David Warner: వార్నరా మజాకా

అప్పుడు.. జట్టుకు విజయాలు అందించడం లేదని కెప్టెన్‌గా అతడిపై వేటు పడింది.. బ్యాట్‌తో రాణించడం లేదని తుది జట్టు నుంచీ తప్పించారు. ఇదీ నెల రోజుల క్రితం ముగిసిన ఐపీఎల్‌లో ఓ ఆటగాడి పరిస్థితి!ఇప్పుడు...

Updated : 16 Nov 2021 07:16 IST

ఈనాడు క్రీడావిభాగం

అప్పుడు.. జట్టుకు విజయాలు అందించడం లేదని కెప్టెన్‌గా అతడిపై వేటు పడింది.. బ్యాట్‌తో రాణించడం లేదని తుది జట్టు నుంచీ తప్పించారు. ఇదీ నెల రోజుల క్రితం ముగిసిన ఐపీఎల్‌లో ఓ ఆటగాడి పరిస్థితి! ఇప్పుడు..

ఫైనల్‌ సహా కీలక మ్యాచ్‌ల్లో అద్భుత బ్యాటింగ్‌తో తమ జట్టు తొలిసారి టీ20 ప్రపంచకప్‌ సొంతం చేసుకోవడంలో అతడిదే ప్రధాన పాత్ర.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ’ కూడా అతనే.

ఈ ఉపోద్ఘాతం డేవిడ్‌ వార్నర్‌ గురించే అని ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. కొన్ని మ్యాచ్‌ల్లో రాణించకపోయేసరికి సన్‌రైజర్స్‌ పక్కన పెట్టేసిన ఈ ఆటగాడు.. టీ20 ప్రపంచకప్‌లో రెచ్చిపోయి ఆడేసి  అందనంత ఎత్తులో నిలిచాడు. ఇలాంటి ఆటగాడితో వ్యవహరించిన తీరుకు ఇప్పుడు హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ చింతిస్తూ ఉండక మానదు.

వార్నరేంటి ఇలా ఆడుతున్నాడు.. జట్టులో స్ఫూర్తి నింపలేకపోతున్నాడేంటి.. ఈ వైఫల్యం వయసు ప్రభావం వల్లేనా.. ఇక అతని     పనైపోయిందా.. ఇలా ఐపీఎల్‌-14 నడుస్తుండగా వార్నర్‌ గురించి ఎన్నో వ్యాఖ్యానాలు వినిపించాయి. వార్నర్‌ ఇన్నేళ్ల ఆట, జట్టుకు అందించిన విజయాలు, ఫ్రాంఛైజీకి తెచ్చిన ఆకర్షణ గుర్తుంచుకోకుండా సన్‌రైజర్స్‌ అతడిపై వేటు వేసేసింది. వాటన్నింటినీ చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయిన 35 ఏళ్ల వార్నర్‌ ఇప్పుడు ప్రపంచకప్‌లో తన ఆటతో విమర్శకులకు దిమ్మతిరిగే సమాధానమిచ్చాడు. ‘‘ఫామ్‌లో లేడు.. వయసు పెరిగింది.. నెమ్మదించాడు’’.. ఇదీ ప్రపంచకప్‌లో వార్నర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ’గా నిలిచిన తర్వాత అతని భార్య క్యాండిస్‌..  విమర్శకులను ఉద్దేశించి వ్యంగ్యంగా పెట్టిన పోస్టు. అతణ్ని విమర్శించిన వాళ్లందరికీ ఆమె చెంపపెట్టు లాంటి జవాబిచ్చింది.

ఒక్క సీజన్‌తోనే..
ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వార్నర్‌ది ప్రస్తుతం అయిదో స్థానం. తొలి నలుగురు అతని కంటే కనీసం 40 మ్యాచ్‌లు ఎక్కువగా ఆడారు. మరే ఆటగాడికి సాధ్యం కాని విధంగా ఇప్పటికే మూడు సీజన్ల (2015, 2017, 2019)లో ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు. సారథిగా సన్‌రైజర్స్‌కు ఏకైక టైటిల్‌ (2016) అందించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే లీగ్‌లో అతని రికార్డులెన్నో. ఇలాంటి ఆటగాడిని ఒక్క సీజన్‌లో విఫలమయ్యాడనే కారణంతో సన్‌రైజర్స్‌ వదులుకోవాలనుకుంది. ఈ ఏడాది భారత్‌లో ఆడిన తొలి అంచె సీజన్‌లో మొదటి ఆరు మ్యాచ్‌ల్లో జట్టు ఒక్కటే గెలవడంతో కెప్టెన్‌గా వార్నర్‌ను యాజమాన్యం తప్పించింది. ఆ తర్వాత తుది జట్టులోనూ చోటు కల్పించలేదు. ఇక యూఏఈలో రెండో అంచె మ్యాచ్‌ల్లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడించాక మళ్లీ వేటు వేశారు. 2015 నుంచి కెప్టెన్‌గా (బాల్‌ టాంపరింగ్‌ కారణంగా 2018లో ఆడలేదు, 2019లో నాయకత్వం వహించలేదు) జట్టుకు అత్యుత్తమ ఫలితాలు అందించిన అతని పట్ల యాజమాన్యం ఇలా కఠినంగా వ్యవహరించడం అభిమానులకు బాధ కలిగించింది. వార్నర్‌లోనూ అది కసి పెంచిందో ఏమో.. తన సత్తా ఏంటో నిరూపించాలనుకున్న అతను   ప్రపంచకప్‌లో అవకాశం రాగానే చెలరేగాడు.


నాకు ముందే తెలుసు

టీ20 ప్రపంచకప్‌లో వార్నర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలుస్తాడని తనకు ముందే తెలుసని ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఫించ్‌ తెలిపాడు.‘‘వార్నర్‌ పని అయిపోయిందని కొన్ని వారాల క్రితం కొంతమంది అన్నారు. కానీ అది ఎలుగుబంటిని పొడవడం లాంటిది. అలా చేస్తేనే ఎలుగుబంటి రెచ్చిపోతుంది. ఇప్పుడు వార్నర్‌ కూడా అలాగే చెలరేగాడు. నిజంగా చెప్తున్నా కొన్ని నెలల కిత్రం కోచ్‌ లాంగర్‌తో మాట్లాడినప్పుడు ‘వార్నర్‌ గురించి ఆందోళన చెందవద్దు. అతను ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీగా నిలుస్తాడు’ అని చెప్పా. తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడే అతని అత్యుత్తమ ఆట బయటకు వస్తుంది’’ అని ఫించ్‌ పేర్కొన్నాడు.


మళ్లీ హాట్‌కేక్‌లా..

తెలుగు అభిమానులకు వార్నర్‌ ఎంతో దగ్గరయ్యాడు. సన్‌రైజర్స్‌ అంటే వార్నర్‌.. వార్నర్‌ అంటే సన్‌రైజర్స్‌ అనేంతలా అతను ప్రభావం చూపాడు. తెలుగు సినిమాల పాటలకు, సంభాషణలకు తగినట్లు   వీడియోలు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో మనవాడనే భావన పెరిగింది. అందుకే ఈ ఏడాది అతని పట్ల సన్‌రైజర్స్‌ ప్రవర్తనపై అభిమానులు తీవ్ర ఆగ్రహంతో పాటు ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ అతను సన్‌రైజర్స్‌తోనే ఆడాలని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఆ అవకాశం లేదనే చెప్పాలి. సన్‌రైజర్స్‌ కావాలనే వార్నర్‌ను దూరం చేసుకోవాలనుకుందని, అతని ప్రదర్శన కాకుండా దాని వెనక ఇతర కారణాలున్నాయనే వ్యాఖ్యలు గతంలో వినిపించిన సంగతి తెలిసిందే. మరోవైపు సీజన్‌ ముగిశాక వార్నర్‌ కూడా.. ఇక్కడి అభిమానులకు తాను దూరం కాబోతున్నట్లు వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడు. దీంతో సన్‌రైజర్స్‌తో అతని బంధం ముగిసిందనే వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే ఐపీఎల్‌ మెగా వేలంలో అతను మరోసారి హాట్‌కేక్‌ కానున్నాడు. ఆర్సీబీ కెప్టెన్‌గా కోహ్లి తప్పుకోవడంతో వార్నర్‌ కోసం ఆ జట్టు పోటీపడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది లీగ్‌లో రెండు కొత్త జట్లు చేరుతున్న సంగతి తెలిసిందే. వాటిలో ఒకదానికి కెప్టెన్‌గా అతను మళ్లీ లీగ్‌లో అడుగుపెడతాడనే ప్రచారమూ  సాగుతోంది. మరి వార్నర్‌ ఎక్కడ అడుగు పెడతాడో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని