IPL 2022: నలుగురిని రిటెయిన్‌ చేసుకునేందుకు పాత ఫ్రాంచైజీలకు ఛాన్స్‌

ఐపీఎల్‌లో ఆటగాళ్ల రిటెయిన్‌, మెగా వేలంపై ప్రత్యేక చర్చ

Published : 28 Oct 2021 23:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్)లో వచ్చే సీజన్‌ నుంచి పది జట్లు పోటీపడనున్నాయి. అహ్మదాబాద్‌, లఖ్‌నవూ జట్లను బిడ్డింగ్‌ ప్రక్రియలో దాదాపు రూ.12,600 కోట్లకు సీవీసీ క్యాపిటల్స్, ఆర్పీజీ గ్రూప్ దక్కించుకున్నాయి. ఐపీఎల్ 2022 సీజన్‌కు సంబంధించి త్వరలో భారీ వేలం నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న ఎనిమిది జట్లు గరిష్ఠంగా నలుగురు ఆటగాళ్లను (గతంలో ముగ్గురినే) తమ వద్దే ఉంచుకునేందుకు అవకాశం కల్పించింది. అలానే ఎనిమిది జట్లు రిటెయిన్ చేసుకున్న తర్వాత మిగిలిన ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐ విడుదల చేస్తుంది. మెగా వేలానికి ముందే ఆ జాబితా నుంచి ముగ్గురేసి క్రికెటర్లను ఎంచుకునే ఛాన్స్‌ను కొత్త జట్ల యాజమాన్యాలకు కల్పించింది. అయితే మెగా వేలం నిర్వహణ ఎప్పుడనేది ఇంకా నిర్ణయించలేదు.  

రిటెయిన్ నియమాలపై ఐపీఎల్‌ నిర్వాహకులు, ఫ్రాంచైజీల మధ్య ఈ వారంలో అనధికారికంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రిటెయిన్‌లో రెండు రకాల కాంబినేషన్లను ఎంపిక చేసినట్లు సమాచారం. అందులో ముగ్గురు భారత క్రికెటర్లు.. ఒకరు విదేశీయుడు, రెండోది ఇద్దరేసి స్వదేశీ, విదేశీ క్రికెటర్లను అట్టిపెట్టుకునే అవకాశం. ముగ్గురు భారత క్రికెటర్లలో అందరూ క్యాప్‌డ్‌ లేదా అందరూ అన్‌క్యాప్‌డ్.. లేకపోతే రెండు రకాలవారినీ రిటెయిన్‌ చేసుకోవచ్చు. కొత్తగా రెండు జట్లు తీసుకునే ముగ్గురి ఆటగాళ్లలో ఇద్దరు భారతీయులు.. ఒకరు విదేశీ క్రీడాకారుడు అయి ఉండాలి. ఒకరిని రిటెయిన్‌ చేసుకోవాలంటే ఆటగాడి అభిప్రాయం కూడా కీలకం కానుంది. రిటెయిన్‌ చేసుకుంటే జట్టులో ఉండాలా.. మెగా వేలానికి వెళ్లాలా అనేది నిర్ణయించుకునే అవకాశం ఆటగాడికే ఉంది. ఫ్రాంచైజీని మార్చుకోవడం, వేలంలోకి వెళ్లాలనుకోవడం వంటి నిర్ణయాలను తీసుకోవచ్చు. ఫ్రాంచైజీలు నవంబర్‌ నెలాఖరులోగా రిటెయిన్‌ జాబితాను బీసీసీఐకి అందివ్వాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని