Virat- Rohit : టెస్టుల్లోనూ.. కోహ్లీ స్థానంలో రోహిత్‌నే నియమించాలి: పీటర్సన్

టెస్టు కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ వీడ్కోలు నిర్ణయం తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని...

Published : 22 Jan 2022 01:41 IST

బ్యాటింగ్‌లో విరాట్ రాణిస్తాడన్న అలెన్‌ డొనాల్డ్

ఇంటర్నెట్ డెస్క్‌: టెస్టు కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ వీడ్కోలు నిర్ణయం తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్ అన్నాడు. చాలా రోజులపాటు బయోబబుల్‌లో ఆడటం సవాల్‌తో కూడుకున్నదేనని, అందుకే విరాట్ కెప్టెన్‌ బాధ్యతలను వదిలేసి ఉంటాడని అభిప్రాయపడ్డాడు. విరాట్ స్థానంలో టెస్టు ఫార్మాట్‌కు రోహిత్ శర్మనే నియమించాలని సూచించాడు. లెజెండ్స్‌ క్రికెట్ లీగ్ సందర్భంగా కెవిన్ మాట్లాడుతూ.. ‘‘విరాట్‌ స్థానంలో టెస్టు జట్టుకు సారథిగా ఎవరిని నియమించాలని అడిగితే మాత్రం ఇద్దరి పేర్లనే చెబుతా. రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్‌ మాత్రమే ఛాయిస్‌. రిషభ్‌ పంత్ టెస్టులకు అవసరం లేదు.. కానీ, వన్డే జట్టు కెప్టెన్‌గా అయితే ఓకే అని చెప్పగలను. హిట్‌మ్యాన్‌ ఆటను ఆస్వాదించేందుకు ఎంతో ఇష్టపడతా. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ కోసం చాలా కష్టపడ్డాడు’’ అని చెప్పుకొచ్చాడు. యాషెస్‌ సిరీస్‌ను ఇంగ్లాండ్‌ ఓడిపోవడంపై ఐపీఎల్‌ను బూచిగా చెప్పడం సరికాదన్నాడు. ఇంగ్లాండ్‌ టెస్టు జట్టులో కేవలం నలుగురు మాత్రమే (స్టోక్స్, బెయిర్‌స్టో, బట్లర్, మలన్‌) ఐపీఎల్‌లో ఆడుతున్నారని, మిగతావారు లేరని గుర్తు చేశాడు.

కోహ్లీ పుంజుకుంటాడు: అలెన్

గొప్ప ఆటగాడికైనా ఏదోఒక సందర్భంలో పతనం తప్పదని దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్‌ బౌలర్ అలెన్ డొనాల్డ్‌ అభిప్రాయపడ్డాడు. తొలి వన్డేలో విరాట్ కోహ్లీ (51) అర్ధ శతకం సాధించిన విషయం తెలిసిందే. అయితే కోహ్లీ టెక్నిక్‌ విషయంలో మెరుగుపడ్డాడో, లేదో కచ్చితంగా చెప్పలేనని డొనాల్డ్‌ చెప్పాడు. ‘‘దక్షిణాఫ్రికా బౌలర్లు టీమ్‌ఇండియా బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి తేగలిగారు. అయితే, విరాట్ టెక్నికల్‌గా బాగా ఆడాడో, లేదో చెప్పలేను. ఎంతటి గొప్ప స్థాయి ఆటగాడికైనా పతనావస్థ తప్పదు. బాల్‌ ట్యాంపరింగ్‌ తర్వాత తిరిగి వచ్చిన స్టీవ్‌ స్మిత్‌ కూడా బీభత్సంగా ఏమీ ఆడలేదు. అలాగే, విరాట్ కోహ్లీ అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ఆటగాడు. అతను ఏదోఒక సమయంలో పుంజుకోగలడని కచ్చితంగా చెప్పగలను. దీనికి ఎక్కువ సమయం కూడా పట్టకపోవచ్చు’’ అని అలెన్‌ డొనాల్డ్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని