T20 World Cup: ఆఖర్లో దంచిన కివీస్‌.. పట్టు సడలించిన నమీబియా

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి ఊపు మీదున్న న్యూజిలాండ్‌ను భారీ స్కోరు సాధించకుండా నమీబియా బౌలర్లు...

Updated : 05 Nov 2021 17:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి ఊపు మీదున్న న్యూజిలాండ్‌ను భారీ స్కోరు సాధించకుండా నమీబియా బౌలర్లు అడ్డుకున్నారు. అయితే ఆరంభంలో కట్టడి చేసిన నమీబియా.. ఆఖర్లో పట్టు సడలించడంతో కివీస్‌ మంచి స్కోరు చేయగలిగింది. సెమీస్‌ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలంటే కివీస్‌ తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో టాప్‌-ఆర్డర్‌ దూకుడుగా ఆడలేకపోయింది. కీలకమైన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన  కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. దీంతో నమీబియాకు 164 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 

అఫ్గాన్‌ మీద భారీ ఇన్నింగ్స్‌ ఆడిన న్యూజిలాండ్‌ ఓపెనర్ మార్టిన్‌ గప్తిల్ (18: ఒక ఫోర్‌, ఒక సిక్స్‌) ఈసారి పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. నమీబియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ధాటిగా ఆడలేకపోయాడు. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (28: రెండు ఫోర్లు, ఒక సిక్స్‌) ఫర్వాలేదనిపించినా.. కీలక సమయంలో ఔటయ్యాడు. డారిల్ మిచెల్‌ (19: రెండు ఫోర్లు) దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. డేవన్‌ కాన్వే (17) విఫలమయ్యాడు. ఆఖర్లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (39: ఒక ఫోర్‌, 3 సిక్సర్లు), నీషమ్‌ (35: ఒక ఫోర్‌, రెండు సిక్సర్లు) వేగంగా ఆడటంతో ఈ స్కోరునైనా న్యూజిలాండ్‌ సాధించగలిగింది. పన్నెండు ఓవర్లకు 81/1గా ఉన్న కివీస్‌ స్కోరు 160 దాటిందంటే వీరిద్దరి చలవే. ఆఖర్లో బ్యాటర్లు హిట్టింగ్‌కు దిగడంతో ప్రత్యర్థి ముందు కఠినమైన లక్ష్యాన్ని ఉంచగలిగారు. నమీబియా బౌలర్లలో బెమార్డ్‌, వైజ్‌, ఎరాస్మస్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు