Published : 25/11/2021 01:58 IST

Kane Williamson: స్పిన్‌దే కీలక పాత్ర.. పిచ్‌ను బట్టి బరిలోకి దించుతాం

ఇంటర్నెట్‌ డెస్క్: టీమ్‌ఇండియాతో రెండు టెస్టుల సిరీస్‌కు న్యూజిలాండ్‌ సన్నద్ధమవుతోంది. గురువారం (నవంబర్ 25) కాన్పూర్‌ వేదికగా తొలి మ్యాచ్‌ ఆడనుంది. కివీస్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ కేన్ విలియమ్సన్‌ జట్టుతో చేరిపోయాడు. ఈ సిరీస్‌లో స్పిన్‌ కీలక పాత్ర పోషిస్తుందని కేన్‌ విలియమ్సన్ పేర్కొన్నాడు. టెస్టు సిరీస్‌ కోసం టీ20 ప్రపంచకప్‌ అనంతరం భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడని కేన్‌ విశ్రాంతి తీసుకున్నాడు. న్యూజిలాండ్‌ జట్టుతో సాధన చేసిన కెప్టెన్ విలియమ్సన్‌ మీడియాతో మాట్లాడాడు. ‘‘కొత్త బంతిని సీమర్‌ లేదా స్పిన్నర్‌ ఎవరికైనా ఇవ్వొచ్చు.  బ్యాటర్లపై ప్రభావం చూపేందుకు విభిన్నరీతుల్లో బంతులు విసరాల్సి ఉంటుంది. అంతేకాకుండా టీమ్‌ఇండియా జట్టులో యువ క్రికెటర్లు ఉన్నారు. కాబట్టి వేర్వేరు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మా వరకైతే సిద్ధంగానే ఉన్నాం. మా బౌలింగ్‌ దళంతో ఎటాక్‌ చేస్తాం’’ అని వెల్లడించాడు. 

భారత్‌ పర్యటనకు వెళ్లేటప్పుడు పర్యాటక జట్లు ఎక్కువ స్పిన్నర్లను ఎంచుకోవడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయా? అనేదానికి విలియమ్సన్‌ సమాధానం ఇచ్చాడు. ‘‘అనుకూలించడం, సర్దుబాటు చేసుకోవడం కంటే ఆ సమయానికి పిచ్‌ దేనిమీద ప్రభావవంతంగా ఉంటుందో చూడటం చాలా ముఖ్యమైన అంశమని భావిస్తా. అంతర్జాతీయంగా స్పిన్‌ విభాగం చాలా పెద్దది. ఆటను ఏ క్షణంలోనైనా మార్చేయగలదు. భారత్‌, కివీస్‌ జట్ల రెండూ బలమైన స్పిన్‌ బౌలింగ్‌ దళంతో బరిలోకి దిగుతాయని అనుకుంటున్నా. మా జట్టు సన్నద్ధత చాలా బాగుంది. టెస్టు సిరీస్‌ కోసం ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అయితే సిరీస్‌లో మేము ఫేవరేట్లుగా కాకుండా మా ఆటను ఆడతాం.  ఎందుకంటే టీమ్ఇండియా జట్టులోని బ్యాటింగ్‌, బౌలింగ్‌ డెప్త్‌ చాలా ఎక్కువ. గత కొన్నేళ్లుగా చూస్తునే ఉన్నాం. స్వదేశంలోని పరిస్థితులపై వారికి పూర్తి అవగాహన ఉంది. అసలైన సవాల్‌ ఉందని మాత్రం భావిస్తున్నాం’’ అని కేన్‌ పేర్కొన్నాడు. 

స్పిన్‌కు అనుకూలించే భారత మైదానాల్లో ఇరు జట్లు ముగ్గురేసి స్పిన్నర్లతో బరిలోకి దిగుతాయని క్రికెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కివీస్‌ కోచ్‌ గ్యారీ స్టెడ్‌ కూడా ఇదే మాట చెప్పాడు.  అయితే పిచ్‌ పరిశీలించాక తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించాడు. కివీస్‌కు సాంట్నర్, రచిన్‌ రవింద్ర, అజాజ్ పటేల్‌, విల్‌ యంగ్‌ , విల్‌ సోమర్‌విల్లేతో కూడిన స్పిన్ దళం ఉంది. టీమ్‌ఇండియా వైపు అశ్విన్‌, జడేజా, అక్షర్ పటేల్, జయంత్‌ యాదవ్‌ వంటి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. భారత ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ ద్రవిడ్‌ మార్గదర్శకంలో ఆడబోయే తొలి టెస్టుకు అజింక్య రహానె సారథిగా వ్యవహరిస్తుండగా.. పుజారా వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలు చేపట్టాడు. మరి తొలి టెస్టు పిచ్‌ దేనికి సహకరిస్తుందో... తుది జట్టులో ఎవరు ఉంటారో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.. 

మొన్న వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపాలైన టీమ్‌ఇండియా ముఖాముఖిగా తలపడిన సిరీసుల్లో మాత్రం ఆధిక్యత ప్రదర్శించింది. ఇప్పటి వరకు టెస్టుల్లో న్యూజిలాండ్, భారత్‌ జట్లు ముఖాముఖిగా 24 టెస్టు సిరీసుల్లో తలపడగా.. టీమ్‌ఇండియా 13 సిరీస్‌లు, న్యూజిలాండ్‌లు 8 సిరీస్‌లను కైవసం చేసుకున్నాయి. మరో మూడు సిరీస్‌లు డ్రాగా ముగిశాయి. 1955లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగియగా.. 2021లో టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో కివీస్‌ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. మరి ఈ సిరీస్‌ను కూడా గెలుచుకుని ఆధిక్యతను నిలబెట్టుకోవాలని, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్‌ఇండియా అభిమానులు కోరుకుంటున్నారు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని