Updated : 06/10/2021 17:29 IST

RCB Vs SRH:ఊపుమీదున్న ఆర్‌సీబీ.. సన్‌రైజర్స్‌ తీరు ఇకనైనా మారేనా?

(Photo: RCB Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌-14 సీజన్‌లో బుధవారం రాత్రి మరో ఆసక్తికరమైన పోరు జరగనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు.. పరాజయాల పరంపర కొనసాగిస్తున్న  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. 12 మ్యాచ్‌లు ఆడి ఎనిమిది విజయాలతో ఆర్‌సీబీ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ ఖరారు చేసుకోగా.. అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తూ ఆడిన 12 మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే నెగ్గిన సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి చాలా రోజుల క్రితమే నిష్క్రమించింది. ఈ రెండు జట్లలో పరిస్థితి ఎలా ఉందో ఓ సారి తెలుసుకుందాం.

హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న కోహ్లి సేన..

ఈ సీజన్‌ తొలి దశ నుంచే ఆర్‌సీబీ మెరుగ్గా ఆడుతోంది. తొలి దశలో ఏడు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు.. మొదట నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. తర్వాత  జరిగిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓటమిపాలైంది. రెండో దశలో కోల్‌కతా, చెన్నై చేతిలో కంగుతిన్న ఆర్‌సీబీ.. తర్వాత పుంజుకుంది. బలమైన ముంబయి ఇండియన్స్‌ జట్టును 54 పరుగులతో ఓడించింది. అనంతరం రాజస్థాన్, పంజాబ్‌ కింగ్స్‌పై కూడా నెగ్గి హ్యాట్రిక్‌ విజయాలను నమోదు చేసి ప్లే ఆఫ్స్‌ని ఖరారు చేసుకుంది. సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో టాప్‌-2లో నిలవాలని భావిస్తోంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, దేవదత్‌ పడిక్కల్‌ నిలకడగా పరుగులు చేస్తున్నారు. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ కూడా ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.

మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ ఏబీ డివిలియర్స్‌ నుంచి ఇప్పటివరకు భారీ ఇన్నింగ్స్‌ రాలేదు. ఇదొక్కటే ఆందోళన కలిగించే విషయం. బౌలింగ్‌లో హర్షపటేల్ అదరగొడుతున్నాడు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అంతేకాదు ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు (26) తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. మణికట్టు మాంత్రికుడు యుజువేంద్ర చాహల్‌ గాడిలో పడ్డట్టు కనిపిస్తున్నాడు. ఆదివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీశాడు. మహ్మద్‌ సిరాజ్‌ అంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఏడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. బౌలింగ్‌లో ఈ జట్టు ఇంకాస్త మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. లేకుంటే ప్లే ఆఫ్స్‌లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

సన్‌రైజర్స్‌..ఇకనైనా గెలుపు బాట పట్టేనా?

ఈ సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న జట్టు ఏదైనా ఉందంటే అది సన్‌రైజర్సే. తొలి దశలో ఏడు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌..పంజాబ్‌ కింగ్స్‌ జట్టుపై మాత్రమే విజయం సాధించింది. రెండో దశలో పుంజుకుంటుందనుకుంటే భావించినా.. పరిస్థితి మార్పు మాత్రం కనిపించడం లేదు. ఈ దశలో నాలుగు మ్యాచ్‌లో ఆడిన ఎస్‌ఆర్‌హెచ్‌.. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది.  సన్‌రైజర్స్‌ ఓటములకు ప్రధాన కారణం బ్యాటింగ్‌ ఆర్డర్‌ పూర్తిగా విఫలమవడం. ఏ ఒక్క బ్యాటర్‌ కూడా నిలకడగా పరుగులు చేయడం లేదు. విలియమ్సన్‌,సాహా, అబ్దుల్ సమద్‌, మనీశ్ పాండే, కేదార్‌ జాదవ్‌ ఇలా ఏ ఆటగాడిని తీసుకున్న నిలకడగా పరుగులు చేయడం లేదు. బౌలింగ్‌లో రషీద్‌ఖాన్‌ ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపిస్తున్నాడు. భువనేశ్వర్‌ కుమార్‌, సందీప్‌ శర్మ, ఖలీల్ అహ్మద్‌, సిద్దార్థ్ కౌల్‌ ప్రభావం చూపలేకపోతున్నారు. మిగిలిన రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లోనైనా బ్యాటింగ్‌, బౌలింగ్‌లో లోపాలను సరిచేసుకుని  టోర్నీని విజయాలతో ముగిస్తుందేమో చూడాలి. 

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని