ వైపు.. వరుసగా గత రెండు వన్డే ప్రపంచకప్‌ల ఫైనల్లోనూ ఓడి ఈ ఏడాది ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలిచి ఇప్పుడు పొట్టి కప్పు బోణీ కొట్టేందుకు సిద్ధమైన జట్టు మరోవైపు!

దూకుడైన ఆటతో దూసుకెళ్లే జట్టు ఒకటి.. ప్రశాంత మంత్రంతో గొప్ప ఫలితాలు రాబట్టే జట్టు మరొకటి!

బ్యాటింగ్‌ బలాన్నే నమ్ముకుని బరిలో దిగుతున్న జట్టు అటువైపు.. బౌలింగ్‌పై భారం వేసి రంగంలో దూకుతున్న జట్టు ఇటువైపు!

ఇప్పుడా రెండు జట్లు పొట్టి ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలవాలన్న లక్ష్యంతో తుది పోరుకు సిద్ధమయ్యాయి. అవే.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌. ఈ పొరుగు దేశాలు ఇప్పుడు ఆదివారం ఆఖరి యుద్ధంలో అమీతుమీ తేల్చుకునేందుకు సన్నద్ధమయ్యాయి. హోరాహోరీగా జరిగే  ఈ సమరంలో గెలిచి.. పొట్టి కప్పును తొలిసారి ముద్దాడేందుకు పోరాటానికి సై అంటున్నాయి.

దుబాయ్‌

టీ20 ప్రపంచకప్‌ ఆఖరి ఘట్టానికి వేళైంది. టైటిల్‌ పోరులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. కివీస్‌ తొలిసారి పొట్టి కప్పులో తుది పోరు ఆడబోతుండగా.. ఆసీస్‌కిది రెండో ఫైనల్‌. 2015 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆసీస్‌ చేతిలో ఓడిన కివీస్‌.. ఇప్పుడా జట్టుపై ప్రతీకారం తీర్చుకుని ఈ ఏడాది రెండో ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలిచిన విలియమ్సన్‌ సేన.. అదే ఊపులో పొట్టి కప్పునూ పట్టేయాలనుకుంటోంది. 2010 ఫైనల్లో ఇంగ్లాండ్‌ చేతిలో ఓడిన ఆసీస్‌.. ఈ సారి మాత్రం ట్రోఫీని వదలకూడదనే పట్టుదలతో ఉంది. కుదిరిన కూర్పుతో ఆసీస్‌ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. జట్టులోని ఆటగాళ్లు గత మ్యాచ్‌ల్లో తమ పాత్రలను సమర్థంగా పోషించారు. ఇక కివీస్‌కు కాన్వే దూరమవడంతో దెబ్బ పడింది. ఆసీస్‌ బ్యాటింగే బలంగా బరిలోకి దిగుతుండగా.. కివీస్‌ బౌలింగ్‌నే ఎక్కువగా నమ్ముకుంది.

వీళ్లు నిలబడితే..

బ్యాటింగ్‌లో ఆసీస్‌కు వార్నర్‌, మ్యాక్స్‌వెల్‌, స్టాయినిస్‌, వేడ్‌ కీలకం కానున్నారు. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడడమే ఆసీస్‌కు కలిసొచ్చింది. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఆ జట్టు నాలుగు సార్లు పవర్‌ప్లేలో 50కి పైగా పరుగులు చేసింది. మంచి ఫామ్‌లో ఉన్న వార్నర్‌ ఆ జట్టుకు కొండంత బలం. టోర్నీకి ముందు పేలవ ఫామ్‌లో ఉన్న అతనిప్పుడు కొత్తగా కనిపిస్తున్నాడు. భారీ షాట్లు ఆడడమే లక్ష్యంగా కాకుండా చివరి వరకూ ఉండి జట్టుకు విజయాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు. పరిస్థితులకు అనుగుణంగా గేర్లు మార్చి బ్యాటింగ్‌ చేస్తున్నాడు. స్పిన్నర్లపైనా ఆధిపత్యం చలాయిస్తున్నాడు. ఈ టోర్నీలో ఆరు మ్యాచ్‌ల్లో 236 పరుగులతో ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకూ బ్యాటింగ్‌లో రాణించకపోయినా మ్యాక్స్‌వెల్‌ను తక్కువ చేసి చూడలేం. అతను ఒక్కసారి లయ అందుకుంటే ఒంటిచేత్తో మ్యాచ్‌ గమనాన్ని మారుస్తాడు. సెమీస్‌లో పాక్‌పై స్టాయినిస్‌, వేడ్‌ అద్భుత పోరాటంతో జట్టును గెలిపించారు. ముఖ్యంగా వేడ్‌ సంచలన ఇన్నింగ్స్‌తో జోరందుకున్నాడు. మరోవైపు కెప్టెన్‌ ఫించ్‌ ఫామ్‌ ఆందోళన కలిగించేదే. కానీ కివీస్‌పై టీ20ల్లో అత్యధిక పరుగులు (251) చేసిన ఆసీస్‌ ఆటగాడిగా కొనసాగుతున్న అతను.. మరోసారి ఆ జట్టుపై రాణిస్తాడేమో చూడాలి. ఇక కివీస్‌ బ్యాటింగ్‌ భారం గప్తిల్‌, మిచెల్‌, విలియమ్సన్‌, నీషమ్‌పై ఉంది. ఈ ఏడాది ఆసీస్‌పై మంచి ప్రదర్శన చేయడంతో పాటు స్పిన్‌ను సమర్థంగా ఆడే కాన్వే గాయంతో ఫైనల్లో ఆడలేకపోవడం లోటే. అతని స్థానంలో సీఫర్ట్‌ జట్టులోకి రానున్నాడు. గప్తిల్‌ మరోసారి కంగారూలపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఫార్మాట్లో ఆసీస్‌పై అత్యధిక పరుగులు (435) చేసిన కివీస్‌ ఆటగాడతనే. ఫైనల్లో కెప్టెన్‌ విలియమ్సన్‌ భారీ ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరం ఉంది. సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై చెలరేగిన నీషమ్‌పై మంచి అంచనాలున్నాయి.


1

టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటివరకూ ఈ రెండు జట్లు ఒక్కసారి మాత్రమే (2016లో) తలపడ్డాయి. అప్పుడు కివీస్‌ గెలిచింది.


14

అంతర్జాతీయ టీ20ల్లో ఈ రెండు జట్లు 14 మ్యాచ్‌ల్లో  పోటీపడగా.. ఆసీస్‌ 9, కివీస్‌ 5 విజయాలు సాధించాయి.


తుది పోరుకు చేరాయిలా..

అత్యంత పోటీ నెలకొన్న గ్రూప్‌-1 నుంచి ఆస్ట్రేలియా.. చక్కటి ప్రదర్శనతో ఫైనల్లో అడుగుపెట్టింది. సూపర్‌- 12 దశలో తన తొలి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా దక్షిణాఫ్రికా, శ్రీలంకపై నెగ్గింది. కానీ ఆ తర్వాత మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో ఓడింది. గ్రూప్‌ దశ చివరి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌ను ఓడించి రెండో స్థానంతో సెమీస్‌లో అడుగుపెట్టింది. టైటిల్‌ ఫేవరేట్‌గా కనిపించిన పాకిస్థాన్‌పై గెలిచి ఆసీస్‌ ఫైనల్‌ చేరింది. మరోవైపు గ్రూప్‌- 2లో తన తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌ చేతిలో ఓడిన కివీస్‌.. ఆ తర్వాత వరుసగా భారత్‌, స్కాట్లాండ్‌, నమీబియా, అఫ్గానిస్థాన్‌పై గెలిచి రెండో స్థానంతో ముందంజ వేసింది. సెమీస్‌లో పటిష్ఠమైన ఇంగ్లాండ్‌ను మట్టికరిపించి తుదిపోరు చేరింది.

వీళ్లను ఆపితేనే..

బ్యాటింగ్‌లో రెండు జట్లు సమానంగానే కనిపిస్తున్నప్పటికీ బౌలింగ్‌లో మాత్రం ఆసీస్‌ కంటే కివీస్‌ కాస్త మెరుగ్గా ఉంది. కప్పును ముద్దాడాలంటే రెండు జట్లూ ప్రత్యర్థి బౌలర్లను ఆపాల్సిందే. సీనియర్‌ పేస్‌ ద్వయం బౌల్ట్‌, సౌథీతో పాటు మిల్నె, స్పిన్నర్లు సోధి, శాంట్నర్‌తో కివీస్‌ బౌలింగ్‌ దుర్భేద్యంగా ఉంది. సోధికి ఆసీస్‌తో మ్యాచ్‌ అంటే వికెట్ల పండగే. కంగారూలపై అతను 9 మ్యాచ్‌ల్లో 15.68 సగటుతో 16 వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో వార్నర్‌ మినహా మిగతా ఆసీస్‌ టాప్‌-6 బ్యాటర్లెవరూ స్పిన్‌ బౌలింగ్‌లో బంతికో పరుగు కూడా చేయలేకపోయారు. ఇదే బలహీనతను సొమ్ము చేసుకునేందుకు సోధి, శాంట్నర్‌ సిద్ధమయ్యారు. ఇక తన పేస్‌తో ఎప్పటిలాగే బౌల్ట్‌ వికెట్ల వేటలో సాగుతున్నాడు. ఇప్పటికే టోర్నీలో జట్టు తరపున అత్యధిక వికెట్లు (11) తీశాడు. అతనికి, వార్నర్‌కు మధ్య పోరు ఆసక్తి రేకెత్తిస్తోంది. పవర్‌ప్లేలో ప్రత్యర్థిని కివీస్‌ బౌలర్లు గొప్పగా కట్టడి చేస్తున్నారు. ఇప్పటివరకూ పవర్‌ప్లేలో ఆ జట్టు 5.89 ఎకానమీతో మాత్రమే పరుగులిచ్చింది. మరోవైపు ఆసీస్‌ తరపున జంపా ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. మధ్య ఓవర్లలో అతను కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటివరకూ ఆరు ఇన్నింగ్స్‌ల్లో 12 వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న అతనితో కివీస్‌కు ప్రమాదం పొంచి ఉంది. స్పిన్‌ను ఆడడంలో ప్రత్యర్థి వైఫల్యాన్ని అందిపుచ్చుకోవాలని జంపా భావిస్తున్నాడు. కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌ ఆడనున్న ఆసీస్‌ పేస్‌ త్రయం స్టార్క్‌, కమిన్స్‌, హేజిల్‌వుడ్‌ ఫైనల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి.

పిచ్‌ ఎలా ఉంది?

దుబాయ్‌లో ఆడిన తమ గత మ్యాచ్‌ల్లో ఆసీస్‌, కివీస్‌ గెలిచాయి. ఈ పిచ్‌ బ్యాటర్లకు ఎక్కువగా సహకరించే అవకాశం ఉంది. తొలి ఇన్నింగ్స్‌ పవర్‌ ప్లేలో పేసర్లు ప్రభావం చూపే ఆస్కారముంది. ఈ టోర్నీలో దుబాయ్‌లో ఇప్పటివరకూ జరిగిన రాత్రిపూట మ్యాచ్‌ల్లో తొలి ఇన్నింగ్స్‌ పవర్‌ప్లేలో పేసర్లు 12.94 సగటుతో 17 వికెట్లు తీశారు. ఈ పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 127 మాత్రమే. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు కీలకం కానున్నారు.

టాస్‌తోనే తేలిపోతుందా?

ఫైనల్‌ ఆరంభానికి అరగంట ముందే విజేత ఎవరో ఓ అంచనాకు వచ్చే అవకాశముందా? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకు కారణం టాస్‌. ఈ ప్రపంచకప్‌లో టాస్‌ గెలిస్తే మ్యాచ్‌ నెగ్గినట్లేననే అభిప్రాయం ఏర్పడింది. మంచు ప్రభావం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ సులువుగా మారి ఎంత పెద్ద లక్ష్యాన్నైనా జట్లు అందుకుంటున్నాయి. బౌలర్లకు బంతిపై పట్టు దొరకకపోవడంతో ఏమీ చేయలేకపోతున్నారు. అందుకే టాస్‌ గెలవగానే మరో సందేహం లేకుండా జట్లు ఫీల్డింగ్‌ ఎంచుకుంటున్నాయి. ముఖ్యంగా ఫైనల్‌ జరిగే దుబాయ్‌లో ఈ ప్రపంచకప్‌లో సూపర్‌ 12 దశ నుంచి జరిగిన 12 మ్యాచ్‌లకు గాను రెండో సారి బ్యాటింగ్‌ చేసిన జట్లు 11 సార్లు గెలిచాయి. ఇక అందులో రాత్రిపూట జరిగిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ ఛేదన చేసిన జట్లే నెగ్గాయి. దుబాయ్‌లో జరిగిన గత 17 టీ20 మ్యాచ్‌ల్లో 16 సార్లు రెండో సారి బ్యాటింగ్‌ చేసిన జట్లదే పైచేయి. ఈ టోర్నీలో ఆసీస్‌కు దక్కిన అయిదు విజయాలు ఛేదనలోనే సొంతమయ్యాయి. ఈ నేపథ్యంలో ఫైనల్లో గెలవాలంటే ముందు టాస్‌ అనే అదృష్టాన్ని  అందుకోవాల్సిందే.

తుది జట్లు (అంచనా)

ఆస్ట్రేలియా: వార్నర్‌, ఫించ్‌, మార్ష్‌, మ్యాక్స్‌వెల్‌, స్మిత్‌, స్టాయినిస్‌, వేడ్‌, కమిన్స్‌, స్టార్క్‌, జంపా, హేజిల్‌వుడ్‌

న్యూజిలాండ్‌: గప్తిల్‌, మిచెల్‌, విలియమ్సన్‌, ఫిలిప్స్‌, నీషమ్‌, సీఫర్ట్‌, శాంట్నర్‌, మిల్నె, సౌథీ, సోధి, బౌల్ట్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని